1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మారుతి సుజుకి కార్
ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) టెక్నాలజీ సక్సెస్ అయిన తర్వాత మారుతి సుజుకి ఇప్పుడు మరోకొత్త సాంకేతికతను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుతి సుజుకి వచ్చే ఏడాదిలో టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన తమ తొలి ఉత్పత్తిని విడుదల చేయనుంది.
ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న రెగ్యులర్ పెట్రోల్ ఇంజన్లకు భిన్నంగా వస్తున్న ఈ కొత్త టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పరిమాణంలో చిన్నదిగా ఉండి, పెర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా, మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుందని సమాచారం. ఈ ఇంజన్‌తో రానున్న తొలి ఉత్పత్తిని 'వైఆర్ఏ' (YRA) అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నారు.
మారుతి సుజుకి వైఆర్ఏ ఓ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ (స్విఫ్ట్‌కు ఎగువన) అని వినికిడి. మారుతి మాతృ సంస్థ సుజుకి ఈ టర్బో ఇంజన్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది. ఇదొక 1.0 లీటర్ కె10సి ఇంజన్. ఇది డైరెక్ట్ ఇంజెక్టెడ్ టర్బోచార్జ్డ్ (డిఐసిటి) టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఇంజన్ సామర్థ్యం (సీసీ) తక్కువే అయినప్పటికీ, ఇది మాత్రం గరిష్టంగా 90 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుందట.

ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాధారణ (టర్బోచార్జ్డ్ కాని) 1.2 లీటర్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉత్పత్తి చేసే శక్తితో సమానం. ఈ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 90 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసినప్పటికీ, ఇది లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ తరహా టెక్నాలజీతో కూడిన ఇంజన్ (ఈకోబూస్ట్)ను ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో ఉపయోగిస్తున్న విషయం తెలిసినదే.
ఈ కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా సుజుకి 0.8 లీటర్ నుంచి 2.0 లీటర్ సామర్థ్యం కలిగిన టర్బో డీజిల్ ఇంజన్లను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ ఇంజన్లను భవిష్యత్తులో మారుతి సుజుకి తయారు చేయనున్న కార్లలో ఉపయోగించనున్నారు. వైఆర్ఏ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను స్విఫ్ట్‌కు ఎగువన ఓ గ్లోబల్ మోడల్‌గా ప్రవేశపెట్టే అకాశం ఉంది.


Click it and Unblock the Notifications








