సంగీతం ఆనందాన్నిస్తుంది.. కానీ రోడ్లపై చంపేస్తుంది..!
జీవితం ఎంతో విలువైనది, చిన్న పాటి ఆనందాల కోసం అతి విలువైన మన జీవితాన్ని తెలిసి తెలిసి మనమే ప్రమాదాల్లో పడేసుకుంటున్నాయి. అయిన వాళ్లకి తీరని శోకాన్ని మిగుల్చుతున్నాం.
సంగీతం...! సంగీతానికి బ్రతికించే శక్తి ఉందో లేదో తెలియదు కానీ చంపే శక్తి అయితే మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. మనలో చాలా మందికి సంగీతం అంటే చాలా ఇష్టం. సంగీతం మనసును తేలిక చేస్తుంది. ఓ కొత్త ప్రంపంచంలోనికి తీసుకువెళ్తుంది. అయితే, సంగీతం వినడానికి ఓ సమయం, సందర్భం అంటూ ఉంటుంది. అలా కాకుండా, ఎప్పుడు పడితే అప్పుడు సంగీతం వింటే అది మన పాలిట చరమగీతం పాడుతుంది.

ప్రస్తుతం తరం కుర్రకారు ఉర్రూతలూగించే సంగీతం అంటే చెవులు కోసేసుకుంటారు. వీరికి సంగీతం వినడానికి ఓ సమయం సందర్భం అంటూ ఉండదు. బాత్రూమ్‌లో, బస్సుల్లో, రోడ్లపై, చివరికి పడుకునే ముందు పడకపై ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే చెవుల్లోకి గాలి కూడా చొరడబడని విధంగా హెడ్‌ఫోన్స్‌ను (ఇయర్‌ఫోన్స్)ను ఇరికించుకొని చెవుల నుండి రక్తం వచ్చే వరకూ సంగీతాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు.
ఇటీవలి కాలంలో ఇలాంటి వారు అనేకమంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నట్లు మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. రోడ్డు దాటుతూ ఒకరు, రైల్వే క్రాసింగ్ దాటుతూ మరొకరు, బైక్ నడపుతూ ఇంకొకరు, కారు నడుపుతూ వేరొకరు.. ఇలా చాలా మంది విషయంలో వారు ఉపయోగించిన హెడ్‌ఫోన్లే వారి పాలిట యమ పాశాలుగా మారిపోతున్నాయి.
రోడ్డుపై నడుస్తున్నప్పుడు లేదా వాహనం డ్రైవ్ చేస్తున్నప్పుడు, చుట్టు పక్కల పరిసరాలు, వెనుక/ముందు నుండి వచ్చే వాహనాలు, రోడ్డుపై నడిచే వెళ్లే పాదచారులు ఉంటారనే విచక్షణ లేకుండా, కేవలం కళ్లకు మాత్రమే పనిచెబుతూ చెవులను హెడ్‌ఫోన్స్‌తో మూసేసుకుంటున్నారు. ఈ హెడ్‌ఫోన్స్ నుండి వచ్చే సంగీతం వారి చెవులతో పాటు కళ్లను సైతం మూసేస్తోంది.
ఎక్కువగా, భావితరానికి ఉపయోగపడాల్సిన ఆధునిక యువత ఇలాంటి ప్రమాదాల్లో తమ విలువైన జీవితాలను కోల్పోతుంది. బంధుమిత్రులకు తీరలేని లోటును మిగుల్చుతుంది. సంగీతం వినడంలో తప్పు లేదు, కానీ మీరు సంగీతం వినే ప్రదేశాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రమాదాలను గుర్తించుకోండి. తెలుసుకోండి... ఇకనైనా మేలుకోండి..!!
దయచేసి రోడ్డుపై నడుస్తున్నప్పుడు కానీ, బస్సు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు కానీ, ఎలాంటి వాహనాలనైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ హెడ్‌ఫోన్లను ఉపయోగించకండి. మీ జీవితాలను సురక్షితంగా ఉంచుకోండి.


Click it and Unblock the Notifications








