మారుతి సుజుకి సెలెరియో ఇంటీరియర్స్ లీక్!
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి త్వరలోనే మరో సరికొత్త కాంపాక్ట్ కారును దేశీయ కస్టమర్లకు పరిచయం చేయనుందని, ప్రస్తుతం మారుతి సుజుకి 'వైఎల్7' (YL7) అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న కాంపాక్ట్ కారుకు 'సెలెరియో' (Celerio) అనే పేరును పెట్టారని, ఫిబ్రవరి 2014లో ఇది భారత మార్కెట్లో ఆవిష్కృతం కానుందని మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే.
మారుతి సుజుకి నుంచి రానున్న సెలెరియో కాంపాక్ట్ కారు ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్‌గా ఉంది. ఆకర్షనీయమైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో వస్తున్న మారుతి సుజుకి సెలెరియో కారుకు సంబంధించి ఇప్పటికే ఇంటర్నెట్లో కొన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి. అయితే తాజాగా.. ఈ కాంపాక్ట్ కారు ఇంటీరియర్ చిత్రాలను మా సన్నిహిత ఆటో బ్లాగ్ తమ కెమెరాలో బంధించింది. ఆ ఎక్స్‌క్లూజివ్ చిత్రాలను ఇప్పుడు మనం ఈ కథనంలో చూద్దాం రండి..!

మారుతి సుజుకి సెలెరియో కాన్సెప్ట్ కారు ఇంటీరియర్స్‌కు మరియు ప్రొడక్షన్ వెర్షన్ సెలెరియో కారు ఇంటీరియర్స్‌కు మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మారుతి ఏ-స్టార్ ఇంటీరియర్ స్పేస్ కన్నా ఇది సెలెరియో ఇంటీరియర్ స్పేస్ ఎక్కువగా అనిపిస్తుంది. కానీ ఎస్టిలోతో పోల్చుకుంటే మాత్రం తక్కువగానే అనిపిస్తుంది.

మారుతి సుజుకి సెలెరియో డ్యాష్‌బోర్డులో మూడు రంగులు ఉన్నాయి (బీడ్, బ్లాక్, సిల్వర్). ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో పెద్ద స్పీడోమీటర్, టాకోమీటర్, మల్టీ-ఫంక్షన్ డిస్‌ప్లే యూనిట్‌లను జోడించారు. హీటర్ విత్ ఏసి, 2-డిన్ కెన్‌వుడ్ ఆడియో సిస్టమ్, స్విఫ్ట్‌లో మాదిరిగా కనిపించే స్టీరింగ్ వీల్ ఇందులోని ప్రత్యేకతలు

ఇందులో సెమీ ఆటోమేటిక్ గేర్ బాక్సును డ్యాష్ బోర్డుకే జోడించినట్లుగా అనిపిస్తుంది. రెగ్యులర్ ఆటోమేటిక్ మోడ్స్ మాదిరిగానే ఇందులో R (రివర్స్), P (పార్కింగ్), N (న్యూట్రల్), D (డ్రైవ్) గేర్స్ ఉంటాయి. మ్యాన్యువల్ షిఫ్టింగ్ గేర్ల కోసం ఇందులో +, - బటన్స్ కూడా ఉంటాయి.

ఈ గేర్ బాక్స్ 'ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్' (ఏఎమ్‌టి). అంటే, ఇదొక క్లచ్ లేని మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్. క్లచ్‌లెస్/ఆటోమేటిక్ మ్యాన్యుల్ గేర్‌బాక్స్ అంటే, ఏఎమ్‌టి ట్రాన్సిమిషన్ కలిగిన మారుతి సుజుకి సెలెరియో కారులో డ్రైవర్ క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకుండా గేరును మ్యాన్యువల్‌గా మార్చాల్సి ఉంటుందన్నమాట. ఈ టెక్నాలజీ వలన రెగ్యులర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లోని సౌకర్యం మరియు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ యొక్క మైలేజ్ రెండూ లభిస్తాయి.

ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఈ కొత్త కారును ఆవిష్కరించనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








