ఆర్డర్ మేరకే మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ మోడల్ 'మహీంద్రా స్కార్పియో' ఎస్‌యూవీ సెగ్మెంట్లో రారాజుగా వెలుగొందుతున్న సంగతి తెలిసినదే. ఈ సెగ్మెంట్లోకి తాజాగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో వంటి మోడళ్లు వచ్చినప్పటికీ, స్కార్పియో డిమాండ్ మాత్రం చెక్కు చెదరటం లేదు.
మహీంద్రాకు సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచిన స్కార్పియోని తొలిసారిగా 2002లో విడుదల చేశారు. దీని బేస్ వేరియంట్ ధర రూ.7.82 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.12.75 లక్షలుగా ఉంది. వేరియంట్లలో ధరల వ్యత్యాసం కారణంగా, అన్ని స్కార్పియో వేరియంట్లు సమానంగా అమ్ముడుపోవటం లేదు.

స్కార్పియోలో ఖరీదైన వేరియంట్లు కేవలం అతికొద్ది సంఖ్యలోనే అమ్ముడుపోతున్నాయి. అందుకే, మహీంద్రా ఇలాంటి వాటిని ప్రత్యేకంగా కస్టమర్ల ఆర్డర్ మేరకు తయారు చేయించి ఇస్తోంది. మనం మాట్లాడుకుంటున్నది ఆటోమేటిక్ వేరియంట్ మహీంద్రా స్కార్పియో గురించి. మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ టాప్-ఎండ్ వెర్షన్‌లో రెండు వేరియంట్లలో (విఎల్ఎక్స్ 2వీల్ డ్రైవ్ మరియు విఎల్ఎక్స్ 4వీల్ డ్రైవ్) ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.11.72 లక్షలు మరియు రూ.12.75 లక్షలుగా ఉన్నాయి.
ఈ వేరియంట్ల ధరలను పరిగణలోకి తీసుకుంటే, ఇవి మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్య్లూ4 (రూ.10.69 లక్షలు) మరియు డబ్ల్యూ6 (రూ.11.91 లక్షలు) వేరియంట్ల కన్నా ఎక్కువగా అనిపిస్తాయి. అందుకే, ఆటోమేటిక్ స్కార్పియో కొనేవారి సంఖ్య పరిమితంగా ఉంటుంది. అయితే, ఈ రెండు మహీంద్రా ఎక్స్‌యూవీ500 వేరియంట్లు కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే లభిస్తాయి కాబట్టి, ఆటోమేటిక్ స్కార్పియో ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యంత తక్కువ ధర కలిగిన ఆటోమేటిక్ ఎస్‌యూవీ గాను మరియు అత్యంత సరసమైన ధరకే లభ్యమయ్యే ఫోర్-వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ ఎస్‌యూవీగాను నిలుస్తుంది.

కాగా.. మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్‌కు తక్కువ డిమాండ్ ఉన్న కారణంగా, కంపెనీ దీని ఉత్పత్తిని నిలిపివేసి కస్టమర్ల నుంచి ఆర్డర్ల మేరకే తయారు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఇలా ఆర్డర్ చేసుకునే కస్టమర్లు తమ ఆటోమేటిక్ ఎస్‌యూవీని పొందటానికి కనీసం రెండు నెలలైనా వేచి ఉండక తప్పదు.
మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ ఎస్‌యూవీలో 2197సీసీ, 4-సిలిండర్, ఎమ్‌హాక్ సిఆర్‌డిఈ, టర్బోచార్జ్డ్, కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పిల శక్తిని, 1800-2800 ఆర్‌పిఎమ్ వద్ద 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రియర్ (టూ) వీల్ డ్రైవ్, ఆల్ (ఫోర్) వీల్ డ్రైవ్ సిస్టమ్‌లతో లభ్యం కానున్న ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








