మ్యాన్యువల్ కన్నా ఏఎమ్‌టి సెలెరియోనే అత్యంత పాపులర్
మారుతి సుజుకి ఇండియా ప్యాసింజర్ కార్లలో కెల్లా మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) పరిశ్రమలో సరికొత్త విప్లవాలకు తెరతీయనుంది. ఇప్పటికే ఈ టెక్నాలజీతో లభిస్తున్న మారుతి సుజుకి సెలెరియో మార్కెట్లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. వాస్తవానికి మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన సెలెరియో కన్నా ఏఎమ్‌టి కలిగిన సెలెరియోనే అత్యంత పాపులర్ అయింది.
మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌కు సగటున రోజుకు 1000 యూనిట్ల బుకింగ్‌లు వస్తుంటే, అందులో సగానికి పైగా అంటే 500 యూనిట్లకు పైగా బుకింగ్‌లు ఏఎమ్‌టి గేర్‌బాక్స్ కలిగిన సెలెరియోకే వస్తున్నాయంటే, ఈ వేరియంట్ ఎంత పాపులర్ అయిందో ఇట్టే అర్థమైపోతుంది. ఇందుకు ప్రధాన కారణం, అత్యంత సరసమైన ధరకే మారుతి ఈ ఆటోమేటిక్ కారును ఆఫర్ చేయటం.

బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం, మారుతి సుజుకి తమ కార్ల ధరలను (సెలెరియోతో కలిపి) తగ్గించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన సెలెరియో ధర రూ.3.76 లక్షలుగా ఉంటే, ఏఎమ్‌టి కలిగి సెలెరియో ధర రూ.కేవలం 4.14 లక్షలుగా మాత్రమే ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అంటే, మ్యాన్యువల్ వేరియంట్ కన్నా సుమారు రూ.40,000ల అధనపు ధరకే ఆటోమేటిక్ వేరియంట్ లభిస్తోందన్నమాట. ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న అత్యంత చవకైన ఆటోమేటిక్ కారు కూడా ఇదే కావటం విశేషం.
మ్యాన్యువల్ కార్ అమ్మకాలను ఆటోమేటిక్ కారు ఓవర్‌టేక్ చేయటం ఇదే మొట్టమొదటిసారి. ఈ విధంగా చూసుకుంటే, మారుతి సుజుకి ఏఎమ్‌టి ద్వారా మరోసారి చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి మారుతి సుజుకి కూడా తమ ఏఎమ్‌టి వేరియంట్‌కు ఇంత భారీ స్థాయిలో డిమాండ్ వస్తుందని ఊహించి ఉండదు. కేవలం 25 నుంచి 30 శాతం మాత్రమే గిరాకీ ఉంటుందని కంపెనీ భావించింది. అయితే, ప్రస్తుతం ఇది 51 శాతానికి పైగా ఉంది. నిజానికి కంపెనీ ఉత్పత్తి సామర్థ్యానికి మించి పోయింది.

ప్రస్తుతం సెలెరియో కారులో ఉపయోగిస్తున్న ఏఎమ్‌టి కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి వీటిని స్థానికంగానే తయారు/కొనుగోలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. సరమైన ధర, మ్యాన్యువల్ వేరియంట్‌తో సమానమైన మైలేజ్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతి ఇవి మూడే ప్రధానంగా ఏఎమ్‌టి విజయానికి కారణాలు. త్వరలోనే ఇదే ఏఎమ్‌టి టెక్నాలజీతో టాటా బోల్ట్, జెస్ట్, నానో మరియు మహీంద్రా క్వాంటో కార్లు కూడా రానున్నాయి.


Click it and Unblock the Notifications








