మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ డీజిల్ విడుదల; ధర రూ.1.07 కోట్లు
జర్మన్ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, గడచిన జనవరి నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన '2014 ఎస్-క్లాస్'లో కంపెనీ తాజాగా డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఇప్పటి వరకు పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తున్న ఎస్-క్లాస్ ఇక నుంచి డీజిల్ వెర్షన్‌లో కూడా లభ్యం కానుంది.
భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్ 350 సిడిఐ (Mercedes-Benz S-Class S 350 CDI) వేరియంట్ ధర రూ.1.07 కోట్లు (ఎక్స్ షోరూమ్, పూనే)గా ఉంది. ఈ మోడల్‌ను కూడా పుణేకి సమీపంలోని చాకన్ ప్లాంట్‌లోనే అసెంబుల్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.
కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో, ఈ కారు అసెంబ్లింగ్‌ను అనుకున్న గడువు కన్నా మూడు నెలల ముందే ప్రారంభించారు. దీని తయారీలో స్థానిక విడిభాగాలను 40 శాతం వరకూ ఉపయోగిస్తుండటం వలన సరసమైన ధరకే ఇది అందుబాటులోకి వచ్చింది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ 350 సిడిఐ వేరియంట్‌లో 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 254 బిహెచ్‌పిల శక్తిని, 1600-2400 ఆర్‌పిఎమ్ వద్ద 620 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది కూడా పెట్రోల్ వెర్షన్ మాదిరిగానా 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తోనే లభిస్తుంది. ఈ ట్రాన్సిమిషన్ ద్వారా ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది (రియర్ వీల్ డ్రైవ్).

మెర్సిడెస్ బెంజ్ ఎస్ 350 సిడిఐ గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇది కేవలం 6.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఇది లీటరుకు 16.6 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ ఎస్-క్లాస్ బేస్ వేరియంట్ సెగ్మెంట్లోని ఆడి ఏ8 (3.0 లీటర్), బిఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డి, కొత్త జాగ్వార్ ఎక్స్‌జె (3.0 లీటర్) వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








