బెంగుళూరులో దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభం
ఇటీవలి కాలంలో ప్రజా రవాణా వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి ఇందులో మన దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాజధాని బెంగుళూరు అన్ని రాష్ట్రాల కన్నా ఓ అడుగు ముందే ఉందని చెప్పాలి.
ఇప్పటికే నగరంలో మెట్రో సేవలను, మెరుగైన టాటా, వోల్వో సిటీ బస్సులను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్న బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ (బిఎమ్‌టిసి), తాజాగా పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది.
నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సుల పెర్ఫామెన్స్, పనితీరును పరిశీలించేందుకు వీటిని ప్రధానంగా రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు బిఎమ్‌టిసి ఇప్పుడు వీటిని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఎలక్టిక్ బస్సుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఎలక్ట్రిక్ బస్సుకు సంబంధించిన కొన్ని విషయాలు:
మోడల్ - కె9 డి
తయారు చేసినది - చైనాకు చెందిన బిల్డ్ యువర్ డ్రీమ్స్ (బివైడి) కంపెనీ
భారత్‌కు పరిచయం చేసింది - ఉటోపియా ప్రై. లి.
ధర - సుమారు రూ.2.7 కోట్లు
రేంజ్ - పూర్తి చార్జ్‌పై 250 కి.మీ.
చార్జింగ్‌కు పట్టే సమయం - 4 నుంచి 6 గంటలు
టికెట్ చార్జీ - రెగ్యులర్ వోల్వో బస్సుల మాదిరిగానే
సీటింగ్ సామర్థ్యం - 36-41 (కాన్ఫిగరేషన్‌ను బట్టి)
విద్యుత్ వినియోగం - గంటకు 100 కి.వా.

మూడు నెలల పాటు బిఎమ్‌టిసి మరియు చైనీస్ కంపెనీలు సంయుక్తంగా ఈ ట్రైల్ రన్‌ను నిర్వహిస్తాయి. ట్రైల్ రన్ సక్సెస్ అయితే, మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను పరిచయం చేసే ఆస్కారం ఉంది.

ఈ ఎలక్ట్రిక్ బస్సు వోల్వో సిటీ బస్సు మాదిరిగానే ఉంటుంది. ఇందులో 41 మంది ప్రయాణికులు కూర్చునేందుకు వీలుంటుంది. వీటి వల్ల కలిగే పెద్ద ప్రయోజనం ఏంటంటే, ఇవి పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనవి. ఈ ఎలక్ట్రిక్ బస్సుల వలన ధ్వని కాలుష్యం, వాయి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం వంటి ఉండవు.

సాధారణంగా కాలుష్యాన్ని వెదజల్లే, శబ్ధంతో కూడిన డీజిల్ ఇంజన్లతో పోల్చుకుంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులు నిశ్శబ్ధంగా ఉండి, ఎలాంటి ప్రమాదకర వాయువులను విడుదల చేయవు.

ఇప్పటికే అమెరికా, కెనడా, చైనా, జపాన్, సింగపూర్‌లతో పాటు అనేక యూరోపియన్ దేశాల్లో ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

భారతదేశంలో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడా లేవు. ఒకవేళ బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ వీటిని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువస్తే, భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మొట్టమొదటి నగరంగా బెంగుళూరు చరిత్ర సృష్టించనుంది.

అయితే, ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించడం అంత సులువైన పనేం కాదు. ఈ బస్సులకు డీజిల్, మెయింటినెస్స్ ఖర్చుల బాధ లేకపోయినప్పటికీ, వీటి ధర మరియు బ్యాటరీలకు అయ్యే ఖర్చే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








