మహీంద్రా రేవా నుంచి ఈ2ఓ ప్రీమియం వేరియంట్ విడుదల
మహీంద్రా గ్రూపుకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగం మహీంద్రా రేవా, భారత విపణిలో విక్రయిస్తున్న తమ ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు రేవా ఈ2ఓలో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. మహీంద్రా రేవా గురువారం నాడు ఈ2ఓ కారులో ప్రీమియం వేరియంట్‌ను విడుదల చేసింది.
దేశీయ విపణిలో మహీంద్రా రేవా ఈ2ఓ ప్రీమియం వేరియంట్ ధరను రూ.5.72 లక్షలు (ఆన్ రోడ్ ధర, న్యూఢిల్లీ)గా నిర్ణయించారు. ఈ ప్రీమియం వేరియంట్ కోసం ఢీల్లీలో నెలకు రూ.2,999 చొప్పున ఎనర్జీ ఫీజుగా ఐదేళ్లు చెల్లించాల్సి ఉంటుందని, ఈ చార్జీలతో ఐదేళ్లలో ఈ కారు యజమాని 50,000 కి.మీ. దూరం ప్రయాణించవచ్చని మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈవో చేతన్ మైనీ వివరించారు.

రెగ్యుల్ ఈ2ఓతో పోల్చుకుంటే ఈ కొత్త ఈ2ఓ ప్రీమియం వేరియంట్‌లో అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, లాంగ్ రేంజ్ (ఒక్కసారి చార్జింగ్ చేస్తే 120 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు), ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, రియర్ కెమెరా, పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లున్నాయి.
మహీంద్రా రేవా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారును యజమానులు తమ స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకో కంపెనీ ప్రత్యేకంగా ఓ అప్లికేషన్‌ను తయారు చేసింది. ఈ అప్లికేషన్ సాయంతో, స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ స్థాయి, ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్, సమీపంలోని చార్జింగ్ పాయింట్స్ మొదలైన సమాచారాన్ని పొందవచ్చు. తమ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే నగరాల్లో ఇప్పటికే 300కు పైగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది చివరికల్లా మరో వంద చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చేతన్ తెలిపారు.


Click it and Unblock the Notifications








