కొత్త స్కొడా ఆక్టావియా ఆవిష్కరణ; పండుగ సీజన్లో లాంచ్
స్కొడా ఆక్టావియా తిరిగి భారత్‌కు రీ-ఎంట్రీ ఇచ్చింది. చరిత్రకే పరిమితమైపోతుందనుకున్న ఆక్టావియా సరికొత్త స్టయిల్‌లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఆకర్షనీయమైన డిజైన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, విశాలమైన స్పేస్, సౌకర్యవంతమైన టెక్నాలజీ, ఇంటెలిజెంట్ ఫీచర్లతో స్కొడా తమ 2013 ఆక్టావియా సెడాన్‌ను అభివృద్ధి చేసింది.
కొత్త ఆక్టావియా ధరకు తగిన విలువను కలిగి ఉంటుందని స్కొడా పేర్కొంది. (అయితే, ఈ మోడల్ ధరను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు). వాస్తవానికి ఇది కొత్త స్కొడా ఆక్టావియా ఆవిష్కరణ మాత్రమే, మార్కెట్ విడుదల మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది. రానున్న పండుగ సీజన్‌లో ఈ కారును వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం తమ కొత్త ఆక్టావియాను ఔరంగాబాద్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో స్థానికంగా తయారు చేస్తున్నారు.
కొత్త స్కొడా ఆక్టావియా సెడాన్‌ను ఫోక్స్‌వ్యాగన్ నుంచి పాపులర్ అయిన ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇది ప్రస్తుతం స్కొడా నుంచి మార్కెట్లో లభిస్తున్న ప్రీమియం సెడాన్ లారా కన్నా 90 మి.మీ. ఎక్కువ పొడవును, 45 మి.మీ. ఎక్కువ వెడల్పును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2686 మి.మీ.గా ఉంటుంది. ప్రస్తుత ఆక్టావియా (2013 మోడల్) 3వ తరానికి (థర్డ్ జనరేషన్)కు చెందినది.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

స్కొడా ఆక్టావియా ఉత్పత్తి షూరూ
ఔరంగాబాద్ ప్లాంటులో స్కొడా ఆక్టావియా ఉత్పత్తి ప్రారంభమైందని, త్వరలోనే దీనిని మార్కెట్లో విడుదల చేస్తామని, ఈ కారు ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ అధికారులు వెల్లడించారు. ఇదే ప్లాంటులో సూపర్బ్, లారా, యెటి, లారా మోడళ్లు ఉత్పత్తి అవుతున్నాయి.

స్కొడా ఆక్టావియా ఇంజన్స్
కొత్త 2013 స్కొడా ఆక్టావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. అందులో ఒకటి 177 హార్స్ పవర్ 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్, మరొకటి 141 హార్స్ పవర్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్.

స్కొడా ఆక్టావియా బేస్ వేరియంట్
రానున్న రోజుల్లో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన బేస్ వేరియంట్‌ను కూడా విడుదల చేసే ఆస్కారం ఉంది.

ట్రాన్సిమిషన్
పెట్రోల్ వెర్షన్ కేవలం 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇకపోతే డీజిల్ వెర్షన్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు.

పెట్రోల్ వెర్షన్‌లో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ లేదు
పెట్రోల్ వెర్షన్‌లో ప్రస్తుతానికి మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వెర్షన్ అందుబాటులో లేదు. ఇది కాస్తంత నిరుత్సాహపరచే అంశమే.

మరిన్ని అప్‌డేట్స్
కొత్త 2013 స్కొడా ఆక్టావియాకు సంబంధించిన మరిన్ని వివరాలు, ధర తదితర అంశాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనించండి.


Click it and Unblock the Notifications








