పొగ మంచు కురుస్తున్న రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే..!
భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం సహా రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడమూ కారణం. ఈ శీతాకాలంలో వాహనాలను డ్రైవింగ్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్నది. పొడిగా ఉన్న రోడ్లు సహా దట్టమైన మంచు కారణంగా ఏ మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మంచు కారణంగా తడిగా ఉన్న రోడ్లు సహా పొగ మంచు దట్టంగా కురుస్తున్న సమయంలో ప్రయాణం చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది అనుభవజ్ఞులైన డ్రైవర్లు సైతం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అయితే పొగమంచు కురుస్తున్న ప్రాంతాలున్న రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

లోబీమ్ లైట్లనే వినియోగించాలి : చాలా మంది డ్రైవర్లు సరైన అవగాహన లేకుండా పొగమంచు కురుస్తున్న ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హైబీమ్ లైట్లను వినియోగిస్తారు. హైబీమ్ లైట్లు ఎక్కువ కాంతినిస్తాయని భావిస్తారు. అయితే ఈ హైబీమ్ లైట్ల కారణంగా వచ్చే కాంతి పొగమంచులో కలిసిపోతుంది.
అదే లోబీమ్ లైట్లను వినియోగించడం ద్వారా ఎదురుగా వస్తున్న వాహనాల డ్రైవర్లకు మీ ఉనికి తెలుస్తుంది. ఫలితంగా ముందుగా అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు పొగమంచు ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు కచ్చితంగా ఫాగ్ లైట్లను వినియోగించాలి. చాలా వరకు ప్రమాదాలను నుంచి సురక్షితంగా కాపాడతాయి.

దట్టమైన పొగమంచు ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వార్నింగ్ లైట్‌ను ఆన్ చేసుకొని ప్రయాణించడం ఉత్తమం. ఫలితంగా మనకు ఎదురుగా, వెనుకన వచ్చే వాహనదారులు మన వాహనం ఉనికిని గుర్తించే అవకాశం ఉంటుంది. మరియు పొగమంచు సమయంలో వీలైనంత నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం చాలా ఉత్తమం. మరియు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
ప్రస్తుతం చాలా వరకు రాష్ట్ర, జాతీయ రహదారులు రేడియం లైటింగ్స్‌ను కలిగి ఉంటున్నాయి. ఇవి రోడ్లను రెండుగా విభజిస్తాయి. మరియు బ్రిడ్జి, ఇరుకైన రోడ్ల వద్ద అదనపు రేడియమ్ లైటింగ్, తెలుపు, పసుపు రంగుల్లో హెచ్చరికలుంటాయి. వీటిని సరిగా అనుసరించడం ద్వారా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

ఢీ ఫాగర్ వినియోగం : వాహనం యొక్క అద్దాల మీద ఉన్న మంచును కరిగించేందుకు డీ ఫాగర్‌ను వినియోగిస్తారు. శీతాకాలంలో పొగమంచు కారణంగా కారు ముందు, వెనుక అద్దాల మీద తెల్లగా మంచు పేరుకుపోతుంది. ఫలితంగా రోడ్డును సరిగా చూసేందుకు అవకాశం ఉండదు. ఈ మంచును ఆటోమేటిక్‌గా కరిగించేందుకు చాలా కార్ల తయారీ సంస్థలు ఢీ ఫాగర్‌ను అందిస్తున్నాయి. ఇది అద్దాలను వెడేక్కేలా చేసి మంచును కరిగిస్తుంది.
స్పీకర్ల సౌండ్ తగ్గించండి : పొగ మంచులో ప్రయాణం చేస్తున్న సమయంలో వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండాలి. పాటలు వింటూ డ్రైవింగ్ చేయడం మంచి అనుభూతిని కలిగించినా.. ఇలాంటి రోడ్లపై మ్యూజిక్ సిస్టమ్ సౌండ్‌ను వీలైనంత తక్కువగా ఉంచాలి. లేదా పూర్తిగా సౌండ్ ఆఫ్ చేసినా మంచిది.
పొగమంచు దట్టంగా కురుస్తు్న్న ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందున్న వాహనాలతో తగినంత దూరాన్ని పాటించండి. ముందున్న వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా, వెంటనే స్పందించి అప్రమత్తమయ్యేందుకు సమయం ఉంటుంది. ముందున్న వాహనాలను టెయిల్ లైట్లు, బ్రేక్ లైట్ల ద్వారా అనుసరించవచ్చు.
పొగమంచు, రాత్రి వేళల్లో ప్రయాణానికి ముందు వాహనం హెడ్‌లైట్ల పనితీరును తనిఖీ చేయాలి. ఒక లైట్ మాత్రమే పనిచేస్తున్న సమయంలో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. సింగిల్ హెడ్‌లైట్ కారణంగా.. వాహనం టూ వీలర్ అని పొరపాటు పడే అవకాశం ఉంది. ఆ కారణంగా ప్రమాదాలు జరగవచ్చు.


Click it and Unblock the Notifications








