బైక్ స్టంట్స్ చేసే ముందు జర భద్రం బ్రదరూ..! చిట్కాలు
ద్విచక్ర వాహనంపై వీలీ (ఒక్క చక్రంపై బైక్ నడపటం) చేయడమంటే యువతకు మహా సరదా. అయితే, వీలీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే, సరదా కాస్త విషాదంగా మారుతుంది. సాధారణంగా బైక్ స్టంట్‌లు చేసే వాళ్లు చాలా చాకచక్యంగా, ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని వీలీ చేస్తుంటారు. అనేక సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే, వారికి ఇందులో నైపుణ్యం వస్తుంది.
వీలీ చేయాలనుకునే యువత నేరుగా తామంతట తాము ప్రయత్నం చేయకుండా, ఇందులో నైపుణ్యం కలిగిన వారి నుంచి శిక్షణ పొందితే బాగుంటుంది. వీలీ చేయటంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. వీలీ చేసేటప్పుడు చుట్టు పక్కల పరిసరాలను ముందుగా అంచనా వేసుకుని, ఇటు మీకు అటు సాధారణ ప్రజానీకానికి పూర్తిగా సురక్షితం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీలీని చేయాలి.
సరైన శిక్షణ లేకుండా, ఒక చేతిలో క్లచ్ మరొక చేతిలో యాక్సిలేటర్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు వీలీ చేస్తే, ముందుకు పడి మూతి పళ్లు ఊడగొట్టుకోవటం ఖాయం. అసలు వీలీనే కాదు, బైక్‌పై ఎలాంటి స్టంట్‌లు అయినా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, క్రింద తెలిపిన వస్తువులు మీ వద్ద ఉంటేనే స్టంట్స్ చేయటానికి సిద్ధపడండి. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందా రండి.

ఫుల్ ఫేస్ హెల్మెట్:
ముఖాన్ని పూర్తిగా కవర్ చేసే విధంగా ధృఢమైన, నాణ్యమైన హెల్మెట్‌ను ధరించాలి. హెల్మెట్ బెల్ట్/స్ట్రాప్ పెట్టుకోవటం మర్చిపోకండి.

హ్యాండ్ గ్లౌజ్‌లు:
హ్యాండ్ గ్లౌజ్‌లు బైక్ హ్యండ్లింగ్‌కు మంచి గ్రిప్‌ను అందించడమే కాకుండా.. ప్రమాదవశాత్తు క్రింద పడినా చేతులకు గాయాలకు కాకుండా రక్షిస్తాయి

రైడింగ్ జాకెట్:
ఛాతీ భాగం, వెన్నెముక, మోచేతులను కవర్ చేసే విధంగా మన్నికగల రైడింగ్ జాకెట్లను ధరించి మాత్రమే స్టంట్‌లు చేయాలి.

రైడింగ్ ప్యాంట్:
రైడింగ్ జాకెట్ మాదిరిగానే రైడింగ్ ప్యాంట్ కూడా క్నీ గార్డ్ (మోకాళ్లను రక్షించే కవచం), థై గార్డ్ (తొడ భాగాన్ని రక్షించే కవచం)లను కలిగి ఉంటుంది. దురదృష్టవశాత్తు ప్రమాదాల వల్ల ఏర్పడే చిన్నపాటి గాయాల రైడింగ్ ప్యాంట్స్ రక్షణ కల్పిస్తాయి.

రైడింగ్ షూస్:
స్టంట్స్ చేసేటప్పుడు స్టీలో టోస్ (ముందువై ఉక్కు కలిగిన బూట్లు) ఉండే బూట్లను ధరించటం చాలా మంచిది. అత్యవసర సమయాల్లో ఇవి చక్కగా ఉపయోగపడుతాయి.

ఫస్ట్ ఎయిడ్ కిట్:
చివరిగా ఇదివరకు చెప్పుకున్న వస్తువులన్నింటితో పాటుగా ఎమర్జెన్సీలో ఉపయోగపడే నాణ్యమైన ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను కూడా మీ వెంట ఉంచుకోవటం ఎంతో సురక్షితం.

బైక్ రైడింగ్ గేర్..
ఈ వస్తువులన్నింటినీ రైడింగ్ గేర్ అని పిలుస్తారు. ఇవన్నీ ప్రముఖ ప్రీమియం బైక్ షోరూమ్‌లలోను లేదా మోటార్‌స్పోర్ట్ యాక్ససరీలు విక్రయించే షాపులలోను లభిస్తాయి.

అవగాహన లేకుండా, అవసరం లేకుండా బైక్ స్టంట్స్ చేయటం ప్రమాదకరం. ఇలా చేసేటప్పుడు ఒక్క క్షణం మీ ఇంట్లో వాళ్ల గురించి, మీపై ఆధారపడి ఉన్న వారి గురించి ఆలోచించండి.



Click it and Unblock the Notifications








