25 లక్షల మంది జీవితాల్లోకి ప్రవేశించిన మారుతి ఆల్టో
మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న చిన్న కారు 'ఆల్టో' మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. భారత మార్కెట్లో ఈ బ్రాండ్ ఇప్పటికే 25 లక్షల మంది వినియోగదారులకు చేరునవయ్యింది. దేశీయ విపణిలో తాజాగా 25 లక్షల యూనిట్ల సేల్స్ మార్కును దాటిన రెండవ మారుతి సుజుకి కారుగా ఆల్టో రికార్డు సృష్టించింది.
భారత మార్కెట్లో ఇప్పటి వరకు మారుతి 800 కారు మాత్రమే ఈ సేల్స్ రికార్డును సాధించిన కారుగా ఉండేది. తాజాగా మారుతి ఆల్టో కారు కూడా 25 లక్షల క్లబ్‌లోకి చేరిపోయిందని మారుతి సుజుకి ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. మారుతి ఆల్టోని తొలిసారిగా 2000లో విడుదల చేశామని, 14 ఏళ్ల కన్నా తక్కువ సమయంలో ఈ కారు 25 లక్షల మైలురాయిని చేరుకుందని మారుతి సుజుకి ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) మనోహర్ భట్ తెలిపారు.

దశాబ్ధ కాలంలో మారుతి సుజుకి ఆల్టో కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అమ్మకాల పరంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశీయ మార్కెట్లో 25 లక్షల ఆల్టో కార్ల అమ్మకాలు కాకుండా, ఈ సమయంలో కంపెనీ విదేశాలకు 2.85 లక్షల ఆల్టో కార్లను కూడా ఎగుమతి చేసుకుంది. ప్రస్తుతం ఆల్టో రేంజ్‌లో మొత్తం 8 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.2.41 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
మారుతి సుజుకి సెప్టెంబర్ 2000లో ఆల్టో కారును విడుదల చేసింది. తొలుత ఇది 800సీసీ ఇంజన్‌తో మాత్రమే లభ్యమయ్యేది. ఆ తర్వాత, ఆగస్ట్ 2010లో కంపెనీ ఇందులో 1000సీసీ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు సుమారు 4 లక్షలకు పైగా ఆల్టో కె10 కార్లు అమ్ముడుపోయి ఉంటాయి. కాగా.. మారుతి సుజుకి అక్టోబర్ 2012లో పూర్తిగా రిఫ్రెష్ చేసిన సరికొత్త ఆల్టో 800 కారును విడుదల చేసింది. ఈ మోడల్ రాకతో ఆల్టో అమ్మకాలు మరింత పుంజుకున్నాయి.


Click it and Unblock the Notifications








