కారు బ్యాటరీ ఖాలీ అయితే జంప్ స్టార్ట్ చేయటం ఎలా..?
కారు లైట్లను ఆన్ చేసి వాటిని చేయటం మర్చిపోయినా, కారు తాళం చెవులను ఇగ్నిషన్ మోడ్‌లో మర్చిపోయినా, మీ కారు ఇంజన్‌ను ఆన్ చేయకుండా, కేవలం బ్యాటరీని ఎక్కువ సమయం పాటలు వినడానికి/వీడియో చూడటానికి ఉపయోగించినా లేక మీ కారు బ్యాటరీ పాతదైపోయినా, అందులోని పవర్ త్వరగా ఖాలీ అయిపోవటం జరుగుతుంది.
అలాంటప్పుడు కారు ఇంజన్ ఆన్ చేయటానికి ప్రయత్నిస్తే, ఇంజన్ ఆన్ కాదు. వాహనం ఉన్న ప్రతిఒక్కరు ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కుని ఉండే ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఎదుర్కోకపోయినా, భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొని తీరుతారు. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కం ఎలా..?
ఇందుకు ఒక్కటే పరిష్కారం.. అదే 'జంప్ స్టార్ట్' (Jump Start). జంప్ స్టార్ట్ అంటే ఏమీ లేదు, పనిచేస్తున్న కారులోని బ్యాటరీ పవర్ సాయంతో డెడ్ అయిన మీ కారు బ్యాటరీకి
విద్యుత్‌ను గ్రహిస్తూ, కారు ఇంజన్‌ను స్టార్ట్ చేయటమే. ఇందుకు మీకు కావల్సిందల్లా జంపర్ కేబుల్స్, మీకు సాయం చేయటం కోసం పనిచేసే బ్యాటరీ కలిగిన మరో కారు. మరి ఈ జంప్ స్టార్ట్ ఎలా చేయాలతో ఫొటోలతో సహా తెలుసుకుందాం రండి..!

ఖచ్ఛితంగా బ్యాటరీ సమస్యేనా?
అసలు మీ బ్యాటరీలో నిజంగా సమస్య ఉందో లేదో తెలుసుకోవటానికి హెడ్‌లైట్లను ఆన్ చేయండి. ఆ తర్వాత అవి ప్రకాశవంతంగా వెలుగుతున్నాయో లేక డిమ్‌గా ఉన్నాయో చూడండి. డిమ్‌గా ఉన్న లేక అసలు హెడ్‌లైట్లు ఆన్ కాకపోయినా బ్యాటరీలో సమస్య ఉన్నట్లు అర్థం. (కొన్ని కార్లలో హెడ్‌లైట్లను చెక్ చేయటానికి ఇంజన్‌ను ఆన్ చేయాల్సిన అవసరం లేదు).

అప్పటికీ అర్థం కాకపోయినట్లయితే, కీని ఇగ్నిషన్‌లో ఉంచిన తర్వాత డ్యాష్‌బోర్డ్ లైట్లు (స్పీడోమీటర్ లైట్స్) యధావిధిగా వెలుగుతున్నాయో లేదో చూసుకోండి. ఆడియో సిస్టమ్‌ను చెక్ చేయండి. కొన్ని సందర్భాల్లో లో బ్యాటరీ ఉన్నప్పటికీ, డ్యాష్‌బోర్డుపై కొన్ని లైట్లు కనిపిస్తాయి. అలాగే స్టీరియో నుంచి కూడా కొంత సౌండ్ వినిపిస్తుంది. అలా జరగలేదంటే, ఇగ్నిషన్ స్విచ్‌లో సమస్య ఉన్నట్లు లేదా బ్యాటరీ పూర్తిగా ఖాలీ అయినట్లు అర్థం.

ఇంకా అర్థం కాలేదా...? అయితే, కారును స్టార్ట్ చేయటానికి ప్రయత్నించండి. కీ స్లోగా తిరుగుతుందా లేక త్వరగా తిరుగుతుందా అనేది గుర్తించండి. త్వరగా తిరిగినట్లయితే, మీ కారు బ్యాటరీ డెడ్ అవలేదని అర్థం, ఇలాంటి సందర్భాల్లో జంప్ స్టార్ట్ పనిచేయదు. ఒకవేళ అలాకాకుండా, కీ స్లోగా తిరిగినట్లయితే, అసలు ఇగ్నిషన్ ఆన్ అయిన సౌండే రాకపోయినట్లయితే, మీ కారు బ్యాటరీ ఖాలీ అయిందని అర్థం.

బ్యాటరీ సమస్య నిర్ధారణ అయితే..
మీ కారులో నిజంగా బ్యాటరీ సమస్య ఉందని నిర్ధారణ అయితే, జంప్ స్టార్ట్ చేసి, ఇంజన్‌ను ఆన్ చేయటానికి ప్రయత్నించండి. ముందుగా, మీ కారు బానెట్‌ను అలాగే అవతలి వ్యక్తి కారు బానెట్‌ను ఓపెన్ చేయండి. (చాలా కార్లలో బ్యాటరీ ముందు వైపు కుడి పక్కగా లేదా ఎడమ పక్కగా ఉంటుంది).

జంపర్ కేబుల్స్
జంపర్ కేబుల్స్ ఏ కార్ యాక్ససరీ డీలర్‌షిప్ కేంద్రంలో నైనా దొరుకుతాయి. ఈ కేబుల్స్ సాధారణంగా బ్లాక్ అండ్ రెడ్ కలర్‌లో ఉండి, రెండు చివర్లలో రెండేసి ధృడమైన మెటల్ క్లిప్స్ అమర్చబడి ఉంటాయి.

రబ్బర్ హ్యాండ్ గ్లవ్స్
జంపర్ కేబుల్స్‌ను ఒక కారు బ్యాటరీ నుంచి మరొక కారు బ్యాటరీకి అమర్చడానికి ముందుగా, చేతికి రబ్బరు గ్లౌవ్‌లు, కంటికి సేఫ్టీ గ్లాసులు ధరించడం మర్చిపోకండి. ఇలా చేయకపోయినట్లయితే, బ్యాటరీ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.

రెండు బ్యాటరీలు చెక్ చేయండి
కారును జంప్ స్టార్ట్ చేయటానికి ముందు రెండు కార్లలోని బ్యాటరీలను ఓసారి క్షుణ్ణంగా తనిఖీ చేయండి. బ్యాటరీ క్రాక్ ఇచ్చినట్లు అనిపించినా లేదా ఏదైనా ద్రవం లీక్ అవుతున్నట్లు కనిపించినా జంప్ స్టార్ట్ చేయకండి. ఇలాంటి సందర్భాల్లో గమ్యం చేరేందుకు టోయింగ్ ట్రక్కుకు కాల్ చేయటమో లేక బ్యాటరీని రీప్లేస్ చేయటమో చేయండి.

పాజిటివ్, నెగిటివ్ టెర్మినల్స్
బానెట్‌ను ఓపెన్ చేసి, మీ కారులోని బ్యాటరీ స్థానాన్ని గుర్తించిన తర్వాత దానిపై ధనాత్మక (పాజిటివ్ +), రుణాత్మక (నెగిటివ్ -) ధృవాలను (టెర్మినల్స్)ను గుర్తించండి. అలాగే అవతలి కారులోని బ్యాటరీపై కూడా ధనాత్మక, రుణాత్మక ధృవాలను గుర్తించండి.

టెర్మినల్స్ క్లీనింగ్
ఇలా బ్యాటరీ యొక్క పాజిటివ్, నెగిటివ్ టెర్మినల్స్‌ను గుర్తించిన తర్వాత, వాటిపై ఏదైనా ద్రవం/గట్టి పదార్థం ఏదైనా పేరుకొని ఉన్నట్లు అనిపిస్తే, గ్లవ్‌లు ధరించి గట్టి ఐరన్ బ్రష్‌తో కానీ మందపాటి రేకుతో కానీ టెర్మినల్స్‌ను క్లీన్ చేయాలి.

పాజిటివ్ నుంచి పాజిటివ్‌కు
అనంతరం మీ కారు బ్యాటరీలోని ధనాత్మక (+) ధృవానికి రెడ్ కలర్ జంపర్ కేబుల్ ఓ చివరను క్లిప్ చేయాలి. అదే విధంగా రెడ కలర్ జంపర్ కేబుల్ రెండవ చివరను అవతలి వ్యక్తి కారు బ్యాటరీలోని ధనాత్మక ధృవానికి క్లిప్ చేయాలి. ఇలా క్లిప్ చేసే సమయంలో రెండు కేబుల్స్ వీలైనంత వరకు కారు ఇంజన్‌కు (కదిలే భాగాలకు) దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

నెగిటివ్ నుంచి ఛాస్సిస్‌కు (బోల్టుకు)
అయితే, బ్లాక్ కలర్ జంపర్ కేబుల్ విషయంలో మాత్రం ఓ చివరను పనిచేసే కారు బ్యాటరీలోని రుణత్మాక ధృవానికి (-) క్లిప్ చేసి, రెండవ చివరను పాడైపోయిన బ్యాటరీ కలిగిన కారులో ఛాస్సిస్‌కు కనెక్ట్ అయి ఉండే ఏదైనా బోల్టుకు (తుప్పపట్టని, పెయింట్ చేయటని, ఆయిలీగా లేని బోల్టుకు) క్లిప్ చేయాలి.

తర్వాతి ప్రాసెస్
ఇలా జంపర్ కేబుల్స్‌ను క్లిప్ చేయటం పూర్తయిన తర్వాత, రెండు కార్ల ఇంజన్లను ఆన్ చేయటానికి ముందు, రెండు కార్లలో ఏసి/హీటర్ లైట్స్, స్టీరియో మొదలైనవన్నీ ఆఫ్ చేశారో లేదో చూసుకోండి.

వర్కింగ్ కారును స్టార్ట్ చేయండి
ముందుగా పనిచేసే బ్యాటరీ కలిగిన కారు ఇంజన్‌ను స్టార్ట్ చేసి, ఒకటి లేదా నిమిషాల పాటు ఐడిల్‌గా ఉంచండి. ఇంజన్‌ను రైజ్ చేయకండి. ఇలా చేయటం వలన అవతలి కారులోని బ్యాటరీ కొద్దిగా చార్జ్ అవుతుంది.

డెడ్ బ్యాటరీ కారును స్టార్ట్ చేయండి
ముందుగా పనిచేసే బ్యాటరీ కలిగిన కారును స్టార్ట్ చేసిన తర్వాత, పనిచేయని బ్యాటరీ కలిగిన మీ కారును స్టార్ట్ చేయండి. అప్పటికీ కారు స్టార్ట్ కాకపోయినట్లయితే, జంపర్ కేబుల్ క్లాంప్‌లను తాత్కాలికంగా తొలగించి మరోసారి జాగ్రత్త క్లిప్ చేయాలి. ఇలా క్లిప్ చేసేటప్పుడు రెడ్ కలర్ జంపర్ కేబుల్ నుండి విద్యుత్ మీ కారు బ్యాటరీకి సరఫరా అయ్యేలా ఆ క్లిప్‌ను అటు ఇటూ కదుపుతూ సర్దుబాటు చేయండి. ఇలా మరో ఐదు నిమిషాలు మీ కారు బ్యాటరీ చార్జింగ్ అయ్యేలా చూసుకోండి. అప్పటికీ ఇంజన్ స్టార్ట్ కాకపోతే, ఇక వెహికల్ టోయింగే మార్గం.

చివరి మాట
ఇలా జంపర్ కేబుల్స్ ద్వారా ఇంజన్‌ను స్టార్ట్ చేసిన తర్వాత, ఇంజన్‌ను ఎక్కడా కూడా ఆఫ్ చేయకుండా, నేరుగా మీ గమ్యం చేరుకోండి. ఒకవేళ తరచూ ఇదే సమస్య ఎదరవుతూ ఉంటే, దగ్గర్లో ఉన్న సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లటమో లేక బ్యాటరీని మార్చటమో చేయండి.


Click it and Unblock the Notifications








