రెట్టింపు కానున్న మారుతి సుజుకి సెలెరియో ఉత్పత్తి!
మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన చిన్న కారు 'సెలెరియో'కి అంచనాలకు మించి బుకింగ్‌లు వచ్చిన సంగతి తెలిసినదే. ప్యాసింజర్ కార్లలో కెల్లా మొట్టమొదటి సారిగా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) టెక్నాలజీతో తయారు చేసిన ఈ కారుకు భారతీయ కొనుగోలుదారుల నుంచి అశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్ ఉత్పత్తికి మించి డిమాండ్ ఉంటోంది.
ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి ఇండియా తమ సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మారుతి సుజుకి నెలకు 5,000 యూనిట్ల మేర సెలెరియో కార్లను ఉత్పత్తి చేస్తోంది. కాగా.. సెలెరియో డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ సామర్థ్యాన్ని నెలకు 10,000 యూనిట్లకు పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

ఏ కార్ మేకర్‌కైనా ఒక మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయటం అంత సులువైన అంశం కాదు. కానీ, మారుతి సుజుకికి మాత్రం ఆ అవకాశం ఉంది. ఎందుకంటే, కంపెనీ ఇప్పటికే ఏ-స్టార్ ఉత్పత్తిని నిలిపి వేసింది, మరోవైపు రిట్జ్ ఉత్పత్తిని కూడా నిలిపివేసేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. కాబట్టి, ఈ రెండింటి సామర్థ్యాలను సెలెరియో తయారీ కోసం కంపెనీ వినియోగించుకునే అవకాశం ఉంది.
విడిభాగాల సరఫరా కొరతను అధిగమించేందుకు మారుతి థర్డ్ పార్టీ వెండర్లపై ఆధారపడే అవకాశం ఉంది. అదనపు విడిభాగాల కోసం మారుతి ఇప్పటికే తమ భాగస్వాములను కోరినట్లు సమాచారం. అంతా సజావుగా సాగితే జులై నుంచి ప్రతినెలా 10,000 యూనిట్ల సెలెరియో కార్లను మారుతి సుజుకి ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మారుతి సుజుకి సెలెరియో టాప్-ఎండ్ వేరియంట్ (ఏఎమ్‌టి) సగటున ఆరు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే, ఈ వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా తగ్గే ఆస్కారం ఉంటుంది.


Click it and Unblock the Notifications








