ఫోక్స్‌వ్యాగన్ ఫాక్స్ పెప్పర్ స్మాల్ కార్.. ఇండియాకు వస్తుందా..?
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, గత కొంత కాలంగా తమ బడ్జెట్ కారును ఇండియాలో ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నామని, ఇందుకు సంబంధించి మార్కెట్ అధ్యయనం చేస్తున్నామని పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఫోక్స్‌వ్యాగన్ తాజాగా తమ స్వంత బ్రాండ్‌లో ఓ స్మాల్ కార్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.
'ఫోక్స్‌వ్యాగన్ ఫాక్స్ పెప్పర్' (Volkswagen Fox Pepper) అనే పేరుతో కంపెనీ ఓ చిన్న కారు కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. అక్టోబర్ 28 నుంచి నంవబర్ 9 వరకు జరగనున్న సావ్ పాలో మోటార్ షోలో ఈ కారును ప్రదర్శనకు ఉంచనున్నారు. ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న ఫాక్స్ హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ పెప్పర్ కాన్సెప్ట్‌ను తయారు చేశారు.

ఫోక్స్‌వ్యాగన్ ఫాక్స్ పెప్పర్‌ను బ్లాక్ అండ్ రెడ్ డ్యూయెల్ టోన్ కలర్ థీమ్‌తో డిజైన్ చేశారు. స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, బ్లాక్ సైడ్ మిర్రర్స్, బాడీ చుట్టూ సన్నటి బ్లాక్ క్లాడింగ్స్, బ్లాక్ బి పిల్లర్, బ్లాక్ రూఫ్, 15 ఇంచ్ డైమండ్ కట్ స్మోక్డ్ అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, బ్లాక్ రూఫ్ స్పాయిలర్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.
పేరుకు (పెప్పర్) తగనిట్లుగానే ఈ కారును రెడ్ టోర్నడో షేడ్‌లో పెయింట్ చేశారు. ఇంటీరియర్స్‌ను కూడా స్పోర్టీ ఫీల్ కలిగిలే డిజైన్ చేశారు. ఎక్స్టీరియర్ కలర్ థీమ్‌కి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ అండ్ రెడ్ థీమ్ ఇంటీరియర్స్‌ను ఇందులో డిజైన్ చేశారు. లెథర్ సీట్స్, కొత్త స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, కొత్త ఫ్లోర్‌మ్యాట్స్ మొదలైన వాటిని ఇందులో ఆఫర్ చేస్తున్నారు.

ఫోక్స్‌వ్యాగన్ ఫాక్స్ పెప్పర్ కారులో యాంత్రికపరంగా మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఫాక్స్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న 1.6 లీటర్, ఫోర్-సిలిండర్, ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్‌నే ఇందులోను కొనసాగించారు. ఈ ఇంజన్ పెట్రోల్ మరియు ఇథనాల్‌తో నడుస్తుంది. ఇథనాల్‌ను ఉపయోగించినప్పుడు ఈ ఇంజన్ గరిష్టంగా 120 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇక దీని పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇథనాల్ ఇంధనం ఉపయోగించినప్పుడు ఇది 9.8 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని, పెట్రోల్ ఇంధనం ఉపయోగించినప్పుడు ఇది 10.3 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇథనాల్‌తో దీని టాప్ స్పీడ్ గంటకు 189 కిలోమీటర్లు, అదే పెట్రోల్ అయితే గంటకు 183 కిలోమీటర్లు. మరి ఈ పెప్పీ లుకింగ్ ఫాక్స్ పెప్పర్ స్మాల్ ఇండియాకు వస్తుందా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే.


Click it and Unblock the Notifications








