సెలెరియో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచిన మారుతి సుజుకి
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా ఇటీవలే విడుదల చేసిన చిన్న కారు 'సెలెరియో' అతి తక్కువ కాలంలో సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసినదే. ఈ మోడల్‌కు ఉత్పత్తికి మించి డిమాండ్ ఉంటోంది. మారుతి సెలెరియోకి బుకింగ్‌లు వెల్లువలా వచ్చి పడుతుండటంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో, సెలెరియో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు కంపెనీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే, మారుతి సుజుకి తమ సెలెరియో ఉత్పత్తిని పెంచింది. సెలెరియో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 58,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. కాగా.. ఇందులో కంపెనీ ఇప్పటి వరకు సుమారు 28,000 సెలెరియో కార్లను మాత్రమే కస్టమర్లకు డెలివరీ చేసింది.

ఇంకా సుమారు 30,000 మందికి పైగా కస్టమర్లు తమ సెలెరియో కారు ఎప్పుడు తమ చేతికి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సెలెరియో సక్సెస్‌కు ప్రధాన కారణం.. ఈ కారులో ప్యాసింజర్ కార్లలో కెల్లా మొట్టమొదటి సారిగా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) టెక్నాలజీతో తయారు చేయటమే. ప్రస్తుతం ఈ మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు 6-8 నెలల వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదివరకు మారుతి సుజుకి నెలకు 5,000 యూనిట్ల మేర సెలెరియో కార్లను ఉత్పత్తి చేసేది. కాగా.. సెలెరియో డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ ఈ సామర్థ్యాన్ని నెలకు 7,000 యూనిట్లకు పెంచింది. క్రమంగా ఈ సామర్థ్యాన్ని నెలకు 10,000 యూనిట్లకు పెంచాలనేది మారుతి సుజుకి లక్ష్యం. ఉత్పత్తి సామర్థ్యం క్రమంగా పెరిగితే, ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా తగ్గే ఆస్కారం ఉంటుంది.


Click it and Unblock the Notifications








