కారును సురక్షితంగా రివర్స్ చేయటం ఎలా - చిట్కాలు
కారును రివర్స్ చేయడం కూడా ఒక కళే. అంతేకాదండోయ్.. కారును ముందుకు నడిపినంత ఈజీ కాదు రివర్స్ చేయటం. ఇందుకు సరైన అవగాహన, అంచనా, నైపుణ్యం కావాలి. లేకపోతే కారు పెద్ద సొట్ట పడటం ఖాయం. ఏమంటారు..?
ప్రస్తుతం అందబాటులోకి వచ్చిన పార్కింగ్ సెన్సార్లు, పార్కింగ్ అసిస్టెన్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అధునాతన టెక్నాలజీతో వెనక్కి తిరిగి చూడకుండా కారును రివర్స్ చేసే సౌకర్యం ఉంటుంది. అయితే, అన్ని కార్లలో ఇలాంటి టెక్నాలజీ ఉండదు కాబట్టి, కారును రివర్స్ చేసేటప్పుడు, సైడ్ మిర్రర్స్, సెంటర్ మిర్రర్స్ సహాయంతో పాటు మీ మెడను సైతం వెనక్కు తిప్పి కారును రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా కారును రివర్స్ చేసే సమయంలో కొన్ని చిన్న పాటి జాగ్రత్తలను మనం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..!!
• కారను రివర్స్ చేసేటప్పుడు సమీపంలో ఉండే పాదచారులు, ట్రాఫిక్‌ను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఒకవేళ రోడ్డుపై రివర్స్ చేస్తున్నట్లయితే, వెనుక వచ్చే ట్రాఫిక్, వ్యక్తులు, వాహనాలపై ఓ కన్ని వేసి ఉంచాలి. ముందు వైపు, వెనుక వైపు, మీ రెండు భుజాలకు అటు ఇటు వైపులా అలాగే మిర్రర్స్‌లో గమనించి, ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కారును రివర్స్ చేయాలి.
• పాఠశాలలు, ఆట స్థలాలు, నివాస స్థలాలు, పార్కులు వంటి స్థలాల్లో చిన్న పిళ్లలు ఎక్కువగా తిరుగుతుండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇలాంటి ప్రాంతాల్లో కారును రివర్స్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తతో వ్యవహరించాలి.
• ఒకవేళ కారును రివర్స్ చేసేటప్పుడు మీ వెనుక ఉండే వస్తువులు/ఆటంకాలు మీకు స్పష్టంగా కనిపంచికపోయినట్లయితే, ఇతరుల సహాయం తీసుకొని కారును రివర్స్ చేయండి.
• కారును రివర్స్ చేసే సమయంలో పాదచారులు, ట్రాఫిక్ దారిని వదలటం మర్చిపోకండి.
• పెద్ద రోడ్డు లోనుంచి చిన్న రోడ్డుకు రివర్స్ చేసేటప్పుడు, రోడ్డును జాగ్రత్తగా పరిశీలించి పూర్తిగా సురక్షతమని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రివర్స్ చేయండి. ఇలా ఒక రోడ్డు నుండి మరొక రోడ్డు లోనికి రివర్స్ చేసేటప్పుడు అవతలి రోడ్డు లోనుంచి వచ్చే వాహనాలకు దారి ఇచ్చే విధంగా రోడ్డుకు ఒక పక్కగా మాత్రమే రివర్స్ చేయాలి.
• వీలైనంత వరకూ, పైన తెలిపిన దానికి భిన్నంగా.. అంటే చిన్న రోడ్డు నుండి పెద్ద రోడ్డు లోనికి రివర్స్ చేయటం చేయకండి. ఇది అంత సురక్షితమైనది కాదు.
• చీకటి వేళలు, కాంతి తక్కువగా ఉండే ప్రదేశాల్లో రివర్స్ చేసేటప్పు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి.
• ఒకవేళ రివర్స్ చేసే సమయంలో వెనుక వైపు ఉండే వస్తువులు/ఆటంకాల పట్ల మీకేమైనా సందేహం వస్తే, ఒక్కసారి కారు లోనుంచి క్రిందకు దిగి వాటిని మీ కళ్లతో చూసిన తర్వాత మాత్రమే సురక్షితంగా రివర్స్ చేయండి.
చివరిగా కారును రివర్స్ చేసే సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించటం, మీ దృష్టి వేరే వాటిపైకి మరల్చడం వంటి పనులు చేయకండి.


Click it and Unblock the Notifications








