2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కొత్త హ్యుందాయ్ శాంటాఫే లాంచ్
మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ సరికొత్త కార్లను ఆవిష్కరించనుంది. ఇందులో తమ అప్‌గ్రేడెడ్ శాంటాఫే ఎస్‌యూవీని ఫిబ్రవరి 5, 2014న విడుదల చేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు హ్యుందాయ్ మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలు కూడా పంపించింది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్ లిమిటెడ్‌లోని హాల్ నెం.3, స్టాండ్ ఈ4లో కొత్త శాంటాఫేను విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ తెలిపింది.
హ్యుందాయ్ ఆవిష్కరించనున్న ఈ సరికొత్త 2014 శాంటాఫేను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇదివరకటి తరం శాంటాఫేతో పోల్చుకుంటే, ఈ నెక్స్ట్ జనరేషన్ 2014 శాంటాఫే ఎస్‌యూవీని 40 మి.మీ. పొడవును, 5 మి.మీ. వెడల్పులను కలిగి ఉంటుంది. అలాగే దీని రూఫ్‌లైన్‌ను 45 మి.మీ. తగ్గించారు. కానీ వీల్‌బేస్‌ను మాత్రం యధావిధిగా 2700 మి.మీ. గానే ఉంచారు. వీటిని బట్టి చూస్తుంటే, కొత్త హ్యుందాయ్ శాంటాఫే మునుపటి వెర్షన్ కన్నా మరింత ఎక్కువ ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేయనుందని తెలుస్తోంది.

కొత్త శాంటాఫేలో 7-సీటర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండొచ్చని అంచనా. ఇందులో శక్తివంతమైన 2.2 లీటర్ విజిటి (వేరియబల్ జియోమెట్రీ టర్బో) డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 194 బిహెచ్‌పిల శక్తిని, 44.55 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ మైలేజ్, తక్కువ కర్బణ వ్యర్థాలను విడుదల చేసేలా ఈ ఇంజన్‌ను రీట్యూన్ చేశారు.
పాత మోడల్ కన్నా కొత్త శాంటాఫే మోడల్ మరింత మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉండనుంది. ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, చెవర్లే కాప్టివా వంటి మోడళ్లకు ధీటుగా ఉండేలా దీని ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. హ్యుందాయ్ తమ కొత్త శాంటాఫే ఎస్‌యూవీని స్థానికంగా భారతదేశంలోనే అసెబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. చెన్నైలో ఉన్న కంపెనీ ప్లాంటులో ఈ ఎస్‌యూవీని తయారు చేసే అవకాశం ఉంది. ఫలితంగా దీని ధర కూడా తక్కువగా ఉండొచ్చని అంచనా.

భారత మార్కెట్లో కొత్త 2014 హ్యుందాయ్ శాంటాఫే ప్రారంభ ధర రూ.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. ఇది టూ-వీల్ డ్రైవ్, ఆల్-డ్రైవ్ ఆప్షన్లతో లభ్యం కానుంది. కొత్త శాంటాఫేలో రీడిజైన్ చేయబడిన ఎక్స్టీరియర్లతో పాటుగా, మెరుగైన నాణ్యత, కొత్త ఎక్విప్‌మెటంట్స్ మరియు ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








