ఫోక్స్‌వ్యాగన్ పోలో 1.6 జిటి టిడిఐ విడుదల; ధర రూ.8.08 లక్షలు
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్ డీజిల్ వెర్షన్‌లో ఓ పవర్‌ఫుల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్న తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇది వరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా.. ఫోక్స్‌వ్యాగన్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. తమ సరికొత్త పోలో 1.6 జిటి టిడిఐ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది.
గడచిన మే నెలలో పవర్‌ఫుల్ పెట్రోల్ వెర్షన్ పోలో 1.2 జిటి టిఎస్ఐ కారును విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, ఇప్పుడు పవర్‌ఫుల్ డీజిల్ వెర్షన్ పోలో 1.6 జిటి టిడిఐ కారును మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో కెల్లా ఇదే అత్యంత శక్తివంతమైనది. దేశీయ విపణిలో ఫోక్స్‌వ్యాగన్ పోలో 1.6 జిటి టిడిఐ ధర రూ.8.08 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
ఫోక్స్‌వ్యాగన్ వెంటోలో ఉపయోగించిన 1.6 లీటర్ టిడిఐ ఇంజన్‌నే కొత్త పోలో 1.6 జిటి టిడిఐలో ఉపయోగించారు. భారత మార్కెట్ కోసం తాము అధునాతన మరియు అత్యంత సమర్థవంతమైన వాహన సాంకేతికతలను తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, ఇందులో భాగంగానే, కొత్త పోలో జిటి టిడిఐ కారును సృష్టించామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఎండి అరవింద్ సక్సేనా తెలిపారు.
ఫోక్స్‌వ్యాగన్ పోలో 1.6 జిటి టిడిఐ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇంజన్
ఫోక్స్‌వ్యాగన్ పోలో 1.6 జిటి టిడిఐ హ్యాచ్‌బ్యాక్ కారులో 1.6 లీటర్, 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 105 పిఎస్‌ల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

మైలేజ్
ఫోక్స్‌వ్యాగన్ పోలో 1.6 జిటి టిడిఐలో ఉపయోగించిన ఇంజన్ లీటరుకు 19.7 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, వెంటో సెడాన్‌లో ఉపయోగించిన ఇదే గరిష్టంగా లీటరుకు 20.54 కి.మీ. మైలేజీనిస్తుండటం విశేషం.

ఎక్స్టీరియర్స్
ఈ కొత్త వేరియంట్ బయటి వైపు పెద్దగా మార్పులేవీ లేవు, ఇది ఇతర వేరియంట్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, ఇందులో కొత్తగా ముందు వైపు గ్రిల్‌పై జిటి బ్యాడ్జ్, వెనుక వైపు టిడిఐ బ్యాడ్జ్‌లు కనిపిస్తాయి. హైలైన్ వేరియంట్ నుంచి గ్రహించిన ఎస్ట్రాడా అల్లాయ్ వీల్స్, 185/60 ఆర్15 టైర్స్, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్‌ను ఈ వేరియంట్లో పొందవచ్చు.

ఇంటీరియర్
జిటి బ్యాడ్జ్ డోర్ సిల్ గార్డ్స్, మిలాన్ టైటన్‌ష్వార్జ్ ఫ్యాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ, లెథర్‌తో కవర్ చేయబడిన స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్ట్ నాబ్, హ్యాండ్‌బ్రేక్ లివర్, క్రోమ్ ఇంటీరియర్ ట్రిమ్స్, అల్యూమినియం పెడల్స్ ఇందులో ప్రధాన ఫీచర్లు.

ఫీచర్లు
పోలో 1.6 జిటి టిడిఐ కారులో 2-డిన్ ఆడియో సిస్టమ్, 4 స్పీకర్లు, బ్లూటూత్, యూఎస్‌బి కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్, హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

సేఫ్టీ ఫీచర్స్ అండ్ కలర్ ఆప్షన్స్
పోలో 1.6 జిటి టిడిఐలో రెండు ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్, లైన్ చేంజ్ ఇండికేటర్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.
ఇది రెడ్, డీప్ బ్లాక్, క్యాండీ వైట్ అనే మూడు రంగులలో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








