వర్షాకాలంలో జర భద్రం బ్రదర్..! - డ్రైవింగ్ చిట్రాలు
వర్షాకాలం కొందరికి చిరునవ్వులు కురిపిస్తే మరికొందరికి కనువిప్పు కలిగిస్తుంది. సాధారణంగా, వర్షాకాలంలో తడిసిన రోడ్లపై వాహనాలను నడపటం అంటే, కత్తిమీద సాము లాంటిదే. ఇలాంటి రోడ్లపై ప్రయాణించడం చాలా రిస్కుతో కూడుకున్న విషయం.
ఎప్పుడూ తడిగా ఉండే వాతావరణం, నునుపుగా ఉండే రోడ్లు, బురద, మ్యాన్‌హోల్స్ (పాట్‌హోల్స్) ఇలా రోడ్డుపై ప్రతిదీ కూడా, ఈ కాలంలో సౌకర్యవంతమైన ప్రయాణానికి అడ్డంకి గానే మారుతాయి. అలాంటప్పుడు అవగాహన రాహిత్యంతో వాహనం నడిపితే ప్రమాదాలను కొని తెచ్చుకోవటం ఖాయం.
ఈ నేపథ్యంలో వర్షాకాలంలో వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని చిట్కాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

బ్రేక్ వేసేటప్పుడు పారాహుషార్..
సాధారణంగా, వర్షాకాలంలో తడి రోడ్లపై వెళ్తున్నప్పుడు హఠాత్తుగా బ్రేక్ వేస్తే, వాహనం జారిపోతుంది. ఈ సందర్భాల్లో వాహనాన్ని నిలిపే సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టాపింగ్ దూర్ (బ్రేకింగ్ దూరం) సుమారు రెండు రెట్లు పెరుగుతుంది. కాబట్టి, వర్షాకాలంలో తడి రోడ్లపై ఎల్లప్పుడూ తక్కువ వేగంతో ప్రయాణిస్తూ, ముందున్న వాహనాన్ని వీలైనంత దూరంలో ప్రయాణించాలి

లో విజిబిలిటీ
వర్షం పడుతున్నప్పుడు రోడ్డుపై విజిబిలిటీ (దృష్టి మందగింపు)ని తగ్గుతుంది. కారు ముందు విండ్ స్క్రీన్‌పై వైపర్లు ఆన్‌లో ఉన్నప్పటికీ, వర్షపు చినుకుల కారణంగా దృష్టి మందగిస్తుంది. విండ్‌స్క్రీన్‌లు దుమ్ము, మురికి పట్టి ఉంటే ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. కాబట్టి, విండ్‌స్క్రీన్‌లను ఎప్పటికప్పుడు దుమ్ము, ధూళి చేరకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. నాణ్యమైన వాషర్ ఫ్లూయిడ్‌లనే వాడాలి. విండ్‌స్క్రీన్‌లపై ఆవిరి చేరుతున్నట్లు అనిపిస్తే, కారులోపలి హీటర్‌ను ఆన్ చేయండి. వైపర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.

బురద నీరు
వర్షాకాలంలో కేవలం ఆకాశం నుంచి పడే చినుకులే కాదు, రోడ్డుపై నిలిచిపోయిన నీరు కూడా ప్రమాదకరమే. ఎదురుగా వేగంగా వచ్చే వాహనాల వలన రోడ్డుపై నీరు ఎగిరి విండ్‌స్క్రీన్‌పై పడి విజిబిలిటీని తగిస్తుంది. బురద నీరైతే దీని తీవ్రత మరింత అధికంగా ఉంటుంది. పెద్ద ట్రక్కులు, బస్సులు వంటి భారీ వాహనాలు ఎక్కువగా నీటిని స్ప్రే చేస్తాయి. కాబట్టి, ఇలాంటి వాహనాలు ఎదురుగా వస్తున్నప్పుడు మీ వాహన వేగాన్ని తగ్గించుకోవడం మంచిది.

నీటి మడుగులు..
గుంతలు కలిగిన రోడ్డుపై ప్రయాణించేప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ గుంతలు పూర్తిగా నీటితో నిండిపోయి ఉండి ప్రమాదకరంగా ఉంటాయి. వీటిల్లో చక్రాలు ఇరుక్కుపోవటం లేదా ఇలాంటి రోడ్లపై వేగంగా వెళ్లటం వలన నీరు అవతలి వాహనాలపై పడటం వంటి ప్రమాదాలు జరగవచ్చు.

వాగులు, వరదలు
వరదలు లేదా నీటి ప్రవాహాం ఎక్కువగా ఉండే రోడ్లపై అస్సలు ప్రయాణించకపోవటమే ఉత్తమం. మన యాంత్రిక వాహనాలు ప్రకృతి శక్తి ముందు బలహీనమైనవే. కారులో ప్రయాణిస్తున్నప్పుడు నీరు ఎంత వేగంతో ప్రవహిస్తోంది, ఎంత లోతు ఉందనే విషయాలను గుర్తించడం కష్టం. అలాంటి దారుల్లో మొండిగా వాహనాన్ని ముందుకు నడిపితే చిక్కులో పడటం ఖాయం. కాబట్టి, కారు సైలెన్సర్ కన్నా ఎక్కువ లోతు నీరు ప్రవహిస్తున్నప్పుడు అలాంటి రోడ్లపై ప్రయాణించకపోవటమే ఉత్తమం.

నీటితో నిండిన రోడ్లపై ప్రయాణం..
ఇలాంటి రోడ్లపై తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు రోడ్డు ఏ వైపు ఎత్తుగా ఉంటుందో అటువైపు మాత్రమే డ్రైవ్ చేయండి. కంగారులో వేగంగా డ్రైవ్ చేయకండి. వీలైనంత నెమ్మదిగా డ్రైవ్ చేయండి. స్పీడ్‌గా వెళ్లటం వలన నీరు ఇంజన్, సైలెన్సర్‌లోకి వెళ్లే ఆస్కారం ఉంది. ఫస్ట్ గేర్‌లో క్లచ్‌ను లైట్‌గా ప్రెస్ చేసి డ్రైవ్ చేయండి. దీనివలన సైలెన్సర్‌లోకి నీరు వెళ్లే అవకాశం తగ్గుతుంది. యాక్సిలరేటర్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ కాలు తీయకండి. ఒక్కసారి ఇలాంటి రోడ్డును దాటిన తర్వాత బ్రేక్‌లను లైట్‌గా అప్లయ్ చేయడం ద్వారా వాటిని డ్రై చేయండి.



Click it and Unblock the Notifications








