అంబాసిడర్ ప్లాంట్ మూత; రోడ్డున పడ్డ వేలాది కార్మికులు
ఐకానిక్ అంబాసిడర్ కారు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు భారతదేశపు పురాతన ఆటోమొబైల్ కంపెనీ హిందుస్తాన్ మోటార్స్ ప్రకటించడంతో ఇప్పటి వరకు ఆ ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉన్న ఉత్తరపర అంబాసిడర్ కార్ ప్లాంట్‌లో సుమారు 2500 మంది ఉద్యోగులు (కార్మికులు, మేనేజ్‌మెంట్ వ్యక్తులు) ఉన్నారు.
నిధుల కొరత, డిమాండ్ లేమి కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తరపారాలో ఉన్న ప్లాంట్‌ను మూసేశామని, ఈ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిరవధికంగా నిలిపివేస్తున్నామని, అంబాసిడర్ కారు విషయంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టి చాలా నష్టపోయామని ఇకపై మరింత నష్టపోరాదనే ఉద్దేశ్యంతోనే, ఈ నిర్ణయం తీసుకున్నామని రెండు రోజుల క్రితం కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించిన సంగతి తెలిసినదే.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ కార్మిక విభాగం, హిందుస్తాన్ మోటార్స్ యాజమాన్యం మరియు ఆ ప్లాంట్ కార్మికుల మధ్య నేడు ఓ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. డిప్యూటీ లేబర్ కమీషనర్ కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో, హిందుస్తాన్ మోటార్స్ తీసుకున్న కంప్లీట్ లాక్-అవుట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా లేబర్ డిపార్ట్‌మెంట్ కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పించనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఆర్థిక మాంద్యం లేదా డిమాండ్ లేమి వలన ఫ్యాక్టరీ మూసేయాల్సి వస్తే, అందుకు కార్మికులకు ఎలాంటి సంబంధం ఉండదు. మార్కెట్ పరిస్థితులను సరిగ్గా అధ్యయనం చేయకపోవటం, దానికి అనుగుణంగా నడుచుకోకపోవటంలో కంపెనీ యాజమాన్య వైఫల్యం వల్లనే ఈ పరిణామాలు సంభవించి ఉంటాయని మానవ వనరుల అధికారులు భావిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ, హిందుస్తాన్ మోటార్స్ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయం వలన వేలాది మంది కార్మికులు రోడ్డున పడనున్నారు. ఇప్పటికే హిందుస్తాన్ మోటార్స్ ప్రమోటర్, చైర్మన్ సికె బిర్లా తన పదవికి రాజీనామా చేయగా, కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. హిందుస్తాన్ మోటార్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు బలమైన పెట్టుబడిదారుల కోసం కంపెనీ ఎదురుచూస్తోంది. ఎవరైనా ధైర్యం చేసి ముందుకొస్తే, అంబాసిడర్ తిరిగి ప్రాణం పోసుకునే ఆస్కారం ఉంటుంది.


Click it and Unblock the Notifications








