కార్ డ్యాష్‌బోర్డ్ వార్నింగ్ లైట్స్, వీటిని గుర్తించటం ఎలా?
కారులో డ్యాష్‌బోర్డ్ అనేది ఓ కమ్యూనికేషన్ వ్యవస్థ లాంటింది. ఇది అనేక ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (ఓబిడి) (స్పీడోమీటర్, టాకోమీటర్, ట్రిప్‌మీటర్, ఫ్యూయెల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్స్ మొదలైన వాటిని చూపించేంది)ను కలిగి ఉంటుంది. ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అంటే, కారు పనితీరు, పెర్ఫామెన్స్ తదితర అంశాలకు సంబంధించిన సాంకేతిక వ్యవస్థ.
మనం కారు స్టార్ట్ చేయటానికి ముందు కీ ఆన్ మోడ్‌లో ఉన్నప్పుడు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్/డ్యాష్‌బోర్డుపై వివిధ సంకేతాలు వెలుగుతూ కనిపిస్తాయి. అందులో కొన్ని ఎరుపు రంగులో, కొన్ని పసుపు రంగులో మరికొన్ని ఆకుపచ్చ రంగులో వెలుగుతూ కనిపిస్తాయి. వీటినే వార్నింగ్ ఇండికేటర్స్ అనికూడా పిలుస్తాం. కారు స్టార్ట్ చేసి, డ్రైవ్ చేయటానికి ముందు ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై ఎలాంటి వార్నింగ్ ఇండికేటర్ కనిపించకుండా ఉంటేనే, వాహనాన్ని ముందుకు నడపాలి.
అలాకాకుండా, ఇంజన్ ఆన్ చేసిన తర్వాత కూడా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై ఏవైనా వార్నింగ్ లైట్స్ కనిపిస్తున్నాయంటే, కారులో ఆ వార్నింగ్ లైట్‌కు సంబంధించిన భాగంలో ఏదో సమస్య ఉందని లేదా ఆ వార్నింగ్ లైట్‌కు సంబంధించిన పరికరాన్ని ఆన్ చేయటమో లేదా ఆఫ్ చేయటమో మర్చిపోయారని అర్థం. దాదాపు అన్ని కార్లలో ఈ వార్నింగ్ ఇండికేటర్స్ ఒకేవిధంగా ఉంటాయి. ఈ కథనంలో మనం సదరు వార్నింగ్ లైట్స్ గురించి, వాటి పనితీరు గురించి క్లియర్‌గా తెలుసుకుందాం రండి..!

ఇంజన్ వార్నింగ్
ఈ ఫొటోలో కనిపిస్తున్న వార్నింగ్ ఇండికేటర్‌ను చూడండి. ఇది ఇంజన్ వార్నింగ్ ఇండికేటర్. ఇంజన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో లేదా ఇంజన్ ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్‌లో ఏదైనా సమస్య ఉన్నా ఈ వార్నింగ్ ఇండికేటర్ తెలుపుతుంది. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ లైట్ ఆన్ అయితే, మీ కారును వీలైనంత త్వరగా సర్వీస్ సెంటర్ వద్దకు తీసుకువెళ్లి సమస్యను సరిచేయించుకోవాలి. ఈ లైట్ వెలిగినప్పుడు మీరు కొంత దూరం డ్రైవ్ చేయాల్సిన పరిస్థితుల్లో హార్డ్ యాక్సిలరేషన్ ఇవ్వకుండా నెమ్మదిగా నడపాలి.

ఇంజన్ ఓవర్‌హీటింగ్
మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ ఇండికేటర్ ఆన్ అయితే, మీ కారులోని ఇంజన్ అధిక ఉష్ణానికి (ఓవర్‌హీట్)కు గురైనట్లు అర్థం. ఈ ఇండికేటర్ కనిపించిన వెంటనే, కారును రోడ్డుకు పక్కగా సురక్షితమైన ప్రాంతంలో నిలిపి, రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌కు కాల్ చేయటం మంచిది.

బ్యాటరీ అండ్ చార్జింగ్
ఇది బ్యాటరీ అండ్ చార్జింగ్ లైట్ ఇండికేటర్‌ను చూపిస్తుంది. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ లైట్ ఆన్ అయినట్లయితే, మీ కారులోని బ్యాటరీ చార్జింగ్ కావట్లేదని అర్థం. ఇది లోపపూరితమైన ఆల్టర్‌నేటర్ కారణంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ వార్నింగ్‌ను విస్మరిస్తే, కొంత కాలానికి బ్యాటరీ పూర్తిగా ఖాలీ అయిపోయి, పనిచేయటం మానేస్తుంది.

ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్
పవర్ స్టీరింగ్ ఉండే కార్లలో ఈ ఇండికేటర్ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ ఇండికేటర్ ఆన్ అయితే, పవర్ స్టీరింగ్‌లో ఏదో సమస్య ఉన్నట్లు అర్థం. ఈ వార్నింగ్ లైట్ ఆన్ అయితే, పవర్ స్టీరింగ్ ఫీచర్ పనిచేయటం మానేసి, అది నార్మల్ స్టీరింగ్ మారిపోతుంది. అలాంటప్పుడు కాను స్టీర్ చేయటం కాస్తంత భారంగా అనిపిస్తుంది.

పార్కింగ్ బ్రేక్/హ్యాండ్ బ్రేక్
ఈ ఇండికేటర్ ఆన్‌లో ఉంది అంటే, మీరు పార్కింగ్ బ్రేక్/హ్యాండ్ బ్రేక్ సిస్టమ్‌ను ఆన్ చేసి ఉన్నారని అర్థం. ఆ బ్రేక్‌ను రిలీజ్ చేసే వరకు ఇది వెలుగుతూనే ఉంటుంది. దీన్ని రిలీజ్ చేయకపోతే వాహనం ముందుకు నడవదు. ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ లైట్ ఆన్ అయినట్లయితే, బ్రేకింగ్ సిస్టమ్‌లో ఏదో సమస్య ఉన్నట్లు అర్థం.

యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)
ఇది యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)ను తెలియజేస్తుంది. ఏబిఎస్‌లో ఏదైనా లోపం ఉన్నప్పుడు ఈ వార్నింగ్ ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఈ లైట్ ఆన్ అయితే, మీ బ్రేకింగ్ సిస్టమ్ పూర్తిగా పనిచేయదని అర్థం కాదు. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ లైట్ ఆన్ అయితే, నార్మల్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కారును కంట్రోల్ చేయవచ్చు. అయితే, ఈ సందర్భంలో ఏబిఎస్ మాత్రం పనిచేయదు. కాబట్టి, వీలైనంత త్వరగా ఈ సమస్యను సరిచేయించుకోవటం ఉత్తమం.

లో ఆయిల్ ప్రెజర్
ఆయిల్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఈ లైట్ ఆన్ అయిన తక్షణమే కారులోని ఆయిల్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలి. తక్కువ ఆయిల్ లెవల్స్ కారు నడిపినట్లయితే, ఇంజన్ తీవ్రంగా దెబ్బతింటుంది.

హై/ఫుల్ బీమ్ లైట్
కారు హెడ్‌లైట్ హై/ఫుల్ బీమ్‌లో ఉందని ఈ ఇండికేటర్ తెలియజేస్తుంది. సిటీ రోడ్లపై ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకు లో బీమ్‌లో వెల్లటం సురక్షితం.

ఫాగ్ లైట్
ఫాగ్ లైట్లు ఆన్‌లో ఉన్నప్పుడు ఈ ఇండికేటర్ ఆన్ అవుతుంది.

హాజర్డ్ వార్నింగ్ లైట్స్
తన కారులో సమస్య ఉందని ఇతర డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు లేదా అత్యవసరంగా వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ లైట్స్‌ను ఉపయోగిస్తారు. ఇది ఆన్ చేసినప్పుడు అన్ని ఇండికేటర్ లైట్లు ఆన్/ఆఫ్ అవుతుంటాయి.

ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్
ఈ ఇండికేటర్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ గురించి తెలియజేస్తుంది. ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ను మ్యాన్యువల్‌గా ఆఫ్ చేసినట్లయితే, ఇది వెలుగుతుంది.

టైర్ ప్రెజర్ మోనిటరింగ్
ఇది కొన్ని రకాల హైఎండ్ కార్లలో ఉంటుంది. టైర్లలో గాలి తక్కువగా ఉందని గుర్తించి, ఇది డ్రైవర్‌కు సమాచారం అందిస్తుంది.

కార్ డోర్స్ ఇండికేటర్
కారు డోర్లను సరిగ్గా వేయకపోయినప్పుడు ఈ ఇండికేటర్ ఆన్ అవుతుంది. అన్ని డోర్లు సరిగ్గా మూసివేసిన తర్వాత ఇది ఆఫ్ అవుతుంది.

సీట్ బెల్ట్ రిమైండర్
సీట్ బెల్ట్ ధరించలేదని ఇది డ్రైవరుకు తెలియజేస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోను సీట్ బెల్ట్ ధరించిన తర్వాత కారును ముందుకు నడపటం సురక్షితం.

గ్లో ప్లగ్ వార్నింగ్
దీనిని డీజిల్ కార్లలో ఉపయోగిస్తారు. డ్యాష్‌బోర్డులో ఈ లైట్ ఆఫ్ అయ్యే వరకు ఇంజన్‌ను స్టార్ట్ చేసే ప్రయత్నం చేయకూడదు.

లో ఫ్యూయెల్ ఇండికేటర్
కారు ట్యాంకులో ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇండికేటర్ ఆన్ అవుతుంది.

వార్నింగ్ లైట్
ఇతర ఇండికేటర్ లైట్లతో పాటే దీన్ని జోడిస్తారు. ఈ లైట్ ఆన్ అయితే, కారులో ఏదో తెలియని సమస్య ఉందని అర్థం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ వార్నింగ్ లైట్ ఆన్ అయితే, తక్షణమే సర్వీస్ ఇంజనీర్స్‌ను సంప్రదించాలి.

ఫ్రంట్ విండ్‌షీల్డ్ డిఫ్రోస్ట్
డ్రైవర్ కారులో ఫ్రంట్ విండ్‌షీల్డ్ డిఫ్రోస్ట్ ఫంక్షన్‌ను యాక్టివేట్ చేసినప్పుడు ఈ లైట్ ఆన్ అవుతుంది.

రియర్ విండ్‌షీల్డ్ డిఫ్రోస్ట్
ఫ్రంట్ విండ్‌షీల్డ్ డిఫ్రోస్ట్ మాదిరిగానే డ్రైవర్ కారులో రియర్ విండ్‌షీల్డ్ డిఫ్రోస్ట్ ఫంక్షన్‌ను యాక్టివేట్ చేసినప్పుడు ఈ లైట్ ఆన్ అవుతుంది.

టర్న్ ఇండికేటర్స్
ఇది అందరికీ తెలిసినదే. కారును కుడి వైపుకి లేదా ఎడమ వైపుకి టర్న్ చేసేటప్పుడు లేదా ఏదైనా వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు, సదరు వాహన డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు వీటిని ఆన్ చేస్తారు.

రియర్ ఫాగ్ ల్యాంప్స్
వెనుక వైపు ఫాగ్ ల్యాంప్స్ ఉండే కార్లలో ఈ ఇండికేటర్ ఉంటుంది. డ్రైవర్ వీటిని ఆన్ చేసినప్పుడు ఈ ఇండికేటర్ ఆన్ అవుతుంది.

క్రూయిజ్ కంట్రోల్
క్రూయిజ్ కంట్రోల్ ఉండే కార్లలో ఈ ఇండికేటర్ ఉంటుంది. డ్రైవర్ కారులో క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసినప్పుడు ఈ ఇండికేటర్ ఆన్ అవుతుంది.

చైల్డ్ సేఫ్టీ లాక్
ఇది చైల్డ్ సేఫ్టీ లాక్ ఆన్ చేసి ఉండటాన్ని తెలియజేస్తుంది. అవసరం లేదనుకున్నప్పుడు దీనిని ఆఫ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








