మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ విడుదల; ధర రూ.23.55 లక్షలు
మిత్సుబిషి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాజెరో స్పోర్ట్ ప్రీమియం ఎస్‌యూవీలో కంపెనీ ఓ ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. మిత్సుబిషి ఇండియా నేడు (నవంబర్ 15, 2014) తమ కొత్త పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది.
దేశీయ విపణిలో మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.23.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్‌తో లభ్యం కానుంది. ప్రస్తుతం కంపెనీ పాజెరో స్పోర్ట్ ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌కు దిగువన ఈ కొత్త పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 4x4 పాజెరో స్పోర్ట్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న 2.5 లీటర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌నే, ఈ కొత్త మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ 4x2 ఆటోమేటిక్ వేరియంట్‌లోను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 178 పిఎస్‌ల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ద్వారా వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది.
స్టీరింగ్ వీల్‌కి క్రింది భాగంలో ఉన్న ప్యాడల్ షిఫ్టర్ల ద్వారా కూడా ఈ ఆటోమేటిక్ గేర్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ పాజెరో స్పోర్ట్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లున్నాయి. ఇది ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ శాంటాఫే వంటి ప్రీమియం మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








