దీపావళి టపాసులు వచ్చేస్తున్నాయి.. మీ కారు పార్కింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!!
మరికొద్ది రోజుల్లో దీపావళి రానుంది. ఇక వీధుల్లో, రోడ్లపై ఎక్కడ చూసినా పటాకుల మోతే.. పండుగకు రెండు, మూడు రోజుల ముందుగానే యువకులు, పిల్లలు బాణాసంచా కాల్చడం మొదలుపెడతారు. ఈ సందర్భంలో వాహనదారులు తమ వాహనాల పార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ వాహనాలు టపాకుల తాకిడికి పేలిపోయే అవకాశాలు ఉంటాయి.
దేశంలో జరుపుకొనే అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. చీకట్లను చించుకుని వెలిగే దీపాల మధ్య ప్రజలు సంబరాలతో దీపావళిని జరుపుకొంటారు. పండుగ సందర్భంగా దీపావళికి భలే గిరాకీ ఉంటుంది. సాయంత్రం అయ్యిందంటే చాలు ఇక దీపాలు పెట్టి.. టపాసులు కాల్చడం మొదలుపెడతారు. అయితే ఈ సంబరాల నడుమ మీ కారు జాగ్రత్తగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించడం తప్పనిసరి.

రోడ్లపై టపాసులు కాల్చేటప్పుడు అటుగా వెళ్లే వాహనదారులు లేదంటే, ఆ ఏరియాలో పార్క్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మీ కారును చుట్టూ కవర్ చేయబడిన సురక్షిత ప్రాంతంలో పార్క్ చేయాలి. ఇంట్లో సురక్షితమైన రూఫ్డ్ పార్కింగ్‌లో పార్క్ చేస్తే ఇంకా సేఫ్టీగా ఉంటుంది. మీకు కవర్ పార్కింగ్ స్థలం లేకుంటే, చెట్టు కింద లేదా మీ ఇంటికి పడమర వైపు పార్క్ చేయడం ద్వారా సురక్షితంగా ఉంటుంది.
దీపావళి సందర్భంగా టపాసులు విక్రయిస్తున్న ప్రాంతాల పక్కన లేదా సమీపంలో మీ కారును పార్క్ చేయకండి. పొరపాటున ఏదైనా కారణాల వల్ల అగ్నిప్రమాదం చోటుచేసుకుంటే మీ కారు పేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బాణాసంచాలు పేలుస్తున్నా లేదా అవి ఉన్న ప్రాంతానికి సమీపంలో కారు పార్క్ చేయకండి.

చాలా మంది తమ కారును పార్క్ చేస్తున్నప్పుడు దాని పైన కవర్ కప్పుతారు. కానీ ఇలాంటి సమయంలో మీరు కవర్ కప్పకపోవడం బెటర్.. ఎందుకంటే పటాకులు కాల్చేటప్పుడు నిప్పు రవ్వలు పొరపాటున కవర్ మీద పడినట్లయితే అది ఇంకా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని గుర్తించాలి. కారు కవర్లు తరచుగా మండే లక్షణాలను కలిగి ఉంటాయి.
చాలా మంది తమ కార్లను సేఫ్టీ కోసం సాధారణంగా రోడ్డు పక్కన పార్క్ చేస్తారు. దీపావళి పండుగ సమయంలో మీరు మీ రెగ్యులర్ పార్కింగ్ స్థలాన్ని హై-రిస్క్ స్పాట్‌గా పరిగణించినట్లయితే, ఆ కొన్ని రోజులు తాత్కాలిక పార్కింగ్ స్థలాన్ని ఎంచుకోవడం ఉత్తమం. మీ వాహనాన్ని తాత్కాలిక పార్కింగ్ స్థలంలో వారం రోజుల పాటు మాత్రమే ఉంచేందుకు రుసుము చెల్లించినా సరే.. అక్కడే పార్క్ చేయండి.

ఎందుకంటే బాణాసంచా పేల్చడం వల్ల కారు పాడైపోతే.. ఆ రిపేర్లకు అయ్యే ఖర్చు పార్కింగ్ ఛార్జెస్ కంటే ఎక్కువ అవుతుందని గుర్తుంచుకోండి. టపాసులు పేలుస్తున్న ప్రాంతంలో మీ కారును పార్క్ చేయడం తప్ప మీకు వేరే మార్గం లేకపోతే, మీరు పార్క్ చేసిన వెంటనే మీ మొత్తం కారుని కొన్ని ఫోటోలు తీసి భద్రంగా ఉంచుకోండి.
ఇలాంటి సమయాల్లో వాహనానికి ఏదైనా నష్టం జరిగితే మీకు బీమా డబ్బు వచ్చేలా చేయడానికి ఈ ఫొటోలు సహకరిస్తాయి. దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడం వల్ల చాలా వాహనాలు దెబ్బతిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. బాణాసంచా పేల్చేందుకు ఆసక్తి చూపే చాలా మంది తమ వాహనాల భద్రత గురించి ఆలోచించడం లేదని తెలింది.

ఫలితంగా పటాకులు పేలినప్పుడు అందులోని స్పార్క్ లేదా నిప్పు రవ్వల ద్వారా వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కొంతమంది పిల్లలు తెలియక ఉద్దేశపూర్వకంగా వాహనాల కింద పటాకులు కాల్చడం లేదంటే వాటితో ఆడుకోవడం చేయవచ్చు. అందువల్ల మీరు సురక్షితమైన స్థలంలో మీ వాహనాలను పార్కింగ్ చేయడం ద్వారా.. నష్టాన్ని ముందుగానే నివారించవచ్చు.
అయితే దీపావళి సమయంలో మాత్రమే కాకుండా మీ కారును ఎల్లప్పుడూ సురక్షితమైన పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేయడం వల్ల మీ కారు ప్రమాదానికి గురికాకుండా ఉంటుంది. రోడ్డు పక్కన పార్కింగ్ చేయడం ద్వారా ఫైన్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంకా ఇతర వాహనదారులకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ మీ కారుకు బెస్ట్ పార్కింగ్ ప్లేస్‌ను ఎంచుకోవాలి.



Click it and Unblock the Notifications








