డాట్సన్ కార్ల కోసం ప్రత్యేక షోరూమ్‌లు: నిస్సాన్ ఇండియా
జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్, ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ పురాతన కార్ బ్రాండ్ 'డాట్సన్' కోసం కంపెనీ ఇప్పుడు ప్రత్యేక షోరూమ్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ అవుట్‌లెట్ల ద్వారా మాత్రమే డాట్సన్ కార్లను విక్రయిస్తున్నారు. అయితే, మరికొద్ది రోజుల్లో డాట్సన్ పోర్ట్ ఫోలియోని, నిస్సాన్ విస్తరించనున్న నేపథ్యంలో, డాట్సన్ కోసం ప్రత్యేకంగా షోరూమ్‌లను ఏర్పాటు చేయటమే ఉత్తమమని కంపెనీ యోచిస్తోంది.
ఇది కూడా చదవండి: డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ
మరోవైపు డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌కు మార్కెట్ నుంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో, డాట్సన్ అమ్మకాలు నిస్సాన్ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తొలుత డాట్సన్ వాహనాలను నిస్సాన్ షోరూమ్‌లలోనే విక్రయిస్తామని ప్రకటించిన డాట్సన్, ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే, డాట్సన్ వాహనాలను నిస్సాన్ వాహనాల నుంచి వేరు చేసి విక్రయించనుంది.
డాట్సన్ బ్రాండ్ కార్ల కోసం ప్రత్యేకమైన షోరూమ్‌లను ఏర్పాటు చేయటంతో పాటుగా, కార్ల విడిభాగాల సరఫరా లింకును కూడా మరింత మెరుగుపరుస్తున్నామని నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్ కెనిచిరో యోముర తెలిపారు. ఉత్తర భారతదేశంలో ఒకటి, పశ్చిమ భారతదేశంలో మరొకటి చొప్పున మొత్తం రెండు కొత్త పంపిణి కేంద్రాలను ఏడాది కాలంలో ఏర్పాటు చేయనున్నామని ఆయన వివరించారు.
ప్రస్తుతం డాట్సన్ బ్రాండ్ కార్లను దేశవ్యాప్తంగా ఉన్న 130 నిస్సాన్ కార్ల షోరూమ్‌ల్లో విక్రయిస్తున్నామని, భవిష్యత్తులో డాట్సన్ కార్ల విక్రయాల కోసం ప్రత్యేకమైన షోరూమ్‌లను ఏర్పాటుచేయనున్నామని ఆయన స్పష్టం చేశారు. నిస్సాన్ దాదాపు 30 ఏళ్ల క్రితం నిలిపి వేసిన తమ డాట్సన్ బ్రాండ్‌ను గడచిన సంవత్సరంలో భారత్‌ను వేదికగా చేసుకొని ప్రపంచ మార్కెట్ల కోసం రీలాంచ్ చేసింది. డాట్సన్ బ్రాండ్ క్రింద త్వరలోనే గో ప్లస్ ఎమ్‌పివి, ఆన్-డు సెడాన్‌ను కంపెనీ విడుదల చేయనుంది.
డాట్సన్ గో కారులో 1.2 లీటర్ (1198సీసీ), 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 165 కిలోమీటర్లు. ఇది 13.5 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుంది. డాట్సన్ గో లీటరు పెట్రోల్‌కు 20.6 కి.మీ. మైలేజీనిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications









