డస్టర్, టెర్రానో, సఫారీ సేల్స్‌ను అధిగమించిన స్కార్పియో సేల్స్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 2014 మహీంద్రా స్కార్పియో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న కొత్త స్కార్పియో కస్టమర్లను మొదటి చూపులోనే ఆకట్టుకుంటోంది. అమ్మకాల పరంగా ఇది ఈ సెగ్మెంట్లోని ఇతర ఎస్‌యూవీలన్నింటినీ అధిగమిస్తోంది.
గడచిన సెప్టెంబర్ నెలలో కొత్త మహీంద్రా స్కార్పియో అమ్మకాలు అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి. ఈ సమయంలో ఇది తమ సమీప పోటీదారులైన రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో, టాటా సఫారీ వంటి మోడళ్ల కన్నా ఎక్కువగా అమ్ముడుపోయింది. అంతేకాదు.. సెప్టెంబర్ 2014లో ఈ మూడు మోడళ్ల (డస్టర్, టెర్రానో, సఫారీ) అమ్మకాలు మొత్తం కలిపినా మహీంద్రా స్కార్పియో అమ్మకాల కన్నా తక్కువే.
సెప్టెంబర్ 2014లో మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం 6,060 స్కార్పియోలను విక్రయించింది. ఇదే సమయంలో రెనో ఇండియా 3,410 డస్టర్‌లను, నిస్సాన్ ఇండియా 1,768 టెర్రానోలను మరియు టాటా మోటార్స్ 742 సఫారీలను విక్రయించింది. కాగా.. గడచిన నెలలో ఈ మూడు మోడళ్ల (డస్టర్, టెర్రానో, సఫారీ) అమ్మకాలు మొత్తం కలిపితే 5,920 యూనిట్లు మాత్రమే అవుతాయి.

కొత్త తరం మహీంద్రా స్కార్పియో విషయానికి వస్తే.. దీనిని సరికొత్త ఛాస్సిస్‌పై తయారు చేశారు. హైడ్రోఫార్మింగ్ పద్ధతిని ఉపయోగించి ఈ ఛాస్సిస్‌ను తయారు చేశారు, ఫలితంగా ఇది మునుపటి వెర్షన్ ఛాస్సిస్ కన్నా ధృడంగా ఉంటుంది. ఈ కొత్త 2014 మహీంద్రా స్కార్పియో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్6+, ఎస్8 మరియు ఎస్10 అనే ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది.
ఇది రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్, మరొకటి 2.5 లీటర్ ఎమ్ఐ2డిఐసిఆర్ డీజిల్ ఇంజన్. ఇందులోని 2.2 లీటర్, 4-సిలిండర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పిల శక్తిని, 1800-2800 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఎస్4, ఎస్6, ఎస్6 ప్లస్, ఎస్8 మరియు ఎస్10 వేరియంట్లలో లభిస్తుంది.
ఇకపోతే బేస్ వేరియంట్ (ఎస్2) మహీంద్రా స్కార్పియోలో 2.5 లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3200 ఆర్‌పిఎమ్ వద్ద 75 బిహెచ్‌పిల శక్తిని, 1400-2200 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం ఎస్2 వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.


Click it and Unblock the Notifications








