పస్సాట్ మార్కెట్ నుంచి తొలగించలేదు: ఫోక్స్‌వ్యాగన్
అమ్మకాలు సరిగ్గా లేని కారణంగా హోండా కార్స్ ఇండియా తమ అకార్డ్ లగ్జరీ సెడాన్‌ను భారత మార్కెట్ నుంచి తొలగించినట్లుగానే, తాజాగా జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కూడా దేశయ మార్కెట్ నుంచి తమ లగ్జరీ కారు పస్సాట్‌ను తొలగించినట్లు పుకార్లు వచ్చిన సంగతి తెలిసినదే. అయితే, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ విషయాన్ని ఖండించింది. భారత్‌లో పస్సాట్ అమ్మకాలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా విడుదల చేసిన ఓ ప్రకటనలో, దేశంలో ఉన్న తమ డీలర్ల ద్వారా ప్రస్తుత తరం పస్సాట్ కారు అమ్మకాలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల కోసం నెక్స్ట్ జనరేషన్ పస్సాట్ కారు సిద్ధంగా ఉందని, సరైన సమయంలో ఈ సరికొత్త పస్సాట్‌ను భారత మార్కెట్లో కూడా విడుదల చేస్తామని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది.
ఫోక్స్‌వ్యాగన్ నెక్స్ట్ జనరేషన్ పస్సాట్ 8వ తరానికి చెందినది, 2014లో ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతున్న పస్సాట్‌ను స్థానికంగానే అసెంబ్లింగ్ చేయనున్నారు.

ఇక ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న పస్సాట్ విషయానికి వస్తే, గడచిన రెండు నెలలుగా ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. జూన్-నవంబర్ 2013 కాలంలో కేవలం 235 యూనిట్ల ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్‌లో 2 లీటర్ (1968సీసీ) 4-సిలిండర్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.
ఈ ఇంజన్ గరిష్టంగా 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 170 పిఎస్‌ల శక్తిని, 1,750-2,000 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్లూమోషన్ టెక్నాలజీతో లభించే పస్సాట్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. దీని బూట్ స్పేస్ సామర్థ్యం 565 లీటర్లు.
బ్లూమోషన్ టెక్నాలజీలో ఉండే స్టార్ట్ స్టాప్, బ్రేక్ ఎనర్జీ రెక్యుపరేషన్, డిఎస్‌జి డ్యూయెల్ క్లచ్ గేర్ బాక్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్‌ల ద్వారా కొత్త ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారుతో మెరుగైన మైలేజ్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా అకార్డ్, టొయోటా కరోలా, నిస్సాన్ టియానా, స్కొడా సూపర్బ్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. భారత మార్కెట్లో పస్సాట్ ధర రూ.25 లక్షలకు పైనే ఉంది.


Click it and Unblock the Notifications








