మారుతి సుజుకి కొత్త కాంపాక్ట్ కారు పేరు 'సెలెరియో'
భారత ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ కార్ల విభాగంలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియా త్వరలోనే మరో సరికొత్త కాంపాక్ట్ కారును దేశీయ కస్టమర్లకు పరిచయం చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం మారుతి సుజుకి 'వైఎల్7' (YL7) అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న కాంపాక్ట్ కారుకు ఓ పేరును కూడా ఖరారు చేసింది.
తాజా అప్‌డేట్ ప్రకారం, మారుతి సుజుకి తయారు చేస్తున్న ఈ చిన్న కారుకు 'సెలెరియో' (Celerio) అనే పేరును ఉపయోగించనున్నట్లు సమాచారం. నవంబర్ 2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ మోటార్ షోలో సుజుకి ప్రదర్శించిన 'ఏ-విండ్' అనే కాన్సెప్ట్ కారే మారుతి సుజుకి నుంచి రానున్న ఈ సరికొత్త కాంపాక్ట్ కారు. ఈ కాన్సెప్ట్‌కే సెలెరియో పేరును ఉపయోగించనున్నారు.

మారుతి సుజుకి నిలిపి వేసిన ఏ-స్టార్, జెన్ ఎస్టిలో మోడళ్ల స్థానంలో ఈ కొత్త కారును ప్రవేశపెట్టనున్నారు. సుజుకి ఇప్పటికే 'సెలెరియో' అనే పేరును యూరప్ మార్కెట్లలో విక్రయిస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఆల్టో (మన మార్కెట్లో ఏ-స్టార్) కారుకు ఉపయోగిస్తోంది. మరికొన్ని మార్కెట్లలో ఆల్టో పేరుకు దిగువన సెలెరియో అనే పేరు ఉంటుంది.
సుజుకి సెలెరియో గ్లోబల్ డెబ్యూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పో ద్వారా జరుగుతుంది. సుజుకి ప్రదర్శించిన ఏ-విండ్ కాన్సెప్ట్ డిజైన్ లాంగ్వేజ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త కాంపాక్ట్ కారును తయారు చేయనున్నారు. ప్రస్తుత ఏ-స్టార్ కారుతో పోల్చుకుంటే, సుజుకి సెలెరియో మరింత విశాలమైన స్పేస్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

ప్రస్తుతం మారుతి సుజుకి ఉపయోగిస్తున్న పాపులర్ కె10 పెట్రోల్ ఇంజన్‌నే ఈ సెలెరియో కారులోను ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ ఇంజన్ ఇటు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తోను అటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తోను లభ్యమయ్యే ఆస్కారం ఉంది. సుజుకి తయారు చేస్తున్న ఓ కాంపాక్ట్ డీజిల్ ఇంజన్ (800సీసీ)ను కూడా భవిష్యత్తులో ఈ మోడల్‌లో ఉపయోగించవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








