హైదరబాద్‌లో టాటా జెస్ట్ విడుదల; ప్రారంభ ధర రూ.4.64 లక్షలు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ తొలి కాంపాక్ట్ సెడాన్ 'టాటా జెస్ట్' (Tata Zest)ను కంపెనీ తాజాగా హైదరాబాద్ మార్కెట్లో కూడా విడుదల చేసింది. హైదరాబాద్‌లో దీని ప్రారంభ ధర కేవలం రూ.4.64 లక్షలు (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్) మాత్రమే. టాటా జెస్ట్ మొత్తం 9 వేరియంట్లలో (4 పెట్రోల్, 5 డీజిల్) లభ్యమవుతుంది.
అన్ని పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ కార్లు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తాయి, కానీ డీజిల్‌లో వెర్షన్‌లో టాప్-ఎండ్ వేరియంట్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో లభిస్తుంది. టాటా జెస్ట్ సెడాన్ కోసం కంపెనీ 333 (ట్రిపుల్ త్రీ) అనే విశిష్టమైన సర్వీస్ ఆఫర్‌ను కూడా విడుదల చేసింది. ఈ స్కీమ్‌లో భాగంగా, జెస్ట్ కారుపై 3 ఏళ్లు లేదా 1 లక్ష కి.మీ (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని, మూడేళ్ల లేదా 45,000 కి.మీ. (ఏది ముందుగా ముగిస్తే అది) యాన్యువల్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ (ఏఎమ్‌సి)ని మరియు 3 ఏళ్లు ఉచిత 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో కంప్లీట్ ఆటోమేటిక్ కానీ లేదా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కానీ అందుబాటులో లేదు.
డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డీజిల్ వెర్షన్ టాప్-ఎండ్ వేరియంట్ మాత్రం ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుంది. ఈ ఏఎమ్‌టి ఇటలీకి చెందిన మాగ్నెటి మారెల్లీ సంస్థ సహకారంతో తయారు చేశారు.

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫై చేసిన దాని ప్రకారం, పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ లీటరుకు 17.6 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ లీటరుకు 23.0 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.
ప్రీమియం కార్లలో లభించే పాపులర్ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను టాటా మోటార్స్ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో పరిచయం చేసింది. ఇందులోని 5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అడ్వాన్స్డ్ వాయిస్ కమాండ్ రికగ్నైజేషన్, ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్ అండ్ రీడ్ అవుట్స్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్స్ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. హైదరాబాద్‌లో దీని ధరలు ఇలా ఉన్నాయి:

టాటా జెస్ట్ ధరలు:
టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్ఈ - రూ.4.64 లక్షలు
టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్ఎమ్ - రూ.5.26 లక్షలు
టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్ఎమ్ఎస్ - రూ.5.44 లక్షలు
టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్‌టి - రూ.6.02 లక్షలు
టాటా జెస్ట్ డీజిల్ 1.3లీ ఎక్స్ఈ - రూ.5.69 లక్షలు
టాటా జెస్ట్ డీజిల్ 1.3లీ ఎక్స్ఎమ్ - రూ.6.33 లక్షలు
టాటా జెస్ట్ డీజిల్ 1.3లీ ఎక్స్ఎమ్ఎస్ - రూ.6.51 లక్షలు
టాటా జెస్ట్ డీజిల్ 1.3లీ ఎక్స్‌టి - రూ.7.07 లక్షలు
టాటా జెస్ట్ డీజిల్ 1.3లీ ఎక్స్‌ఎమ్ఏ - రూ.7.07 లక్షలు (ఏఎమ్‌టి)
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications








