మహీంద్రా వెరిటో వైబ్ టీజర్; జూన్ 5న విడుదల
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి తొలిసారిగా ఓ కాంపాక్ట్ కారు మరో రెండు రోజుల్లో మార్కెట్లోకి రాబోతుంది. మహీంద్రా అందిస్తున్న 'వెరిటో' సెడాన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన కాంపాక్ట్ కారు (సబ్-ఫోర్ మీటర్ కారు) 'వెరిటో వైబ్' (Verito Vibe)ను కంపెనీ జూన్ 5, 2013న మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో వెరిటో వైబ్‌కు సంబంధించిన ఓ టీజర్ ఇమేజ్‌ను కంపెనీ విడుదల చేసింది.
ఈ త్రీబాక్స్ (రెండు వరుసలో సీటింగ్ ప్లస్ బూట్ స్పేస్) కారు చిన్నదిగా ఉన్నప్పటికీ పెద్ద బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం చిన్న కార్లపై భారత ప్రభుత్వం అందిస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు గాను కంపెనీ ఈ మహీంద్రా వెరిటో వైబ్ కాంపాక్ట్ కారును రూపొందించింది.(నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు, 1500సీసీ కన్నా తక్కువ ఇంజన్ సామర్థాన్ని కలిగి ఉండే కార్లను ప్రభుత్వం చిన్న కార్లుగా పరిగణించి ఎక్సైజ్ రాయితీలను అందిస్తుంది).
మరోవైపు ప్రస్తుతం దేశీయ విపణిలో చిన్న కార్ల ట్రెండ్ నడుస్తుండటం కూడా వెరిటో వైబ్ విడుదలకు ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ఈ కాంపాక్ట్ కారులో 1.5 లీటర్ డిసిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. రెనో సంస్థ నుంచి గ్రహించిన ఈ ఇంజన్ సగటును లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేయనుంది. ఈ కాంపాక్ట్ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్‌ను గమనిస్తూనే ఉండండి..!



Click it and Unblock the Notifications








