మారుతి సుజుకి సియాజ్ సెడాన్‌లో ఏఎమ్‌టి లేదు!
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తొలిసారిగా తమ సెలెరియో కారులో ప్రవేశపెట్టిన ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) భారీ విజయం సాధించిన నేపథ్యంలో కంపెనీ తమ ఇతర ఉత్పత్తులలో కూడా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో చదువుకున్నాం. కంపెనీ త్వరలో విడుదల చేయనున్న సియాజ్ సెడాన్ (ఎస్ఎక్స్ రీప్లేస్‌మెంట్)లో కూడా ఈ గేర్‌బాక్స్‌ను మారుతి ఆఫర్ చేసే అవకాశం ఉందని విన్నాం.
కానీ తాజా అప్‌డేట్ ప్రకారం, మారుతి సుజుకి తమ సియాజ్ సెడాన్‍లో ఈ గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేయటం లేదని తెలుస్తోంది. మారుతి తమ ఏఎమ్‌టి టెక్నాలజీని ఈజీడ్రైవ్ (EzDrive) అని పిలుస్తుంది. మారుతి వర్గాల సమాచారం ప్రకారం, ఏఎమ్‌టి అనేది సామాన్యుడి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్. అంటే, తక్కువ ధరలో ఆటోమేటిక్ కారును కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ పరిచయం చేసిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇది. ఈ గేర్‌బాక్స్‌ను సియాజ్‌లో ఉపయోగిస్తే, దాని ప్రీమియం ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ ఆటోమేటిక్ సెడాన్ సెగ్మెంట్లో హోండా సిటీ (సివిటి ట్రాన్సిమిషన్), హ్యుందాయ్ వెర్నా (4-స్పీడ్ టార్క్ కన్వర్టర్) వంటి మోడళ్లతో పోటీ పడనుంది. చైనా మార్కెట్ కోసం సుజుకి ఇదే కారు (సియాజ్)ను అలివియో పేరుతో తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. అలివియో సెడాన్‌లో సుజుకి ఓ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ను ఆఫర్ చేయనుంది. అయితే, ఇండియన్ వెర్షన్ సియాజ్‌లో మాత్రం సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్)ను ఆఫర్ చేయొచ్చని అంచనా.
ఏఎమ్‌టి గేర్‌బాక్స్ సాంప్రదాయ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మాదిరిగా స్మూత్‌గా ఉండదు, జర్క్ ఇస్తున్నట్లు అనిపిస్తుంటుంది. మరోవైపు మారుతి సుజుకి తమ సియాజ్ సెడాన్‌ను కేవలం ఇండియన్ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించాలనే ఉద్దేశ్యంతో ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో, సియాజ్‌కు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ కల్పించాలంటే చవకగా ఏఎమ్‌టిని ఉపయోగించడానికి బదులుగా మెరుగైన, సమర్థవంతమైన సివిటిని ఉపయోగించడమే ఉత్తమం. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications








