వర్షంలో సురక్షితంగా డ్రైవ్ చేయటం ఎలా: చిట్కాలు
వర్షాకాలం వచ్చేసింది. చాలా మందికి వర్షంలో డ్రైవ్ చేయడమంటే భరే సరదా (కొందరికి చిరాకు కూడా అనుకోండి). ప్రకృతి అందాలకు పులకరిస్తూ సరదాగా డ్రైవ్ చేస్తుంటే మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. అయితే, ఇలా డ్రైవ్ చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే ఆ సరదాయే పెను ప్రమాదాలు దారితీసి, ఎవ్వరూ పూడ్చలేని లోటుగా మిగిలిపోయే ఆస్కారం ఉంది.
సాధారణంగా, పొడిగా ఉండే రోడ్లపై కన్నా తడిగా ఉండే రోడ్లపైనే ఎక్కువగా ప్రమదాలు జరుగుతుంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇతర సీజన్లతో పోల్చుకుంటే, వర్షాకాలపు సీజన్‌లో ఎక్కువ ప్రమాదాలు నమోదవుతుంటాయి. ఇందుకు ప్రధాణ కారణం వాతావరణ అనుకూలించకపోవటం, రోడ్లు తడిగా ఉండటం, మ్యాన్‌హోల్స్, పాట్ హోల్స్, డ్రైవింగ్ పట్ల అవగాహన లేకపోవటం ఇలా అనేక కారణాలు ఉన్నాయి.
కొన్ని కొన్ని సార్లు వర్షాకాలంలో కారు డ్రైవ్ చేయటం పెను సవాళుగా పరిణమిస్తుంది. ఇలాంటప్పుడు జాగ్రత్తగా లేకపోతే పెద్ద ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవ్ చేసేటప్పుడు క్రింది చిట్కాలను పాటించినట్లయితే, సురక్షితంగా గమ్యం చేరడంతో పాటుగా ప్రకృతి అందాన్ని కూడా ఆస్వాదించే వీలుంటుంది. మరి ఆ చిట్కాలేంటో ఈ క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

రోడ్డుకు అంచున డ్రైవ్ చేయకండి
వర్షాకాలంలో కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోను రోడ్డుకు అంచున డ్రైవ్ చేయకూడదు. వర్షపు నీటి వలన రోడ్డు పక్కన మట్టి కరిగి రోడ్డు కూడా కరిగిపోవటం వాహనం జారిపోవటం జరిగే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి కొండలు, లోయల ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ఇది తప్పనిసరిగా పాటించాలి.

మితిమీరిన వేగం వద్దు
వేగమంటే అందరికీ ఇష్టమే. అయితే, అది శృతి మించితే యముడికి హలో చెప్పటం ఖాయం. ప్రత్యేకించి వర్షం పడుతున్న సమయంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు నిర్ధిష్ట వేగంతోనే కారును నడపాలి. అధిక వేగం వలన తడిరోడ్లపై వాహనం జారిపోయే ప్రమాదం ఉంది.

రోడ్డుపై నీటి గుంతలు
కొన్ని ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు నీటి గుంతలు ఏర్పడుతాయి. వీటి వలన రోడ్డు కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. బయటి నుంచి చూస్తే వీటి లోతు సరిగ్గా తెలియకపోవచ్చు. కాబట్టి ఇలాంటి రోడ్లపై ప్రయాణించేటప్పుడు 1 లేదా 2వ గేర్‌లో నిదానంగా వెళ్లాలి.

మీ ముందు కారును ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తెలివిగా డ్రైవ్ చేయాలంటే, మన ముందు వెళ్తున్న కారును ఫాలో అవ్వటమే. మన ముందుగా వెళ్లే కారు రోడ్డుపై ఉన్న నీటిని క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటుంది కాబట్టి, మనకు రోడ్డు, గుంతలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే, ఈ సందర్భంలో ముందు కారుకు మీరు తగినంత దూరంలో ఉండి, వారు సడెన్ బ్రేక్ వేస్తే దానికి అనుగుణంగా మీరు స్పందించేందుకు సిద్ధంగా ఉంటేనే ఈ చిట్కా పాటించాలి.

క్రూయిజ్ కంట్రోల్ వాడద్దు
మీ కారులో క్రూయిజ్ కంట్రోల్ ఉందా..? అయితే, మీ చేతిని కాస్త కంట్రోల్‌లో ఉంచుకోండి. వర్షాకాలంలో డ్రైవ్ చేస్తున్న క్రూయిజ్ కంట్రోల్‌ను వాడకపోవటమే ఉత్తమం. క్రూయిజ్ కంట్రోల్ ఆన్ చేస్తే కారు నిరిష్ట వేగంతో ప్రయాణిస్తుంటుంది. వర్షాకాలంలో ఒకే స్పీడ్‌లో కారును నడపటం ప్రమాదకరం.

బస్సులు, ట్రక్కులకు సమీపంలో నడపొద్దు
వర్షంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కారును బస్సులు, ట్రక్కులకు సమీపంలో/పక్కన నడపకూడదు. పెద్ద టైర్లు కలిగిన అలాంటి వాహనాలు చిందించే నీటి బిందువులు/బురద మీ కారు విండ్‌షీల్డ్‌పై పడి, మీ దృష్టికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది.

బురద/మట్టి రోడ్లపై జర భద్రం
బురదతో నిండిపోయిన లేదా మట్టి రోడ్లపై వర్షాకాలంలో కారు నడపటం అంటే కత్తిమీద సాము లాంటిదే. బురద రోడ్లపై వేగంగా వెళ్ల కూడదు. అలా వెళ్లటం వలన మీ కారు జారిపోయే ప్రమాదం ఉంది లేదా మీ కారు టైర్లు చిమ్మే బురద అవతలి వాళ్ల కార్ల అద్దాలపై పడి వారికి లేదా వారి వలన మీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

బ్రేక్‌లను టెస్ట్ చేసుకోండి
వర్షాకాలంలో ప్రయాణం ప్రారంభించడానికి ముందే మీ కారు బ్రేకులను ఓసారి చెక్ చేసుకోండి. వర్షంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు వాటిని పొడిగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.

సడెన్ బ్రేకులు వేయటాన్ని మానుకోండి
ఒకవేళ మీ కారు రోడ్డుపై జారిపోతున్నట్లు అనిపిస్తే, వాహనాన్ని నిలిపేందుకు కంగారులో సడెన్ బ్రేకులు వేయకండి. దీని వలన ప్రమాదం మరింత పెద్దదయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి సందర్భాల్లో స్టీరింగ్‌పై పూర్తి కంట్రోల్‌ను ఉంచుకొని కొంచెం కొంచెంగా కారు వేగాన్ని తగ్గించుకోవటం ద్వారా వాహనాన్ని కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు.

వైపర్లు, వాషర్లు చెక్ చేసుకోండి
వర్షాకాలంలో ప్రయాణం ప్రారంభించడానికి ముందుగానే వైపర్లు, వాషర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి. విండ్‌షీల్డ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి.

హెడ్‌లైట్లను చెక్ చేసుకోండి
రాత్రి వేళల్లో వర్షం పడుతున్నప్పుడు డ్రైవ్ చేసే సమయంలో హెడ్‌లైట్లు సరిగ్గా పనిచేయటం ఎంతో ముఖ్యం. కాబట్టి బ్యాటరీ, హెడ్‌లైట్లు, ఇండికేటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో సరిచూసుకోండి. ఎమర్జెన్సీ కోసం కారులో ఓ టార్చిలైటును ఉంచుకోవటం కూడా మంచిదే.

స్పేర్ వీల్‌ను క్యారీ చేయటం మర్చిపోకండి
వర్షాకాలంలో లాంగ్ రూట్లలో ప్రయాణిస్తున్నప్పుడు లేదా గతుకుల రోడ్లలో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా పంక్చర్ అయితే వెంటనే వీల్‌ను మార్చుకునేందుకు స్పేర్ వీల్ ఎల్లప్పుడూ మీ కారులోనే ఉండేలా చూసుకోండి.

వర్షంలో సురక్షితంగా డ్రైవ్ చేయటం ఎలా: చిట్కాలు
ఇవి వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని చిట్కాలు మాత్రమే. మీకు తెలిసిన మరిన్ని చిట్కాలు ఏవైనా ఉంటే మా పాఠకులతో పంచుకోండి..!


Click it and Unblock the Notifications








