హోండా మొబిలియో ఎమ్‌పివిలో కొత్త వేరియంట్స్ విడుదల
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన తమ తొలి ఎమ్‌పివి 'మొబిలియో'లో కంపెనీ తాజాగా మరో రెండు కొత్త వేరియంట్లను పరిచయం చేసింది. మొబిలియో వి (ఆప్షనల్) మరియు మొబిలియో ఆర్ఎస్ (ఆప్షనల్) అనే రెండు కొత్త వేరియంట్లను హోండా కార్స్ ఇండియా విడుదల చేసింది.
ఈ వేరియంట్లలో సెగ్మెంట్లో కెల్లా మొట్టమొదటి సారిగా ఆడియో వీడియో నావిగేషన్ (ఏవీఎన్) మరియు రియర్ వ్యూ పార్కింగ్ కెమెరాను ఆఫర్ చేస్తున్నారు.కొత్తగా పరిచయం చేసిన హోండా మొబిలియో వి (ఆప్షనల్) వేరియంట్ ఓ టాప్-ఎండ్ వెర్షన్. ప్రస్తుతం లభిస్తున్న ఈ, ఎస్ వి వేరియంట్లకు ఎగువన దీనిని ప్రవేశపెట్టారు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఇకపోతే హోండా మొబిలియో ఆర్ఎస్ (ఆప్షనల్ వేరియంట్)ను ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న స్పోర్టీ మొబిలియో ఆర్ఎస్ వేరియంట్‌కు ఎగువన ప్రవేశపెట్టనున్నారు. మొబిలియో ఆర్ఎస్ మరియు ఆర్ఎస్ (ఆప్షనల్) వేరియంట్లు సెప్టెంబర్ మధ్య భాగం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఈ కొత్త వేరియంట్లలో పరిచయం చేసిన ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్ 15.7 సెం.మీ. టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉండి మ్యాప్స్, శాటిలైట్ బేస్డ్ వాయిస్ గైడెడ్ నావిగేషన్ ఫీచర్లతో పాటుగా డివిడి/సిడి, బ్లూటూత్, యూఎస్‌బి, ఆక్స్, ఐ-పాడ్, ఎమ్‌పి3, ఎఫ్ఎమ్/ఏఎమ్ కనెక్టివిటీతో ఓ కంప్లీట్ ఇన్-కార్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌గా పనిచేయనుంది.

భారతదేశంలోని తమ కస్టమర్లకు ఈ కొత్త హోండా మొబిలియో వేరియంట్లను ఆఫర్ చేయటం తమకెంతో సంతోషంగా ఉందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన హోండా మొబిలియో వేరియంట్లలో ఏవీఎన్, రివర్స్ కెమెరాతో పాటుగా డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ఆర్మ్ రెస్ట్స్ ఉడెన్ ఫినిష్ ఇంటీరియర్ ప్యానెల్‌ను జోడించారు.
ఈ కొత్త వేరియంట్ల చేరికతో మొత్తం మొబిలియో వేరియంట్ల సంఖ్య 10కి పెరిగింది. కొత్త వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి:
* మొబిలియో 1.5లీ వి (ఆప్షనల్) - రూ.9.46 లక్షలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, పెట్రోల్)
* మొబిలియో 1.5లీ వి (ఆప్షనల్) - రూ.10.45 లక్షలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, డీజిల్)
* మొబిలియో ఆర్ఎస్ (ఆప్షనల్) - రూ.11.55 లక్షలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, డీజిల్)
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








