నిస్సాన్ ఎక్స్-ట్రైల్, 370జీ మోడళ్ల విక్రయాలు నిలిపివేత
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఇండియా ఓ షాకింగ్ నిర్ణయాన్ని వెలువరించింది. భారత మార్కెట్లో ఆఫర్ చేస్తున్న తమ ప్రీమియం ఎస్‌యూ 'ఎక్స్-ట్రైల్' మరియు ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ కార్ '370జెడ్' (370జీ అని పలకాలి) మోడళ్ల విక్రయాలను నిలిపివేయనున్నట్లు నిస్సాన్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
నిస్సాన్ ఇండియా ఈ రెండు మోడళ్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేయటానికి ప్రధాన కారణం, వీటి అమ్మకాలు సరిగ్గా లేకపోవటమే. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ లగ్జరీ ఎస్‌యూవీ అమ్మకాలు నామమాత్రంగా ఉంటే, నిస్సాన్ 370జీ స్పోర్ట్స్ కార్ విక్రయాలు దాదాపు శూన్యంగా ఉన్నాయి.
ఈ రెండు మోడళ్లను నిస్సాన్ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించేది. ఫలితంగా వీటి ధర కూడా అధికంగానే ఉండేది. ఏదేమైనప్పటికీ, ఇదే విధంగా సిబియూ రూట్లో విక్రయిస్తున్న లగ్జరీ సెడాన్ 'నిస్సాన్ టియానా' అమ్మకాలు మాత్రం యధావిధిగా సాగుతాయని కంపెనీ వెల్లడించింది.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్
ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 2.0 లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమయ్యేది. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 150 బిహెచ్‌పిల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్
సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీని దిగుమతి చేసుకొని విక్రయించడం వలన భారత మార్కెట్లో దీని ధర రూ.22.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండేది. ప్రస్తుతం కేవలం కొన్ని ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీల స్టాక్ మాత్రమే డీలర్ల వద్ద అందుబాటులో ఉంది.

నిస్సాన్ 370జీ
ఇక నిస్సాన్ 370జీ విషయానికి వస్తే, ఇదొక టూ సీటర్ స్పోర్ట్స్ కూపే కారు. ఇందులో ఉపయోగించిన 3.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 332 హెచ్‌పిల శక్తిని, 363 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

నిస్సాన్ 370జీ
నిస్సాన్ 370జీ కేవలం 6 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఈ స్పోర్ట్స్ కారును కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తున్న నేపథ్యంలో, దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.60 లక్షల వరకు ఉండేది.

కాగా.. నిస్సాన్ గ్లోబల్ మార్కెట్లలో ఇప్పటికే ఈ రెండు మోడళ్లలో అప్‌డేటెడ్/ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను 2013లోనే విడుదల చేసింది. వాటిని ఇంత వరకు భారత్‌కు పరిచయం లేదు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం కంపెనీ నిలిపివేసిన పాత ఎక్స్-ట్రైల్ మరియు 370జీ స్థానాల్లో భవిష్యత్తులో కొత్త వెర్షన్ పరిచయం చేస్తుందా లేక వీటిని పూర్తిగా నిలిపివేస్తుందా అనే విషయం మాత్రం తెలియరాలేదు.

మేడ్ ఇన్ ఇండియా
నిస్సాన్ ఇండియా ఇప్పుడు ఇంపోర్టెడ్ (దిగుమతి చేసుకునే) కార్లపై కాకుండా, స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న మైక్రా యాక్టివ్, మైక్రా, సన్నీ, ఇవాలియా, టెర్రానో వంటి ఉత్పత్తులపైనే ప్రధానంగా దృష్టి సారించనుంది. నిస్సాన్ ఈ ఉత్పత్తులన్నింటినీ చెన్నైలోని ఓరగండం ప్లాంటులో తయారు చేస్తోంది.


Click it and Unblock the Notifications








