యాక్సిడెంట్స్ నుంచి ఆవులను కాపాడేందుకు కొమ్ములకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు.. ఆ రాష్ట్రంలో తొలి ప్రయోగం!!
అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు(Road Accidents) జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణాలైతే రోడ్డుపై పశువులు అడ్డుగా రావడం కూడా ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఈక్రమంలో పశువుల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నోయిడాలో ఓ వినూత్న ప్రయత్నం చేశారు.
కొందరు పశువుల యజమానులు వాటి గురించి పట్టించుకోకపోవడంతో ఏకంగా అవి రోడ్లపైకే వస్తున్నాయి. దీంతో వాహనదారులకే కాకుండా మూగ జీవాలకు కూడా నష్టం వాటిల్లుతోంది. రాత్రి సమయాల్లో లేదంటే పొగ మంచు ఎక్కువగా ఉండే సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. అయితే ఈ తరహా ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వాలు సైతం చర్యలు చేపడుతున్నాయి.

తరచుగా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు.. మీరు ట్రాఫిక్ పోలీసు అధికారులు, క్లీనర్లు రిఫ్లెక్టివ్(రేడియం- Radium) స్టిక్కర్ల(ప్రకాశించే స్టిక్కర్లను)ను ధరించడం చూసి ఉండవచ్చు. ఈ స్టిక్కర్ల ద్వారా చీకట్లోనూ మనుషుల ఉనికిని గుర్తించవచ్చు. దీంతో వాహనదారులు అప్రమత్తం అవుతారు. అయితే ఇప్పుడు ఈ రేడియం స్టిక్కర్లను ఆవుల కొమ్ములకు కూడా అతికిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఆవుల మెడపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను అతికించి ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పుడు నోయిడా(Noida)లో 50 కి పైగా ఆవుల కొమ్ములపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను అతికించారు.

ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా పొగ మంచు కురుస్తున్న సమయాల్లో, రాత్రి వేళల్లో ఆవుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. నోయిడాకు చెందిన సంస్థ SMART (సోఫీ మెమోరియల్ యానిమల్ రిలీఫ్ ట్రస్ట్) ఈ చొరవ ద్వారా ఈ వినూత్న ప్రయత్నం చేపట్టారు.
ఈ విషయమై సంస్థ సభ్యుడు కావేరి రాణా భరద్వాజ్ మాట్లాడారు. ఇందుకోసం రిఫ్లెక్టివ్ స్టిక్కర్లలో, ఫ్లోరోసెంట్ పెయింట్స్ వినియోగిస్తున్నట్లు చెప్పారు. కాగా ప్రధాన రోడ్లు మరియు సైకిళ్లపై ఈ రేడియం స్కిక్కర్లను వినియోగిస్తుండగా.. ఇదే తరహా ఆవులపై కూడా ఈ స్టిక్కర్లను వాడితే ఎలా ఉంటుందో అనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఆవులకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్ల ద్వారా వాహనదారులకు, పశువులకు మేలు జరుగుతుందని రాణా అన్నారు. చలికాలం రాకముందే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. సాధారణంగా మంచు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం శీతాకాలంలో ఎక్కువ ఉంటుందని.. దీన్ని అరికట్టడంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
కాగా తాము ఈ ఆపరేషన్ ప్రారంభించే ముందు రోజు, హ్యుందాయ్ క్రెటా కారు 5 ఆవులను ఢీకొట్టిందని చెప్పారు. ఈ క్రమంలో నోయిడాలో మరిన్ని ఆవులను కనిపెట్టి వాటిపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు వేస్తామని వివరించారు. స్మార్ట్ సిస్టమ్ చేసిన ఈ చర్యకు మంచి స్పందన లభించిందని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో మరో నెలలో చలికాలం ప్రారంభం కావొస్తుండటంతో భారతదేశం అంతటా ఈ కార్యాచరణను చేపట్టేందుకు ప్రభుత్వం మరియు NGOలు ముందుకు రావచ్చు. ఆవుల యజమానులు కూడా ఈ చర్య తీసుకుంటే మూగజీవాలతో పాటు వాహనదారులకు కూడా మేలు జరుగుతుంది. దీంతో ప్రమాదాల సంఖ్య కొంత వరకు తగ్గడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








