Bike Parcel In Train రైలులో బైక్‌ను ట్రాన్స్‌పోర్ట్ చేయడం ఎలా.. ఎంత ఖర్చు అవుతుంది, రూల్స్ ఏంటి.??
ఉద్యోగరీత్యా లేదంటే వ్యక్తిగత అవసరాల దృష్ట్యా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ కావాల్సి ఉంటుంది. అప్పుడు బైక్‌ను సామగ్రితో పాటు పంపించలేరు. ఇందుకోసం ప్రైవేట్ పార్శిల్ కంపెనీలు ఉన్నాయి. కానీ వీటి ద్వారా ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే భారతీయ రైల్వే సాయంతో చాలా తక్కువ ఖర్చుతో మీ బైక్‌ను ట్రాన్స్‌పోర్ట్ చేయవచ్చు.
అవును ఇండియన్ రైల్వే శాఖ ద్వారా మీరు అతి తక్కువ ఖర్చులో మీ బైక్‌ను పార్శిల్(Bike Parcel By Train) చేయవచ్చు. మీరు మీ బైక్‌ను ఒక చోట నుండి మరొక చోట లగేజ్ లేదంటే పార్శిల్ రూపంలో ట్రాన్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిని మీరు ఆన్‌లైన్ లేదంటే ఆఫ్‌లైన్ రెండు విధాలుగా చేయవచ్చు. అదెలా అంటే..

ఆఫ్‌లైన్ బుకింగ్ ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా మీరు మీ బైక్‌ను పార్శిల్(Bike Parcel Through Offline) చేయాలనుకుంటే ముందుగా మీరు పార్శిల్ బుకింగ్ స్టేషన్‌కు వెళ్లాలి. బుకింగ్ ఫారమ్‌ను మ్యాన్యువల్‌గా ఫిల్ చేయాలి. ఆ తర్వాత పార్శిల్‌తో పాటు ఫార్వార్డింగ్ నోట్‌ను పార్శిల్ బుకింగ్ స్టేషన్‌లో సమర్పించాలి.
ఆ తర్వాత పార్శిల్ బరువు మరియు సరుకు రవాణా ఛార్జీలను బుకింగ్ కౌంటర్ వద్ద మాన్యువల్‌గా లెక్కించి ఎంత ఛార్జీ అనేది సిబ్బంది చెబుతారు. సరుకు రవాణా ఛార్జీలను డిపాజిట్ చేసిన అనంతరం.. రైల్వే రసీదు(RR)ను మీకు అందిస్తారు. గమ్యస్థాన స్టేషన్ నుంచి బైక్ పార్శిల్‌ను తీసుకునేటప్పుడు RR ను సమర్పించాల్సి ఉంటుంది. ఇది ఆఫ్‌లైన్ విధానం.

ఆన్‌లైన్‌లో బుకింగ్ ఎలా: ఆన్‌లైన్ విధానం ద్వారా బైక్‌ను పార్శిల్(Bike Parcel Through Online) చేసేందుకు ముందుగా భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ www.parcel.indianrail.gov.in ను సందర్శించాలి. పోర్టల్‌లో రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. ఆన్‌లైన్ ఫారమ్‌లో మీరు బైక్‌ను ఎక్కడి నుంచి పంపించాలనుకుంటున్నారు(Origin).. మరియు గమ్యస్థాన(Destination) స్టేషన్‌ల వివరాలను ఫిల్ చేయాలి.
ఆ తర్వాత మీరు ఏ రైలులో పార్శిల్ పంపించాలి అనుకుంటున్నారో ఆ ట్రైన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం బుకింగ్ ఫారమ్(Forward Note)ను ఫిల్ చేయాలి. అప్పుడు సిస్టమ్ అంచనా(Estimated) సరుకు రవాణా ఛార్జీలను లెక్కిస్తుంది.. ఆ తర్వాత ఇ- ఫార్వార్డింగ్ నోట్‌ని డిపాజిట్ సిస్టమ్ రూపొందిస్తుంది. అనంతరం ఈ నోట్‌తో పాటు మీ బైక్ పార్శిల్‌ను స్టేషన్‌లో అప్పగించాల్సి ఉంటుంది.

అక్కడ మీ బైక్‌ను తూకం వేస్తారు. బరువు ప్రకారం బుకింగ్ కౌంటర్‌లో అసలు రవాణా ఛార్జీలు ఎంత అనేది లెక్కిస్తారు. ఆ మొత్తం డిపాజిట్ బుకింగ్ కౌంటర్‌లో చెల్లిస్తే సిబ్బంది రైల్వే రసీదు(RR) ఇస్తారు. దానిపై ఉన్న ట్రాక్ అండ్ ట్రేస్ ద్వారా పార్శిల్‌ను మీరు ట్రాక్ చేయవచ్చు.
మీ బైక్ గమ్యస్థానానికి చేరుకున్న అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు SMS నోటిఫికేషన్ వస్తుంది. డెస్టినేషన్ స్టేషన్‌లో డెలివరీ కౌంటర్ వద్ద RRని సమర్పించి మీ బైక్ పార్శిల్‌ను తీసుకోవచ్చు. ఇలా ఆన్‌లైన్ విధానంలో మరింత సింపుల్‌గా మీ బైక్‌ను ట్రాన్స్‌పోర్ట్ చేయవచ్చు.
ఛార్జీలు: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానం ద్వారా ఛార్జీలు అనేవి బైక్ బరువు ఆధారంగా ఉంటుంది. సాధారణంగా 500 కిలోమీటర్ల దూరానికి బైక్‌ను పంపేందుకు సగటు ధర రూ.1200 ఛార్జీలు అవుతాయి. అయితే బైక్ దూరం, బరువును బట్టి ఛార్జీలు మారుతుంటాయి. ఇది కాకుండా బైక్ ప్యాకింగ్‌కు కూడా రూ.300 నుంచి 500 వరకు ఖర్చవుతుందని గమనించాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి: కాగా బైక్‌ను పార్శిల్ లేదా లగేజ్ రూపంలో రవాణా చేయడానికి మీరు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు బైక్‌ను పంపాలనుకుంటున్న రోజుకు కనీసం ఒక రోజు ముందు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ సమయంలో, మీ వద్ద బైక్ యొక్క RC మరియు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.
వీటితో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా అవసరం అవుతాయి. మరో ముఖ్యమైన విషయం బైక్ ప్యాక్ చేసే ముందు, పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా ఖాళీగా ఉండాలని గుర్తుంచుకోవాలి. బైక్ పెట్రోల్ ఉంటే రూ.1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








