రెనో డస్టర్ లక్ష సేల్స్ మార్క్, లిమిటెడ్ ఎడిషన్ ప్రకటన
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో గడచిన జులై 2012లో భారత మార్కెట్లో విడుదల డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అతి తక్కువ సమయంలో అనేక మంది భారతీయుల మది దోచుకున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం రెనో డస్టర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. రెనో ఇండియా దేశీయ విపణిలో నిలదొక్కుకునేందుకు ఈ మోడల్ ఓ మూలస్థంబంలా నిలిచింది.
రెనో డస్టర్ భారత మార్కెట్లో విడుదలైన 2 ఏళ్ల కన్నా తక్కువ సమయంలోనే 1 లక్షకు పైగా యూనిట్లు అమ్ముడుపోయాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అతికొద్ది సమయంలో ఓ ఎస్‌యూవీ అమ్మకాలు లక్ష మార్కును చేరుకోవటం హర్షించదగిన విషయం. రెనో డస్టర్ లక్ష అమ్మకాల మార్కును చేరుకున్న సందర్భంగా, కంపెనీ ఇందులో ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది.

రెనో డస్టర్ గడచిన ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన అడ్వెంచర్ ఎడిషన్‌లో కంపెనీ ఇప్పటికే 110పిఎస్ వేరియంట్‌ను ఫిబ్రవరి నెలలో విడుదల చేయగా.. తాజాగా ఇందులో 85పిఎస్ వేరియంట్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఇందులో 110పిఎస్ వేరియంట్ అడ్వెంచర్ ఎడిషన్ ధర రూ.12.18 లక్షలుగా ఉంటే, 85పిఎస్ వేరియంట్ అడ్వెంచర్ ఎడిషన్ ధర రూ.9.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.
ఇదిలా ఉండగా రెనో డస్టర్‌లో ఓ ఆల్-వీల్ డ్రైవ్ (4x4) వేరియంట్‌ను కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. తమిళనాడులో ఉన్న రెనో ప్లాంట్‌లో కంపెనీ ఇప్పటికే ఫోర్-వీల్ డ్రైవ్ డస్టర్‌ను ఉత్పత్తి చేస్తోంది, అయితే ఈ మోడల్‌ను యూకే మార్కెట్లలో మాత్రమే విక్రయిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి..!


Click it and Unblock the Notifications








