Driving Tips: న్యూ ఇయర్ వేళ డ్రైవింగ్ చేస్తున్నారా.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే తప్పదు భారీ మూల్యం
రేపు కొత్త సంవత్సరం 2024 లోకి అడుగుపెట్టబోతున్నాం. నూతన సంవత్సర వేడుకలను జరుపుకొనేందుకు చాలా మంది తమ స్నేహితులతో కలిసి కార్లలో ఎక్కువగా బయటకు వెళ్తుంటారు. అయితే కొత్త సంవత్సరం నేపథ్యంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.
కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మహానగరం రాత్రంతా మేల్కొనే ఉంటుంది. ఈ క్రమంలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల దృష్ట్యా పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు. ఆదివారం(డిసెంబర్ 31) రాత్రి 8 గంటల నుంచి సోమవారం(జనవరి 1) ఉదయం వరకు పెద్ద ఎత్తున చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు గంజాయి టెస్ట్ కూడా నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడినా, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ చేసినా, బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా కొత్త సంవత్సరం సందర్భంగా నగరవ్యాప్తంగా చాలావరకు ప్లై ఓవర్లపై వాహనాలకు అనుమతి నిషేధించనున్నారు. అయితే న్యూ ఇయర్‌ను బయటకు వెళ్లి సెలబ్రేట్ చేసుకునేవారు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకోసం కొన్ని సూచనలను మీకు ఇక్కడ అందిస్తున్నాం.
సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి: కొత్త సంవత్సర వేడుకల సమయంలో చాలా మంది మద్యం సేవిస్తారు. నగరాల్లో, పబ్బుల్లో న్యూ ఇయర్ సందర్భంగా మద్యం పార్టీలకు అంతే ఉండదు. కాబట్టి మీరు నూతన సంవత్సర వేడుకల్లో మద్యం(New Year Driving Tips) సేవించాలి అనుకుంటే.. మిమ్మల్ని ఇంటికి సురక్షితంగా చేర్చడానికి మద్యం అలవాటు లేని వ్యక్తిని మీతో పాటు ఉండేలా చూసుకోండి.

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : నూతన సంవత్సర వేడుకల్లో(Don't Drunk and Drive) ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఏదైనా కారణం చేత కొత్త సంవత్సర వేడుకల సమయంలో మీరు మద్యం మత్తులో ఉంటే, మీరు వాహనం నడపకుండా జాగ్రత్తగా ఉండండి.
రోడ్డు భద్రత(Road Safety): కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఎందుకంటే ఈ సమయంలో మద్యం తాగి డ్రైవ్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు రోడ్డుపై జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ఇతర వాహనాలను పరిశీలిస్తూ కూడా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే రోడ్డుపై వెళ్తున్న ఇతర డ్రైవర్లు మద్యం మత్తులో వచ్చి మీ వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది.

సరైన పార్కింగ్ స్థలంలో కారును పార్క్ చేయాలి: చాలా మంది రోడ్డుపైనే ఎక్కువగా కారు పార్క్ చేస్తుంటారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ అలవాటు మానుకోండి. ఎందుకంటే మద్యం మత్తులో వాహనాలను ధ్వంసం చేసే సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. కాబట్టి నూతన సంవత్సర వేడుకల సమయంలో మీ వాహనాన్ని సరైన పార్కింగ్ స్థలంలో పార్క్ చేయాలని గుర్తుంచుకోవాలి.
రాత్రిపూట ప్రయాణం మానుకోండి: మీరు కొత్త సంవత్సరాన్ని ఒంటరిగా(Driving Tips) ప్రత్యేక ప్రాంతాల్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగానే బయలుదేరాలి. ఎందుకంటే న్యూ ఇయర్ సందర్భంగా రాత్రిళ్లు ట్రాఫిక్ సమస్య ఎక్కుగా ఉంటుంది. ఇందుకోసం ఓ టైమ్ టేబుల్ ప్రణాళిక వేసుకుంటే మీకు రాకపోకలకు అంతరాయం ఉండదు.

సన్‌రూఫ్ నుంచి బయటకు రావద్దు: ఇప్పుడు కొత్తగా వస్తున్న కార్లలో చాలా వరకు సన్‌రూఫ్ ఫీచర్ ఉంటుంది. అయితే దీనిని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి చూస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కారు సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
బైక్‌లపై విన్యాసాలు వద్దు: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్లిక్ రోడ్లపై బైక్‌లపై ప్రయాణించే పలువురు విన్యాసాలు చేస్తుంటారు. దీని ద్వారా రోడ్లపై చాలా మంది దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరం. పబ్లిక్ రోడ్లపై బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయాలి.

ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు కొత్త సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోగలుగుతారు. చాలా వరకు డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో నిర్లక్ష్య డ్రైవింగ్ ద్వారా ప్రాణాలు కోల్పోతుంటారు. ఇది వారి కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగుల్చుతుంది. కాబట్టి కొత్త సంవత్సరం ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే.. ముందుగా మీరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం చాలా అవసరమని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications








