కొత్త కారు ఓనర్ల కోసం సింపుల్ కార్ కేర్ గైడ్ - చిట్కాలు
కుర్రకారుకి కారు నడపటం అంటే మహా సరదా, వారి దృష్టంతా ప్రధానంగా కారును నడపటం మీదే ఉంటుంది. వీరికి కారు నడపటం మీదున్న ఆసక్తి, కార్ కేర్ మీద ఉండదు. ఏదైనా సమస్య వస్తే అప్పుడు చూసుకుందాంలే అనుకునే వారు చాలా మందే ఉంటారు. ఎక్కువగా కొత్తగా కారు కొనుగోలు చేసేవారు, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి కారుకు సంబంధించిన చిన్న చిన్న విషయాల పట్ల కూడా అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసమే ఈ కథనం.
కారు కొత్తగా నేర్చుకునే, మొట్టమొదటి సారిగా కారు కొనే వారికి ఉపయోగపడే కొన్ని చిట్కాలను ఈ కార్ టాక్ శీర్షికలో తెలుసుకుందాం రండి. ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న చందంగా.. కారు కొనగానే సరిపోదు.. దానిని సమర్థవంతంగా నిర్వహించే విధానం కూడా తెలుసుండాలి. రోడ్డుపై మీరు సురక్షితంగా ప్రయాణించాలన్నా, మీతోటి వారిని సురక్షితంగా ఉంచాలన్నా, మీ కారును కండిషన్‌లో ఉంచుకోవాలాన్ని కొన్ని డ్రైవింగ్ చిట్కాలు, మెళకువలు తెలుసుకొని ఉండాలి.
కారులో చిన్న చిన్న సమస్యలను గుర్తించగలగాలి, కొంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలి. ఇవేమీ లేకుండా కారును ఉపయోగిస్తుంటే, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు కార తాళం చెవులను అందజేయటానికి ముందుకు బేసిక్ కార్ కేర్‌కు సంబంధించిన అంశాల గురించి వారిలో అవగాహన కల్పించడం అవసరం. ఈ నేపథ్యంలో, కారుకు సంబంధించిన కనీస విషయాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో కారుకు సంబంధించిన బేసిక్ టిప్స్ గురించి తెలుసుకోండి.

ఫ్లూయిడ్స్ చెక్ చేయటం
కారులోని వివిధ భాగాల్లో ఉపయోగించే అన్ని ఫ్లూయిడ్స్ లెవల్స్‌ను కనీసం వారానికి ఒక్కసారైనా చెక్ చేసుకోవాలి. ప్రత్యేకించి ఇంజన్ ఆయిల్, పవర్ స్టీరింగ్, బ్రేక్, ట్రాన్సిమిషన్ ఆయిల్స్ మరియు విండ్‌షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్ మొదలైన వాటిని నిత్యం చెక్ చేసుకుంటా, తగ్గినప్పుడు టాప్ అప్ చేయించుకుంటూ ఉండాలి. వీటిలో ఏ ఫ్లూయిడ్ స్థాయి తగ్గినా, సంబంధిత విభాగం పనితీరు దెబ్బతింటుంది.

హోస్ పైపులు, బెల్టులు చెక్ చేయటం
కనీసం రెండు వారాలకు ఒక్కసారైనా కార్ హోస్ పైపులు, డ్రైవ్ బెల్టులు చెక్ చేసుకుంటూ ఉండాలి. డ్రైవ్ బెల్టు లూజ్ అయినా అరిగిపోయినా తక్షణమే దానిని కొత్త బెల్టుతో రీప్లేస్ చేసుకోవాలి. బెల్ట్ పాడైతే ఇంజన్ పనీతీరు దెబ్బతింటుంది. అలాగే, ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లో ఉండే అన్ని హోస్ పైపులు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవటం ఎంతో అవసరం.

బ్యాటరీ చెక్ చేయటం
కారు ఇంజన్ స్టార్ట్ కావటానికి అతి కీలకమైన అంశం బ్యాటరీ. అందుకే బ్యాటరీని ఎట్టి పరిస్థితిలో విస్మరించకూడదు. బ్యాటరీ పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్యాటరీ వీక్ అయినట్లు లేదా పాడైనట్లు అనిపిస్తే, తక్షణమే బ్యాటరీ మార్చుకోవాలి. కారు బ్యాటరీని శుభ్రం ఉంచుకోవాలి.
ఇది కూడా చదవండి: కారు బ్యాటరీ మెయింటినెన్స్ చిట్కాలు

బ్రేక్ సిస్టమ్
కొత్తగా కారు నేర్చుకునే బ్రేక్ సిస్టమ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడు ఏ సందర్భంలో బ్రేకులు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయాలను తెలుసుకోవాలి. బ్రేకింగ్ సిస్టమ్‌లో మీకు ఏదైనా లోపం ఉందనిపిస్తే, తక్షణమే దానిని సరిచేయించుకోవాలి. ప్రతి సర్వీసులో బ్రేక్ ఆయిల్, బ్రేక్ లైనింగ్స్, రోటర్స్, డ్రమ్స్, డిస్క్ బ్రేక్స్‌ను చెక్ చేయించుకోవాలి, అవసరమైతే పాత వాటిని తొలగించి కొత్త వాటితో రీప్లేస్ చేసుకోవాలి.

ఎగ్జాస్ట్ సిస్టమ్ (సైలెన్సర్)
కారులో ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సైలెన్సర్‌లోకి ఆయిల్ లీక్ అవుతుందేమోనని చెక్ చేసుకోవాలి. సైలెన్సర్ వద్ద ఆయిల్ లీక్‌ను విస్మరిస్తే కారులో అగ్నిప్రమాదం జరగొచ్చు. సైలెన్సర్ నుంచి వచ్చే పొగను పరిశీలించాలి. ఎప్పటికప్పుడు పొల్యూషన్ చెకప్ చేయించాలి. సైలెన్సర్ పనితీరు విషయంలో ఏ చిన్నపాటి సందేహం వచ్చినా తక్షణమే సర్వీస్ సెంటర్ వద్దకు తీసుకువెళ్లి ఆ లోపాన్ని సరి చేయించుకోవాలి.

షెడ్యూల్ సర్వీస్
మీ వాహనాన్ని మీరు ఎంత చక్కగా చూసుకుంటే, దానిపై మీ ప్రయాణం అంత సౌకర్యంగా ఉంటుంది. అందుకే, కారును ఎప్పటికప్పుడు లేదా అవసరమైన ప్రతిసారి సర్వీస్ చేయించుకుంటూ, మంచి కండిషన్‌లో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తుండటం వలన ఇంజన్ జీవితకాలం పెరగడంతో పాటుగా పెర్ఫార్మెన్స్, మైలేజ్‌లు పెరగటమే కాకుండా, ఇంజన్ నుంచి వెలువడే కర్భన ఉద్ఘారాల స్థాయి కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

ఏసి, హీటర్ చెక్ చేసుకోవాలి
కారు లోపలి వాతావరణాన్ని చల్లగా లేదా వేడిగా ఉంచేందుకు ఏసి/హీటర్ చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి, వాతావరణాన్ని బట్టి ఏసి/హీటర్లను చెక్ చేయించుకుంటూ, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌ను మార్చుకుంటూ ఉండాలి. ఎయిర్ కండిషన్ సిస్టమ్ మెయింటినెన్స్‌ను విస్మరిస్తే, దాని నుంచి వెలువడే బాక్టీరియా సహిత గాలి మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

స్టీరింగ్, సస్పెన్షన్ సిస్టమ్ చెక్ చేసుకోవాలి
కారులో స్టీరింగ్ అలాగే సస్పెన్షన్ సిస్టమ్ కూడా ముఖ్యమైనవే. స్టీరింగ్ (ప్రత్యేకించి పవర్ స్టీరింగ్) పనితీరును నిత్యం చెక్ చేసుకోవాలి, ఏదైనా లోపం ఉందనిపిస్తే దానిని తక్షణమే సరిచేయించుకోవాలి. చిన్నపాటి గతుకులకే కారు క్రింది భాగం రోడ్డుకు తాకుతున్న శబ్ధం వినిపిస్తే, సస్పెన్షన్ సిస్టమ్‌ను చెక్ చేయించుకోవాలి. ప్రత్యేకించి షాక్ అబ్జార్వర్స్, స్ట్రక్ట్స్, ఛాస్సిస్ పార్ట్స్ మొదలైన వాటిని చెక్ చేయించుకోవాలి.

టైర్లు చెక్ చేసుకోవాలి
చాలా మంది డ్రైవర్లు టైర్లను విస్మరిస్తుంటారు. టైర్లు దెబ్బతింటే ఇంజన్‌పై అధిక భారం పడి ఇంజన్ పనితీరు దెబ్బతినడమే కాకుండా తరచూ పంక్చర్లు కావటం, అరిగిపోయిన టైర్లు పేలిపోవటం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి టైర్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. నిత్యం గతుకుల రోడ్లపై ప్రయాణించే వారైతే వీల్ అలైన్‌మెంట్ చెక్ చేయించుకోవాలి. అరిగిపోయిన టైర్లను కొత్త వాటితో రీప్లేస్ చేసుకోవాలి.

వైపర్స్, లైటింగ్
చివరిగా వైపర్స్, లైటింగ్ సిస్టమ్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. వైపర్లు కేవలం వర్షాకాలంలోనే కాకుండా, అన్ని కాలాల్లోను ఉపయోగపడుతాయనే విషయాన్ని గుర్తుంచుకొని, అవి ఎల్లవేళలా పనిచేసే కండిషన్‌లో ఉండేలా చూసుకోవాలి. లైట్లు, లైట్ పొజిషనింగ్‌ను చెక్ చేసుకోవాలి. లైట్ల కాంతి తగ్గితే అందుకు కారణం బ్యాటరీనా లేక లైట్లా తెలుసుకొని వాటిని రీప్లేస్ చేయాలి.

కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారు గుర్తుంచుకోవాల్సిన టాప్ 10 అంశాలు ఇవి. ఇవి కాకుండా, మీకు తెలిసిన వేరే అంశాలు ఏవైనా ఉంటే వాటిని మా పాఠకులతో పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








