చెత్తబుట్టలోకి టాటా నానో డీజిల్ కార్ ప్రాజెక్ట్!
టాటా మోటార్స్ దాదాపు ఏడేళ్ల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్ష రూపాయల కారు, ప్రజల కారు, ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారు 'టాటా నానో' కస్టమర్లను ఆకట్టుకోవటంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, టాటా నానో అమ్మకాలకు మరింత జోరును కల్పించేందుకు ఇందులో అధిక మైలేజీనిచ్చే డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టాలని టాటా మోటార్స్ యోచించింది.
అయితే, ఇప్పుడు ఈ టాటా నానో డీజిల్ కార్ ప్రాజెక్ట్ అటకెక్కినట్లు తెలుస్తోంది. నానో డీజల్‌ను వాణిజ్య పరంగా తయారు చేయటం మరియు దానిని అత్యంత సరసమైన ధరకే అందించడం ప్రాక్టికల్‌గా అసాధ్యమని టాటా మోటార్స్ తెలుసుకుంది. దీంతో నానో డీజిల్ వెర్షన్‌ను విడుదల చేయాలనే తమ ప్రయత్నాలను కంపెనీ విరమించుకున్నట్లు సమాచారం.
వాస్తవానికి టాటా నానో డీజిల్ వెర్షన్‌లో 800సీసీ డిఓహెచ్‌సి, 2-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించాలనుకున్నారు. లీటకు డీజిల్‌కు 30-35 కిలోమీటర్ల మైలేజీనిచ్చేలా తయారు చేసి, భారదేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే డీజిల్ కారులా తయారు చేయాలని కంపెనీ భావించింది. అయితే, ఇందులో బిఎస్4 ఇంజన్‌ను అభివృద్ధి చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని.

ప్రముఖ విడిభాగాల తయారీ కంపెనీ బాష్ నుంచి గ్రహించిన డైరెక్ట్ ఇంజెక్షన్ కామన్ రెయిల్ టెక్నాలజీతో కూడిన బిఎస్4 ఇంజన్‌ను ఉపయోగించి టాటా నానో డీజిల్ వెర్షన్‌ను తయారు చేస్తే, దీని ధర రూ.3 లక్షలకు మించిపోయే ఆస్కారం ఉంది. రూ.1.50 లక్షలకే లభిస్తున్న పెట్రోల్ వెర్షన్‌ను కొనేందుకే కస్టమర్లు వెనుకాడుతుంటే, రూ.3 లక్షలు వెచ్చించి డీజిల్ వెర్షన్‌ను కొంటారా అనేది ప్రస్తుతం కంపెనీని వెంటాడుతున్న సవాల్.
టాటా నానో డీజిల్ కారు ధరకు హ్యుందాయ్ ఇయాన్, మారుతి ఆల్టో, డాట్సన్ గో వంటి కార్లు లభిస్తున్నాయి. మరోవైపు ఒక్క ఏడాదిలో డీజిల్ ధర 35 శాతం వరకు పెరగటం (ఇంకా పెరుగుతూనే ఉంది) ఫలితంగా డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గుతుండటం కూడా ఇందుకు మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కారణం ఏదైతేనేం.. నానో డీజిల్ కార్ మాత్రం ఇప్పట్లో రోడ్డెక్కె అవకాశాలు కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications








