దొంగిలించబడిన కారును తక్షమే ట్రాక్ చేసే చిట్కాలు..
మీ కారులో ఖరీదైన ట్రాకింగ్ సిస్టమ్ లేదా..? అయినా ఫర్వాలేదు, ఎవరైనా మీ కారును దొంగిలిస్తే, సదరు కారు ఏ ప్రాంతంలో తిరుగుతుందో, ఎక్కడికి వెళుతుందో, ఏ స్థితిలో ఉందో, ఏ ఏరియాలో ఉందో సులువుగా ట్రాక్ చేసుకునే చిట్కాను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
సాధారణంగా లోబడ్జెట్ కార్లలో ట్రాకింగ్ సిస్టమ్, జిపిఎస్ నావిగేషన్ వంటివి ఇన్‌బిల్ట్‌గా రావు. వీటిని బయటి మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలి. అయితే, ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. ఈ ఖర్చును భరించలేని వారు క్రింద తెలిపిన విధంగా, అతి తక్కువ ఖర్చుతో మీ కారులో ట్రాకింగ్ సిస్టమ్ లాంటి ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. అదెలాగో పరిశీలిద్దాం రండి..!
కారును దొంగలబారి నుంచి రక్షించేందుకు ఎలాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నప్పటికీ, చేయితిరిగిన చోరులకు సదరు కార్లను తస్కరించడం చిటెకలో పని. మరి దొంగిలించబడిన కారును ట్రాక్ చేయటం ఎలా..? ఇందుకు సులువైన పరిష్కారం, ఓ చవకబారు మొబైల్ ఫోన్. అవును కేవలం రూ.500-1000 విలువ కలిగిన ఓ చౌక మొబైల్ సాయంతో దొంగిలించబడిన మీ కారును సులువుగా ట్రాక్ చేయవచ్చు.
ఈ విధానం ఎలాగో క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

చౌక ఫోన్ ఒకటి కొనండి
ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో రూ.500 నుంచి చౌక మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ రోజుల స్డాండ్‌బై టైమ్ (మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా ఉండే సమయం) కలిగిన మొబైల్‌ను కొనుగోలు చేయండి.

మంచి నెట్‌వర్క్ కలిగిన సిమ్ కార్డ్
దేశంలో కెల్లా ఉత్తమ నెట్‌వర్క్ కవరేజ్ (బిఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ వంటి పెద్ద నెట్‌వర్క్‌లు) కలిగిన పనిచేసే సిమ్ కార్డును ఒకదానిని సదరు మొబైల్‍లో ఇన్‌స్టాల్ చేయండి.

మొబైల్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచండి
మొబైల్ ఫోన్‌లో సిమ్ కార్డును ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, సదరు మొబైల్‌ను పూర్తిగా సైలెంట్ మోడ్‌లో (సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పుడు వైబ్రేషన్ కూడా రాకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి) ఉంచాలి.

మొబైల్‌ను కారులో సీక్రెట్‌గా ఉంచాలి
మొబైల్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచిన తర్వాత సదరు మొబైల్ ఫోన్‌లోకి దుమ్ము, ధూళి చేరకుండా ఉండేలా ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, కారు లోపల ఎవ్వరికీ కనిపించని విధంగా ఎక్కడైనా రహ్యసంగా దాచాలి.

మొబైల్ నెంబర్ పనిచేస్తుందో లేదో సరిచూసుకోవాలి
ఇలా మొబైల్‌ను రహస్య ప్రదేశంలో ఉంచిన తర్వాత, సదురు మొబైల్ నెంబరుకు వేరే ఫోన్ నుంచి కాల్ చేస్తే రెస్పాండ్ అవుతుందో లేదోనని ఒకటి రెండుసార్లు సరిచూసుకోవాలి.

మొబైల్‌ను అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి
ఇలా రహస్యంగా కారులో దాచి ఉంచిన మొబైల్‌ను అప్పుడప్పుడు బయటకు తీసి, సరిగ్గా పనిచేస్తుందో లేదో, ఛార్జింగ్ ఉందో లేదో, నెట్‌వర్క్ సిగ్నల్స్ ఉన్నాయో లేవోనని తనిఖీ చేసుకుంటుండాలి.

కారు దొంగతనానికి గురైతే..
ఇలా మొబైల్ ఉంచిన కారు దొంగతనానికి గురైన తక్షణమే, 100 (వన్ జీరో జీరో)పై పోలీసులకు ఫిర్యాదు అందజేసి, ఆ కారులో మొబైల్ ఫోన్ ఉంచిన విషయాన్ని, ఆ మొబైల్ ఫోన్ (కారులో ఉంచిన ఫోన్) నెంబరును వారికి తెలియజేయాలి.

ఎలా ట్రాక్ చేస్తారు..?
కారును దొంగిలించిన వ్యక్తికి ఆ కారులో మొబైల్ ఫోన్‌ను రహస్యంగా దాచి ఉంచామన్న సంగతి తెలిసి ఉండదు. కాబట్టి, ఆ కారులోని మొబైల్ ఫోన్‌కు అందే నెట్‌వర్క్ సిగ్నల్స్‌ను ఆధారంగా చేసుకొని శాటిలైట్ వ్యవస్థ సాయంతో దొంగిలించబడిన కారు ఏ ప్రాంతంలో ఉందో సులువుగా ట్రాక్ చేసేందుకు వీలవుతుంది. ఇలా చేయటం వలన దొంగిలించబడిన కారును అతితక్కువ సమయంలో ట్రాక్ చేసేందుకు వీలవుతుంది. మరి బాగుందా..? ఈ చిట్కా..?


Click it and Unblock the Notifications








