రూ.15 లక్షలకు దిగువన లభిస్తున్న టాప్ 10 ఎస్‌యూవీలు
ఒకప్పుడు ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)లు అధిక ధరను కలిగి ఉండి, మిడిల్ క్లాస్ కస్టమర్లకు అందుబాటులో ఉండేవి కావు. అయితే, ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త కార్ కంపెనీలు ప్రవేశిస్తుండటం, కార్ కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండటంతో, అత్యంత సరసమైన ధరకే ఈ రకం వాహనాలు లభిస్తున్నాయి.
ఓ మిడ్-సైజ్ సెడాన్ ధరకే భారీగా కనిపించే ఎస్‌యూవీలు మనకు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో ఎస్‌యూవీ విభాగంలో అగ్రగామిగా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా. ఇంకా టాటా మోటార్స్, ఫోర్డ్, రెనో, నిస్సాన్ వంటి పలు ఇతర కంపెనీలు కూడా ఈ విభాగంలో పలు రకాల పాపులర్ మోడళ్లను విక్రయిస్తున్నాయి.
ఈ కథనంలో మనం, ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.15 లక్షలకు దిగువన లభిస్తున్న టాప్-10 ఎస్‌యూవీల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

తర్వాతి స్లైడ్‌లలో ప్రస్తుతం మార్కెట్లో రూ.15 లక్షలకు దిగువన లభిస్తున్న టాప్-10 ఎస్‌యూవీల వివరాలను తెలుసుకోండి.

ఎక్స్‌యూవీ500
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయిస్తున్న పాపులర్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మహీంద్రా XUV500 మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇది కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. దేశీయ విపణిలో ఎక్స్‌యూవీ500 ధరలు రూ.10,91,355 - రూ.14,68,197 మధ్యలో ఉన్నాయి.

టాటా సఫారీ స్టోర్మ్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న పవర్‌ఫుల్ అండ్ స్టయిలిష్ ఎస్‌యూవీ టాటా సఫారీ స్టోర్మ్ డీజిల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ (4x4), టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టాటా సఫారీ స్టోర్మ్‌లో 2.2 లీటర్ వ్యారీకార్, వివిటి (వేరియబల్ టర్బైన్ టెక్నాలజీ)తో కూడిన టర్బోచార్జ్‌డ్ ఇంజన్ గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దేశీయ విపణిలో దీని ధరలు రూ.9,94,372 - రూ.13,71,289 రేంజ్‌లో ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో
మహీంద్రా అందిస్తున్న మరో స్టయిలిష్ ఎస్‌యూవీ స్కార్పియో. కంపెనీ ఇటీవలే ఇందులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. మహీంద్రా స్కార్పియో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్6+, ఎస్8 మరియు ఎస్10 అనే ఆరు వేరియంట్లలో టూ-వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. ఇందులోని 2.2 లీటర్, 4-సిలిండర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పిల శక్తిని, 1800-2800 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఎస్4, ఎస్6, ఎస్6 ప్లస్, ఎస్8 మరియు ఎస్10 వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో స్కార్పియో ధరలు రూ.8,40,000 - రూ.13,05,000 మధ్యలో ఉన్నాయి.

రెనో డస్టర్
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ డస్టర్ కూడా టూ-వీల్, ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంటుంది. దేశీయ విపణిలో రెనో డస్టర్ ధరలు రూ.8,70,000 - రూ.12,99,499 మధ్యలో ఉన్నాయి.

నిస్సాన్ టెర్రానో
రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై తయారైనదే ఈ నిస్సాన్ టెర్రానో. ఇది కేవలం టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. ఇది కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంటుంది. దేశీయ విపణిలో నిస్సాన్ టెర్రానో ధరలు రూ.9,62,875 - రూ.12,49,925 మధ్యలో ఉన్నాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈకోస్పోర్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఫ్యూయెల్ ఆప్షన్లతో మూడు ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు, ఇది కేవలం టూ-వీల్ డ్రైవ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధరలు రూ.646,403 - రూ.970,998 రేంజ్‌లో ఉన్నాయి.

మహీంద్రా బొలెరో
మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ బొలెరో కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు, ఇది టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్లో లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధరలు రూ.5,89,887 - రూ.7,79,757 రేంజ్‌లో ఉన్నాయి.

మహీంద్రా థార్
ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్స్ ఇష్టపడే వారికి మహీంద్రా థార్ ఓ చక్కటి ఆప్షన్. ఈ ఎస్‌యూవీ కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. ఇందులో టూ-వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. దేశీయ విపణిలో మహీంద్రా థార్ ధరలు రూ.4,89,729 - రూ.7,48,756 రేంజ్‌లో ఉన్నాయి.

టాటా సుమో గోల్డ్
టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ సుమో గోల్డ్ ఇటు పర్సనల్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి అటు కమర్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి చక్కగా ఉపయోగపడుతుంది. టాటా సుమో గోల్డ్ కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్ అందుబాటులో లేదు. ఇది కేవలం టూ-వీల్ డ్రైవ్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధరలు రూ.5,93,076 - రూ.6,50,736 రేంజ్‌లో ఉన్నాయి.

ఫోర్స్ వన్
ఫోర్స్ మోటార్స్ అందిస్తున్న ఫోర్స్ వన్ ఎస్‌యూవీ పెద్దగా పాపులర్ కాకపోయినప్పటికీ, ఇది రూ.15 లక్షల కన్నా తక్కువ ధరకే లభిస్తుంది. ఫోర్స్ మోటార్స్ ఇటీవలే దేశీయ విపణిలో ఫోర్స్ వన్ ఎల్ఎక్స్ వేరియంట్ పేరిట రూ.13.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకు ఓ కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో మెర్సిడెస్ బెంజ్ నుంచి గ్రహించిన 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 139 బిహెచ్‌పిల శక్తిని, 321 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఈ కథనంలో పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ (డిసెంబర్ 2014 నాటికి). మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత కార్ డీలర్లను సంప్రదించండి.


Click it and Unblock the Notifications








