క్లచ్ సమస్య; మారుతి సుజుకి సియాజ్ రీకాల్
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన మిడ్-సైజ్ సెడాన్ 'సియాజ్'కు అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. మారుతి సియాజ్‌లో క్లచ్ సమస్య కారణంగా, దాదాపు 3796 యూనిట్ల మ్యాన్యువల్ ట్రాన్సమిషన్ వేరియంట్లను కంపెనీ వెనక్కి పిలిపిస్తున్నట్లు ప్రకటించింది.
నవంబర్ 7, 2014 వరకూ ఉత్పత్తి అయిన సియాజ్ సెడాన్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయని మారుతి సుజుకి తెలిపింది. క్లచ్ ఆపరేషన్ సిస్టమ్‌లో ఓ భాగాన్ని రీప్లేస్ చేసేందుకు గాను ఈ రీకాల్‌ను ప్రకటించారు. ఈ రీకాల్‌కు సంబంధించి మారుతి సుజుకి ఇండియా అధీకృత డీలర్లు రీకాల్‌కు వర్తించే సియాజ్ కస్టమర్లను సంప్రదించి, ఈ సమస్య గురించి వివరించనున్నారు.

మారుతి డీలర్‌షిప్స్, సర్వీస్ సెంటర్లకు కస్టమర్లు తీసుకు వచ్చే సియాజ్ కార్లను ఉచితంగా చెక్ చేసి, సదరు లోపపూరితమైన భాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేసివ్వనున్నారు. ఇప్పటికే సియాజ్ కార్లను (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కొనుగోలు చేసి ఉన్న కస్టమర్లు తమ కారు ఈ రీకాల్‌కు వర్తిస్తుందో తెలుసుకోవాలంటే కంపెనీ వెబ్‌సైట్ www.marutisuzuki.com ను సందర్శించి తెలుసుకోవచ్చు.
మారుతి సుజుకి వెబ్‌సైట్ www.marutisuzuki.com ను ఓపెన్ చేయగానే, ఓ సియాజ్ సర్వీస్ క్యాంపైన్ మెసేజ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మరో విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ మారుతి సుజుకి సియాజ్ కారుకు సంబంధించి ఛాస్సిస్ (షాషీ) నెంబర్‌ను (MA3 తర్వాత ఉన్న 14 అంకెలు, ఆంగ్ల అక్షరాలతో కూడిన నెంబరును) నమోదు చేసి, మీ కారు రీకాల్‌కు వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు.

ఈ షాషీ నెంబర్ వెహికల్ ఐడి ప్లేట్‌పై ముద్రించబడి ఉంటుంది. లేదంటే దీనిని వాహన ఇన్వాయిస్ లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్‌పై కూడా ప్రింట్ చేయబడి ఉంటుంది. ఇదంతా ఎందుకు అనుకునే వారు, నేరుగా మారుతి సుజుకి ఇండియా అధీకృత డీలర్‌షిప్‌ను సందర్శించి, తమ సియాజ్ కారు ఈ రీకాల్‌కు వర్తిస్తుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








