వాహనం నడపటానికి కేవలం LLR మాత్రమే సరిపోదు!
ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకోవడానికి గానూ, ఎల్ఎల్ఆర్ పొందిన అభ్యర్థి సదరు ఎల్ఎల్ఆర్ పొందిన తేదీ నుండి కనీసం నెల రోజుల పాటు వేచి ఉండాలి. ఎల్ఎల్ఆర్ పొందిన నెల రోజుల తర్వాత నుండి ఐదు నెలల లోపుగా ఏదో ఒక పనిదినం (వర్కింగ్ డే)లో డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హజరవ్వాలి. ఇలా హాజరైన పరీక్షలో నెగ్గిన తర్వాత 10 పనిదినాలలో లోపుగా "శాస్వత (పర్మినెంట్) డ్రైవింగ్ లైసెన్స్" ధరఖాస్తుదారుని చిరునామాకు చేరుతుంది.
ఇలా శాస్వత (పర్మినెంట్) డ్రైవింగ్ లైసెన్స్ చేతికి వచ్చే వరకూ సదరు వాహన చోదకుడు తన లెర్నర్ లైసెన్స్ జెరాక్స్ కాపీనీ ఎల్లప్పుడూ తనతో ఉంచుకుని, వాహనం ముందు వెనుక ఎల్ (L) బోర్డును అంటించాలి. మోటార్ వాహన చట్టం ప్రకారం, లెర్నర్ లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తి ఏ సందర్భంలో కూడా ఒంటరిగా బైక్/కారు నడపటానికి వీల్లేదు. ఇలాంటి ప్రతి సందర్భంలోనూ వాహనం నడిపేటప్పుడు తన వెంట డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి ఉండేలా ఎల్ఎల్ఆర్ కలిగిన వ్యక్తి జాగ్రత్త వహించాలి.
ఈ నిబంధన పాటించకపోయినట్లయితే, సదరు వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తి అవుతాడు. అంతేకాకుండా... వాహనానికి ముందు, వెనుక అంటిచే ఎల్ బోర్డ్ పరిమాణం కూడా చట్టానికి లోబడి ఉండాలి. చట్టం ప్రకారం, ఈ "L" ప్లేట్ పరిమాణం 18 చ.సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. "L" అనే అక్షరం 10 సెం.మీ ఎత్తు, 2 సెం.మీ. మందం, 9 సెం.మీ. వెడల్పు కంటే తక్కువ ఉండకూడదు.
శాస్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం ధరఖాస్తుదారుడు తన స్వంత వాహనం లేదా ఇతరుల వాహనంతో డ్రైవింగ్ పరీక్షకు హజరయ్యేటప్పుడు, సదరు వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, టాక్స్ కార్డ్, ఎమిషన్ టెస్ట్ సర్టిఫికెట్, ఇతర ఒరిజినల్ పత్రాలను తన వెంట తీసుకువెళ్లాలి. పైన తెలిపిన నిబంధనలు ఉల్లంఘించినట్లయితే, మోటార్ వాహన చట్టం ప్రకారం, దీనిని ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసుగా పరిగణించిన తగిన జరిమానాలను వసూలు చేయడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications









