సిఎన్‌జి వెర్షన్ మారుతి సుజుకి సెలెరియో విడుదల
మారుతి సుజుకి ఇండియా సరిగ్గా మూడు నెలల క్రితం విడుదల చేసిన సెలెరియో హ్యాచ్‍బ్యాక్‌లో కంపెనీ ఓ సిఎన్‌జి వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇదివరకటి కథనంలో మేము ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా కంపెనీ ఇందులో సైలెంట్‌గా సిఎన్‌జి వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.
మారుతి సుజుకి సెలెరియో గ్రీన్ పేరుతో ఇది కేవలం విఎక్స్ఐ వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇందులో 1.0 లీటర్ కె-నెక్స్ట్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. సాధారణంగా పెట్రోల్‌తో అయితే ఈ ఇంజన్ గరిష్టంగా 68 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ సిఎన్‌జితో మాత్రం కేవలం 58 హెచ్‍పిల శక్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ రెగ్యులర్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్, ఎర్టిగా సిఎన్‌జి మోడళ్లలో ఉపయోగిస్తున్న మారుతి పేటెంటెడ్ ఐజిపిఐ సిస్టమ్‌ను ఇందులో ఉపయోగిస్తున్నారు. డ్యూయెల్ మోడ్‌లో ఉన్నప్పుడు గ్యాస్‌ను నేరుగా కంబస్టియన్ ఛాంబర్‌కు సరఫరా చేయటంలో సిఎన్‌జి ఇంధన సరఫరాని కంట్రోల్ చేయటానికి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది.
డ్యూయెల్ మోడ్‌లో మారుతి సెలెరియో గ్రీన్ గరిష్టంగా 31.79 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. కేవలం పెట్రోల్ మోడ్‌లో మాత్రమే అయితే లీటరుకు 23.1 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. సెలెగరియో గ్రీన్‌లో ఏఎమ్‌టి అందుబాటులో లేదు. కారులో సిఎన్‌జి సిలిండర్ బరువు చేరడం వలన దీని డ్రైవింగ్ డైనమిక్స్‌లో కొద్దిగా మార్పులు ఉంటాయి. దీనిని నివారించేందుకు మారుతి దీని సస్పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చేసింది.
దేశీయ విపణిలో మారుతి సెలెరియో గ్రీన్ (సిఎన్‌జి) ధరను రూ.4.68 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








