సులువుగా కార్లకు సన్ ఫిల్మ్‌ను తొలగించటం ఎలా..?
కార్లకు సన్ ఫిల్మ్‌లను తొలగించడానికి మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. మే 19, 2012 నుండి దేశవ్యాప్తంగా రోడ్లపై సంచరించే వాహనాల అద్దాలపై నల్లటి ఫిల్ములను ఉపయోగించడాన్ని సుప్రీం కోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఈ సన్ ఫిల్ములను తొలగించడానికి వాహన చోదకుల నుండి భారీగా డబ్బులను వసూలు చేస్తున్నారు.
వాస్తవానికి సన్ ఫిల్మ్‌లు తొలగించటం పెద్ద కష్టమేమీ కాదు. కాస్తంత ఓర్పుతో, మీ సమయాన్ని వెచ్చించగలిగనట్లయితే, ఇంటి వద్దనే చక్కగా వీటిని తొలగించుకోవచ్చు. ఇందుకోసం భారీ పనిముట్లు కూడా అవసరం లేదు. మరి కార్లకు సన్ ఫిల్మ్‌లను ఎలా తొలగించుకోవాలో ఈ కథనం తెలుసుకుందాం. రండి.
సన్ ఫిల్మ్‌లు తొలగించడానికి ఓ పదునైన కత్తి (పెన్సిల్ కట్టర్ వంటిది అయితే మేలు), వాటర్ స్ప్రేయర్, లేదా గాజు అద్దాలను శుభ్రం చేసే కోలిన్ స్ప్రే, అద్దాలను శుభ్రం చేసే క్లాత్ ఉంటే సరిపోతుంది.
కార్లకు సన్ ఫిల్మ్‌లను తొలగించే విధానం:
* ముందుగా సన్ ఫిల్మ్‌లను తొలగించాల్సిన కారును సుమారు 20-30 నిమిషాలు ఎండలో పార్క్ చేసి ఉంచాలి.
* ఇలా చేయడం కారు అద్దాలు వేడెక్కి, వాటికి అంటించిన సన్ ఫిల్మ్‌లు వ్యాకోచిస్తాయి. ఫలితంగా వాటిని సులువుగా తొలగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ మీ కారును ఎండలో పార్క్ చేసే అవకాశం లేనట్లయితే, హెయిర్ డ్రైయర్‌ను ఉపయోగించి కారు అద్దాలను వేడిగా అయ్యేలా చేయవచ్చు.
* కారు అద్దాలు వేడెక్కిన తర్వాత సన్ ఫిల్మ్‌లు అంటించిన వైపు నీటిని చిలకరించాలి (స్ప్రే చేయాలి).
* నీటిని చిలకరించిన తర్వాత మరో ఐదు నిమిషాల పాటు కారును ఎండలో ఉంచాలి.
* ఆ తర్వాత అద్దానికి అంటించిన సన్ ఫిల్మును ఒక అంచున నెమ్మదిగా కత్తితో పైకి లేపి, చేతికి బాగా అందే విధంగా వచ్చిన తర్వాత ఎక్కడా ఆపకుండా జాగ్రత్తగా లాగాలి. ఆపుతూ ఆపుతూ లాగినట్లయితే, సన్ ఫిల్ముకు ఉండే జిగురు కారు అద్దాలకు అంటుకునే ఆస్కారం ఉంది.
* సన్ ఫిల్మ్ పొడిగా అవ్వకుండా ఉండటం కోసం లాగిన సన్ ఫిల్మ్‌కు, అద్దానికి మధ్య భాగంలో నీటిని స్ప్రే చేస్తూ ఉండాలి.
* ఒకవేళ సన్ ఫిల్మ్ మధ్యలో చినిగిపోయి కొద్ది భాగమే ఊడి వచ్చినట్లయితే, మిగిలిన భాగాన్ని పైన తెలిపిన విధంగా మళ్లీ మొదటి నుండి తొలగిస్తూ రావాలి.
* ఒకవేళ సన్ ఫిల్మ్ తొలగించడానికి గట్టిగా ఉన్నట్లనిపిస్తే, హెయిర్ డ్రైయర్‌ను ఉపయోగించి అద్దాన్ని వేడి చేయండి లేదా ఎండలో మరికొద్ది పార్క్ చేసి ఉంచి తర్వాత ప్రయత్నించండి.
పైన తెలిపిన పద్ధతిని జాగ్రత్తగా పాటిస్తే, పైసా ఖర్చు లేకుండా కార్లకు సన్ ఫిల్మ్‌లను తొలగించుకోవచ్చు. ఇలా కార్లకు సన్ ఫిల్మ్‌లను తొలగించడం పూర్తయిన తర్వాత, అద్దాలకు జిగురు (గ్లూ) అంటుకున్నట్లనిపిస్తే, అద్దాలను శుభ్రం చేసే ద్రవం ఉపయోగించి జిగురును శుభ్రం చేయవచ్చు. జిగురు పూర్తిగా శుభ్రమైన తర్వాత, మెత్తని క్లాత్‌తో కారు అద్దాలపై వాటర్ స్ప్రే చేసి క్లీన్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి.. మే 19, 2012 నుండి కార్లకు అక్రమ సన్ ఫిల్మ్‌ను వాడటం నిషేధం.


Click it and Unblock the Notifications









