ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి సెలెరియో, ఐవి-4 ఎస్‌యూవీ
వచ్చే నెలలో జరగనున్న 12వ ఢిల్లీ ఆటో ఎక్స్‌పో సరికొత్త కార్ల విడుదలకు వేదికగా మారనుంది. ఈ క్రమంలో, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా కూడా కొన్ని కొత్త కార్లను భారతీయులకు పరిచయం చేయనుంది. ఇందులో మారుతి సుజుకి సెలెరియో కాంపాక్ట్ కార్ మరియు సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీలు ప్రధానంగా చెప్పుకోదగినవి.
ఇందులో మొదటగా, మారుతి సుజుకి నిలిపివేసిన ఏ-స్టార్ మరియు ఎస్టిలో మోడళ్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు వస్తున్న సెలెరియో కాంపాక్ట్ కార్‌ను ఇప్పటికే ఏ-విండ్ కాన్సెప్ట్ రూపంలో కంపెనీ ప్రదర్శించిన సంగతి తెలిసినదే. కాగా.. 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఉత్పత్తి దశకు చేరువలో ఉన్న మారుతి సుజుకి సెలెరియో కారును కంపెనీ ప్రదర్శించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి సెలెరియో సెగ్మెంట్లో కెల్లా మొట్టమొదటి మరియు విశిష్టమైన 'ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్' (ఏఎమ్‌టి) టెక్నాలజీతో రూపుదిద్దుకుంది. అంటే, ఇదొక క్లచ్ లేని మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్). క్లచ్‌లెస్/ఆటోమేటిక్ మ్యాన్యుల్ గేర్‌బాక్స్ అంటే, ఈ టెక్నాలజీ కలిగిన కార్లలో డ్రైవర్ క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకుండా గేరును మ్యాన్యువల్‌గా మార్చుకోవచ్చు. దీని వలన రెగ్యులర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లోని సౌకర్యం మరియు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ యొక్క మైలేజ్ రెండూ లభిస్తాయి. అంతేకాకుండా, ఇవి రెగ్యులర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ల కన్నా మెరుగైన మైలేజీని కూడా ఆఫర్ చేస్తాయి.

ఇకపోతే, రెండవ కాన్సెప్ట్ అయిన సుజుకి ఐవి-4 విషయానికి వస్తే, ఇదొక మిడ్-సైజ్ ఎస్‌యూవీ. ఇది ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కన్నా పెద్దదిగా ఉంటుంది. 'గ్రాబ్ యువర్ ఫీల్డ్' అనే థీమ్‌ను ఆధారంగా చేసుకొని మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని జపాన్‌లోని ఆర్ అండ్ డి కేంద్రంలో డిజైన్ చేసింది. సాధారణ అర్బన్ క్రాసోవర్‌కు భిన్నంగా రగ్గడ్ అండ్ టఫ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం దీనిని డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది.
సుజుకి ఐవి-4 పేరుకు తగినట్లుగానే దీని బాడీ క్యారెక్టర్ ఉంటుంది. ఐవి-4 (iV-4) పేరులో ఐ అంటే ఇండివిడ్యువాలిటీ, వి అంటే వెహికల్, 4 అంటే ఫోర్-వీల్ డ్రైవ్ అని అర్థం. ఈ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను సుజుకి ఆల్‌గ్రిప్ టెక్నాలజీతో రూపొందించారు. స్ట్రైట్, స్లీక్ లైన్స్, క్లామ్‌షెల్ హుడ్, ఫైవ్ స్లాటెడ్ ఫ్రంట్ గ్రిల్, రూఫ్‌పై లేజర్ సెన్సార్లతో కూడిన ఫాగ్ ల్యాంప్స్, ఇల్యుమినేటెడ్ గ్రిల్ వంటి కొన్ని డిజైన్ ఫీచర్లు ఈ సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీలో ప్రత్యేక ఆకర్షణలు.


Click it and Unblock the Notifications








