టెస్ట్ డ్రైవ్‌కు సిద్ధం కావటం ఎలా - చిట్కాలు
ఎవరైనా కారు కొనేముందు దానికి సంబంధించి చాలానే హోమ్‌వర్క్ చేస్తారు. పది మందిని విచారించడం, నిపుణుల సలహా తీసుకోవంట, నాలుగైదు షోరూమ్‌లు/డీలర్‌షిప్‌లలో విచారణలు చేయటం ఇలాంటివి చాలానే చేస్తుంటారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత, కారును కొనాలని సిద్ధపడే ముందు సదరు మోడల్ డెమో కారును టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తారు.
వాస్తవానికి కారును కొనే ప్రక్రియలో అత్యంత కీలకమైనది టెస్ట్ డ్రైవ్ అనే చెప్పాలి. మనం కొనాలనుకున్న కారును ముందుగానే టెస్ట్ డ్రైవ్ చేయటం వలన అందులోని ప్లస్‌లు, మైనస్‌లు మనకు అర్థమవుతాయి. టెస్ట్ డ్రైవ్ చేసి సదరు కారుతో మనం సంతృప్తి చెందింతే అదే మోడల్ కారును కొనుగోలు చేయటం జరుగుతుంది. ఒకవేళ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఆ కారు మనకు సౌకర్యంగా అనిపించకపోతే, మనస్సు మార్చుకొని వేరే మోడల్ కారును లేక అదే సెగ్మెంట్లో వేరే బ్రాండ్ కారునో ఎంచుకుంటాం.
సరే ఇదంతా అటుంచి.. కారును టెస్ట్ డ్రైవ్ చేయటానికి వెళ్లినప్పుడు ఏయే అంశాలను పరిశీలించాలి, టెస్ట్ డ్రైవ్‌కు ఏ విధంగా సిద్ధం కావాలో తెలిపే కొన్ని చిట్కాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో కారు టెస్ట్ డ్రైవ్ చేయటానికి సంబంధించిన చిట్కాలను తెలుసుకోండి.

1. చెక్ లిస్ట్ తయారు చేసుకోండి
టెస్ట్ డ్రైవ్ చేయటానికి షోరూమ్‌కు వెళ్లటానికి ముందుగానే మీరు ఓ చెక్ లిస్ట్‌ను తయారు చేసుకోండి. ఈ చెక్ లిస్టులో కారులోని ఏయే అంశాలను జాగ్రత్తా పరిశీలించాలో ముందుగానే నోట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయటం వలన టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఫలానా ఫీచర్ గురించి చెక్ చేయటం మర్చిపోయే అవకాశం ఉండదు.

2. ఎక్స్టీరియర్ చెక్ చేయండి
టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లగానే నేరుగా కారు లోపల కూర్చోకుండా, ముందు దాని ఎక్స్టీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఒకవేళ టెస్ట్ డ్రైవ్ కారు ఎక్స్టీరియర్స్ మీకు నచ్చకపోతే, షోరూమ్‌లో డిస్‌ప్లేలో ఉంచిన అదే మోడల్ కారును ఎక్స్టీరియర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. వీలైతే వాటి ఫీచర్ల గురించి సేల్స్ పర్సన్‌ను అడిగి తెలుసుకోండి. కారు పొడవు, వెడల్పు, ఎత్తు, గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాలను కూడా తెలుసుకోవటం మంచిది. వీటిని బట్టి కారు మీ గ్యారేజ్ (ఆ సౌకర్యం ఉంటే)లో పడుతుందో లేదో తెలుస్తుంది.

3. సీటింగ్ కంఫర్ట్
ఎక్స్టీరియర్స్ గురించి తెలుసుకున్న తర్వాత, ఇంటీరియర్స్‌ను పరిశీలించండి. కారులో డ్రైవర్ సీట్లో కూర్చున్న తర్వాత, మీ సీటింగ్ కంఫర్ట్‌ను చూసుకోండి. ఆ కారులో డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్ ఉందో లేదో తెలుసుకోండి. డ్రైవర్ సీటులో కూర్చున్న తర్వాత డ్యాష్‌బోర్డుపై ఉండే స్విచ్‌లు, ఇతర యాక్సెసింగ్ కంట్రోల్స్‌ను మీరు సౌకర్యంగా అందుకోగలరో లేదో చెక్ చేసుకోండి.

4. విజిబిలిటీ చెక్ చేసుకోండి
కారును స్టార్ట్ చేయటానికి ముందు ఒక్కసారి విజిబిలిటీని చెక్ చేసుకోండి. డ్రైవర్ సీట్లో కూర్చున్న తర్వాత మీరు ముందు వైపు రోడ్డు మార్జిన్లు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో చూసుకోండి. అలాగే రియర్ వ్యూ మిర్రర్‌లో వెనుక నుంచి వచ్చే వాహనాలను చూడగలరో లేదో చూసుకోండి. ఏ-పిల్లర్ వలన బ్లైండ్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. అంతా పర్‌ఫెక్ట్‌గా ఉందనుకుంటే, సీట్ బెల్ట్ ధరించి టెస్ట్ డ్రైవ్ కోసం ముందుకు సాగిపోండి.

5. ఎక్కువ దూరం టెస్ట్ డ్రైవ్ చేయండి
కారును టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు కొద్ది దూరం కాకుండా, వీలైనంత వరకు ఎక్కువ దూరం టెస్ట్ డ్రైవ్ చేయటానికి ప్రయత్నించండి. కేవలం ఖాలీగా ఉండే రోడ్లపై మాత్రమే కాకుండా వీలైతే రద్దీగా ఉండే సిటీ రోడ్లు, హైవేలపై కూడా టెస్ట్ చేయండి. కనీసం 6 నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు టెస్ట్ డ్రైవ్ చేయటం మంచిది. ఇలా చేయటం వివిధ రోడ్లపై కారు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.

6. గుర్తుంచుకోవాల్సిన అంశాలు
టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ కారుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. యాక్సిలరేషన్, హ్యాండ్లింగ్, బ్రేక్స్, టర్బో లాగ్ (టర్బో ఇంజన్ కలిగిన కార్ల విషయంలో), స్టీరింగ్, విజిబిలిటీ, క్యాబిన్‌లో సౌండ్, ఇంజన్ సౌండ్, ఎలక్ట్రానిక్ స్విచ్‌లో పనితీరు మొదలైన అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి.

7. హ్యాండ్లింగ్
టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుకు కారును నెమ్మదిగాను, వేగంగాను ఇలా అన్ని రకాల స్పీడ్స్‌తో డ్రైవ్ చేయండి. అలాగే, వీలైతే అన్ని రకాల రోడ్లపై కూడా కారును టెస్ట్ డ్రైవ్ చేయటానికి ప్రయత్నించండి. విభిన్న స్పీడ్స్, విభిన్న రోడ్లపై ఆ కారు హ్యాండ్లింగ్ ఎలా ఉందో తెలుసుకోండి. స్టీరింగ్ పనితీరును జాగ్రత్తగా పరిశీలించండి.

8. తుది నిర్ణయం
కారు టెస్ట్ డ్రైవ్ చేయటం పూర్తయిన తర్వాత ఆ మోడల్ కారు కొనుగోలుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోండి. టెస్ట్ డ్రైవ్ మీకు పూర్తి సంతృపినిస్తేనే ఆ మోడల్ కారును కొనుగోలు చేయండి లేకపోతే వేరే మోడల్‌ను ఎంచుకోవటమే మంచిది. ఎవరో చెప్పారని సౌకర్యంగా లేని కారును కొనుగోలు చేస్తే, ఆ తర్వాత దానిని నడిపినంత కాలం మీరే బాధ పడాల్సి ఉంటుంది.

చివరిమాట
కాబట్టి, ఇకపై ఎప్పుడైనా కొత్త కారును టెస్ట్ డ్రైవ్ చేయటం కోసం షోరూమ్‌కు వెళ్లేటప్పుడు, ముందుగా ఆ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి (ఇంటర్నెట్‌లో కానీ లేదా షోరూమ్ సేల్స్ పర్సన్ ద్వారా కానీ). టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఇదివరకు చెప్పుకున్న అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి సదరు కారు మీకు సౌకర్యంగా ఉందో లేదో తెలుసుకొని, తుది నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications








