కారును సురక్షితంగా రివర్స్ పార్క్ చేయటం ఎలా?
కారును రివర్స్ చేయటం, అలాగే రివర్స్‌లో పార్క్ చేయటం చాలా మెలకువతో కూడుకున్న విషయం. ఈ సందర్భంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, మనం ప్రమాదం తలుపును తట్టినవారు అవుతాం.
కారును నేరుగా ముందుకు నడిపినంత సులువు కాదు రివర్స్ చేయడం అంటే. రివర్స్ చేసేటప్పుడు చుట్టుపక్కల పరిసరాలపై దృష్టి, ఏకాగ్రత, శ్రద్ధ, అప్రమత్తత ఎంతో అవసరం.
కారును రివర్స్ చేసేటప్పుడు లేదా రివర్స్‌లో పార్క్ చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కారును రివర్స్ చేసేటప్పుడు సమీపంలో ఉండే పాదచారులు, ట్రాఫిక్‌ను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఒకవేళ రోడ్డుపై రివర్స్ చేస్తున్నట్లయితే, వెనుక వచ్చే ట్రాఫిక్, వ్యక్తులు, వాహనాలపై ఓ కన్ని వేసి ఉంచాలి. ముందు వైపు, వెనుక వైపు, మీ రెండు భుజాలకు అటు ఇటు వైపులా అలాగే మిర్రర్స్‌లో గమనించి, ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కారును రివర్స్ చేయాలి.

పాఠశాలలు, ఆట స్థలాలు, నివాస స్థలాలు, పార్కులు వంటి స్థలాల్లో చిన్న పిల్లలు ఎక్కువగా తిరుగుతుండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇలాంటి ప్రాంతాల్లో కారును రివర్స్ లేదా పార్క్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తతో వ్యవహరించాలి. కారును రివర్స్ చేసే సమయంలో పాదచారులకు, ట్రాఫిక్‌కు దారిని వదలటం మర్చిపోకండి.

ఒకవేళ కారును రివర్స్ చేసేటప్పుడు మీ వెనుక ఉండే వస్తువులు/ఆటంకాలు మీకు స్పష్టంగా కనిపంచికపోయినట్లయితే, ఇతరుల సహాయం తీసుకొని, వారు మార్గదర్శం చేసిన విధంగా కారును రివర్స్ చేయండి.

పెద్ద రోడ్డు లోనుంచి చిన్న రోడ్డుకు రివర్స్ చేసేటప్పుడు, రోడ్డును జాగ్రత్తగా పరిశీలించి పూర్తిగా సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రివర్స్ చేయండి. ఇలా ఒక రోడ్డు నుండి మరొక రోడ్డు లోనికి రివర్స్ చేసేటప్పుడు అవతలి రోడ్డు లోనుంచి వచ్చే వాహనాలకు దారి ఇచ్చే విధంగా రోడ్డుకు ఒక పక్కగా మాత్రమే రివర్స్ చేయాలి.

అయితే, చిన్న రోడ్డు నుండి పెద్ద రోడ్డు లోనికి రివర్స్ చేయటం రిస్కుతో కూడుకున్న పని. ఇది అంత సురక్షితమైనది కాదు.

చీకటి వేళలు, కాంతి తక్కువగా ఉండే ప్రదేశాల్లో రివర్స్ చేసేటప్పు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి. ఒకవేళ రివర్స్ చేసే సమయంలో వెనుక వైపు ఉండే వస్తువులు/ఆటంకాల పట్ల మీకేమైనా సందేహం వస్తే, ఒక్కసారి కారు లోనుంచి క్రిందకు దిగి వాటిని మీ కళ్లతో చూసిన తర్వాత మాత్రమే సురక్షితంగా రివర్స్ చేయండి.

చివరిగా కారును రివర్స్ చేసే సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించటం, మీ దృష్టి వేరే వాటిపైకి మరల్చడం వంటి పనులు చేయకండి.


Click it and Unblock the Notifications








