డ్రైవింగ్‌లో రోడ్డు ప్రమాదాలను తప్పించుకునేందుకు సులభ చిట్కాలు
డ్రైవింగ్ అనేది ఓ ఆహ్లాదకరమైన అనుభూతి. కొందరు సరదా కోసం డ్రైవ్ చేస్తారు, మరికొందరు అవసరం కోసం డ్రైవ్ చేస్తారు. ఏదేమైనప్పటికీ, డ్రైవింగ్ అనేది ఓ మంచి అనుభూతిగా మిగిలిపోవాలే కాని, జీవితాల్లో మాయని మచ్చగా, తీర్చలేని లోటుగా మారకూడదు.
డ్రైవింగ్ విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద తప్పిదాలకు కారణం అవుతుంటాయి. వాహనం నడుపుతున్నప్పుడు మన తప్పిదం లేకపోయినప్పటికీ, అవతలి వారి తప్పిదాల కారణంగానైనా ప్రమాదం జరగవచ్చు
కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి క్షణం అప్రమత్తతో వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో, డ్రైవింగ్ చేసేటప్పుడు చేయకూడని పనులు, అలాగే చేయాల్సిన పనులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

అలసటగా ఉంటే డ్రైవ్ చేయొద్దు
ఎట్టి పరిస్థితుల్లోను అలసటగా ఉన్నప్పుడు డ్రైవ్ చేయొద్దు. ఒకవేళ రాత్రి వేళల్లో లాంగ్ డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు, అంతకు ముందే తగినంత విశ్రాంతి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. నిద్ర వచ్చినట్లు అనిపిస్తే, కారును పక్కగా ఆపి ముఖం కడుక్కోవటం, కాఫీ త్రాగటం లేదా సరక్షితమైన ప్రదేశంలో కారును నిలిపి, కాస్తంత సేపు విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది.

మద్యం సేవించి వాహనం నడపొద్దు
ఇది ప్రతిసారి చెప్పుకునేది. మద్యం మనషి మెదడను తన అధీనంలోకి తీసుకుంటుంది. తాగినప్పుడు వాహనంపై కంట్రోల్ ఉండదు. మద్యం సేవించి వాహనం నడపటం ప్రమాదకరమే కాదు చట్టరీత్యా నేరం కూడా. మద్యం సేవించి డ్రైవ్ చేయటం వలన డ్రైవర్లు తమ ప్రాణాలను రిస్కులో పెట్టడమే కాకుండా అవతలి వాళ్ల ప్రాణాలను కూడా రిస్కులో పెట్టిన వారు అవుతారు. కాబట్టి, ఎట్టిపరిస్థితుల్లోను మద్యం సేవించి వాహనం నడపకండి.

పరధ్యానం వద్దు
డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది పరధ్యానానికి గురవుతుంటారు. ముఖ్యం మొబైల్ మాట్లాడటం, మ్యూజిక్ ప్లే చేయటం, ఆహార్ తీసుకోవటం, రోడ్డు పక్కన వెళ్లే వారిని/వస్తువులను చూడటం మొదలైన వాటి వలన మీ దృష్టి రోడ్డుపై నుండి పక్కకు మరలి ప్రమాదాలకు కారణం అవుతుంది. కాబట్టి, రోడ్డుపై డ్రైవ్ చేస్తున్నప్పుడు పరధ్యానానికి గురికాకండి.

దూరాన్ని పాటించండి
మీకు ముందుగా వెళ్తున్న వాహనానికి మరీ సమీపంలో వెళ్లకుండా, సదరు వాహనానికి వీలైనంత దూరాన్ని పాటించండి. ప్రత్యేకించి రద్దీ రోడ్లపై వెళ్తున్నప్పుడు, హైవేలపై అలాగే ఎత్తు పళ్లాలు కలిగిన రోడ్లపై వెళ్తున్నప్పుడు మీ ముందుగా వెళ్తున్న వాహనాలకు దూరంగా డ్రైవ్ చేయటం వలన ప్రమాదాలు తగ్గుతాయి.

కళ్లను కదిలిస్తూ ఉండండి
డ్రైవ్ చేస్తున్న మీ కళ్లతో నిర్ధిష్టంగా కేవలం రోడ్డుపై మాత్రమే చూస్తుండకుండా, అప్పుడప్పుడూ మీ సైడ్ మిర్రర్లను, మీ ముందున్న వాహనానికి మీ వాహనానికి మధ్య దూరాన్ని చూసుకుంటూ ఉండండి. పరధ్యానికి గురిచేసే అంశాల వైపుకు మీ దృష్టిని మరల్చకండి.

ఇండికేటర్లను ఉపయోగించండి
మలుపులు తిరిగేటప్పుడు, ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఇండికేటర్లను ఆన్ చేయటం అలవాటుగా మార్చుకోండి. ఇండికేటర్ల విషయంలో వహించే చిన్నపాటి నిర్లక్ష్యం పెను ప్రమాదాలకు దారి తీసే ఆస్కారం ఉంది.

మీ వాహన పరిమాణం గురించి తెలుసుకోండి
వాహనం నడపడానికంటే ముందుగా, సదరు వాహన పరిమాణం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముందు వైపు బంపర్ పొడవు ఎంత వరకు ఉంది, సైడ్ మిర్రర్ల పొడవు ఎంత వరకు ఉంది, టైర్ల మార్జిన్ మొదలైన అంశాలపై స్పష్టమైన అవగాన ఉండాలి. కారును క్రమం తప్పకుండా సర్వీసుకు తీసుకువెళ్లి, కండిషన్‌లో ఉంచుకోవాలి.

సెల్ఫ్ కంట్రోల్
అవతలి వాళ్లు మీ కంటే వేగంగా వెళ్తే వెల్లనివ్వండి, పోయేదేమీ లేదు. వారు మిమ్మల్ని ఓవర్‌టేక్ చేశారని మీరు మీ సెల్ఫ్ కంట్రోల్‌ని కోల్పోయి మీరు కూడా వేగంగా డ్రైవ్ చేస్తే, ప్రమాదాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు.

రోడ్డు సంకేతాలు
డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్డు సంకేతాలపై ఓ కన్నేసి ఉంచండి. ప్రత్యేకించి రోడ్డు డైవర్షన్లు, రోడ్డు మరమ్మత్తులకు సంబంధించిన బోర్డును దూరం నుంచే చూసి, అందుకు తగినట్లుగా వాహనాన్ని కంట్రోల్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications








